కోటి రూపాయల నకిలీ, అక్రమ మద్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-12-16T23:20:03+05:30 IST

కొన్ని నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న నకిలీ, అక్రమ మద్యాన్ని ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం.

కోటి రూపాయల నకిలీ, అక్రమ మద్యం పట్టివేత

హయత్‌నగర్‌, ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని బెల్టు షాపుల్లో విక్రయాలు

దాడులు చేసి పట్టుకున్న ఎక్సైజ్‌ పోలీసులు

ఒడిశా నుంచి దిగుమతి అవుతున్నట్లు సమాచారం?

ఇబ్రహీంపట్నం/ యాచారం / హయత్‌నగర్‌, డిసెంబరు 16 : కొన్ని నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న నకిలీ, అక్రమ మద్యాన్ని ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. అధికారులు పట్టుకున్న నకిలీ మద్యం విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని తెలిసింది. నకిలీ, అక్రమ మద్యం కేసు వివరాలను వెల్లడించడానికి ఎక్సైజ్‌ పోలీసులు నిరాకరించారు. ఇప్పటికే నకిలీ, అక్రమ మద్యాన్ని విక్రయిస్తున్న పలువురు నిందితులను జిల్లా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, హయత్‌నగర్‌, ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. వీరి ద్వారా పూర్తి వివరాలను తెలుసుకుంటున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితమే ఎక్సైజ్‌ పోలీసులు ఈ వ్యవహారంలో ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్‌, చౌటుప్పల్‌ మండలంలోని దేవలమ్మ నాగారం గ్రామాల్లో నిర్వహిస్తున్న బెల్టు షాపులపై దాడి చేసి నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. తొలుత ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంతన్‌ గౌరెల్లిలోని ఓ