కొండెక్కుతున్న కోడి

ABN , First Publish Date - 2022-09-14T05:17:28+05:30 IST

చికెన్‌ ధరలు రోజురోజుకూ కొండెక్కుతున్నాయి. ఏ రోజూ ఒక రేటు ఉండటం లేదు.

కొండెక్కుతున్న కోడి

  • రోజురోజుకూ పెరుగుతున్న చికెన్‌ ధర
  • నెలరోజుల్లోనే రెట్టింపు
  • రేటు చూసి బెంబేలెత్తుతున్న మధ్యతరగతి కుటుంబాలు
  • తగ్గిన కోళ్ల ఉత్పత్తితో పెరుగుతున్న ధర

చికెన్‌ ధరలు రోజురోజుకూ కొండెక్కుతున్నాయి. ఏ రోజూ ఒక రేటు ఉండటం లేదు. ఈ రోజు ఒక  ధర ఉంటే.. వారం రోజుల్లో ఇరవై రూపాయలు పెరుగుతోంది. మరో వారంలో చికెన్‌ ధర త్రిబుల్‌ సెంచరీ కొట్టే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఆదివారం చికెన్‌ వండుకుందామనుకునే కుటుంబాలు రేట్లను చూసి భయపడుతున్నాయి. ప్రస్తుతం పెరిగిన ధరలతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చికెన్‌ అందకుండా పోతోంది.


షాద్‌నగర్‌ / చౌదరిగూడ, సెప్టెంబరు, 13 : ఒక వైపు కోళ్ల కృతిమ కొరత.. మరోవైపు చికెన్‌ ధరల పెరుగుదల.. వెరసీ సామాన్యులు వారంలో ఒక్క రోజు కూడా చికెన్‌ తినే భాగ్యానికి నోచుకోలేకపోతున్నారు. గత నెలలో కేజీ చికెన్‌ రూ.160 ఉంటే.. ప్రస్తుతం కేజీ చికెన్‌ ధర రూ. 280కు చేరుకుంది. కొద్దిరోజుల్లో ఆ ధర రూ.300కు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. నెల రోజుల్లోనే కేజీ చికెన్‌ ధర రెట్టింపు కావడంపై చికెన్‌ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చికెన్‌ మార్కెట్‌ మొత్తం కార్పొరేట్‌ చేతుల్లోనే ఉండటంతోనే ఽధరలపై నియంత్రణ లేకుండా పోతుందని మండిపడుతున్నారు. రాష్ట్రంలో బ్రాయిలర్‌ కోళ్ల ఉత్పత్తి తక్కువగా ఉండటం, ఉన్న బ్రాయిలర్‌ కోళ్ల ఫారాలను కార్పొరేట్‌ సంస్థలు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో రేట్లు అమాంతంగా పెంచుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. 


శ్రావణమాసంలో తగ్గిన ధర

శ్రావణమాసంలో అధికశాతం మంది ప్రజలు మాంసాహారం ముట్టుకోరు. ఆ సమయంలో మాత్రం చికెన్‌ అమ్మకాలు భారీగా పడిపోతాయి. దీంతో కోళ్ల పరిశ్రమ యజమానులకు కొంతమేర నష్టం వస్తుంది. శ్రావణమాసం ముగియగానే కార్పొరేట్‌ చికెన్‌ ధరలను రెండింతలు పెంచి శ్రావణమాసంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల పలురకాల రోగాలకు గురై రోజూ వందల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. అంతేకాకుండా డిమాండ్‌కు తగినట్లు ఉత్పత్తి లేకపోవడం వల్లనే ధరలను పెంచుతున్నారని కార్పొరేట్‌ రిటైల్‌ దుకాణాల యజమానులు చెబుతున్నారు. 


ఎగుమతులతోనే ధర పెరుగుదల  

తెలంగాణా ప్రాంతంలో సుమారు 10వేలకు పైగా బ్రాయిలర్‌ పౌల్ర్టీ ఫాంలు ఉండగా రోజుకూ 1.50 కోట్లపైగా ఉత్పత్తి జరుగుతున్నట్లు తెలిసింది. పౌల్ర్టీరంగంలో ఎక్కువగా కార్పొరేట్‌ సంస్థలు దూసుకురావడం, దేశవ్యాప్తంగా చికెన్‌ కార్పొరేట్‌ షాప్‌లు ఉండటం వల్ల రాష్ట్రం నుంచి బ్రాయిలర్‌ కోళ్లు పెద్దఎత్తున ఎగుమతి చేస్తున్నారు. డిమాండ్‌ తగ్గ ఉత్పత్తి లేకపోవడం, మధ్యమధ్యలో కార్పొరేట్‌ సంస్థలు ఉత్పత్తులను తగ్గించడం, కృతిమ కొరత సృష్టింస్తుండటంతోనే ధరలు పెరగుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గుడ్డు తరహాలోనే చికెన్‌ ధరలను నిర్ణయించడానికి ఒక సంస్థను ఏర్పాటు చేస్తే ధరలను నియంత్రించాలని పౌల్ర్టీ రైతులు కోరుతున్నారు.


ఫీడ్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతోనే.. 

పెట్రోల్‌, డీజిల్‌తోపాటు ఫీడ్‌ ధరలు భారీగా పెరగడంతో డిమాండ్‌ను బట్టి చికెన్‌ ధరలను పెంచాల్సి వస్తుందని బ్రాయిలర్‌ కోళ్ల యజమానులు అంటున్నారు. రాష్ట్రంలో బ్రాయిలర్‌ కోళ్ల పెంపకం చాలా తక్కువగా ఉందని, పెట్రోల్‌, డీజిల్‌తోపాటు ఫీడ్‌ ధరలు పెరగడంతో కోళ్ల పెంపకం సంఖ్య కూడా తగ్గించినట్లు వారు తెలిపారు.


మూతపడుతున్న చికెన్‌ సెంటర్లు 

కోళ్ల కృతిృమ కొరత సృష్టించడం వల్ల చికెన్‌ సెంటర్లను మూసివేయాల్సిన పరిస్థితి నెలకొందని చిన్న వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొట్టకూటి కోసం చికెన్‌ సెంటర్లు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండగల సీజన్‌ వస్తుండటంతో చికెన్‌ ధర మరింత పెరిగే అవకాశం ఉంది.


కోళ్ల కొరతతో ధరల పెరుగుదల

మార్కెట్‌లో కోళ్ల కొరత వల్లనే చికెన్‌ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రోజూ 20కేజీల చికెన్‌ విక్రయించేవాడిని. రేట్లు పెరగడంతో ప్రస్తుతం 5 కేజీలు అమ్మడమే కష్టంగా మారింది. చికెన్‌ ధరలు అదుపులో ఉంటేనే వ్యాపారం సాఫీగా సాగుతుంది.

 - ఎండి అన్వర్‌, చౌదరిగూడ


ధరలు పెరగడం సామాన్యులకు భారం

చికెన్‌ ధరలు అమాంతం పెరగడం వల్ల సామాన్య ప్రజలకు భారంగా మారింది. నిత్యావరస వస్తువులతోపాటు చికెన్‌ ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు చికెన్‌కు దూరం అవుతున్నారు.

 - కుర్వ మల్లేష్‌

--------------------------------------------------------------

స్కిన్‌లెస్‌ చికెన్‌ ధర (కేజీ) పెరుగుదల ఇలా..

ఆగస్టు మొదటి వారం         రూ. 160

సెప్టెంబర్‌ మొదటి వారం రూ. 180 నుంచి రూ.200

ఈ నెల 10వ తేది రూ. 280

మరో రెండురోజుల్లో రూ.300 నుంచి రూ.320కి పెరిగే అవకాశం ఉందని చికెన్‌ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు

---------------------------------------------------------------------

Read more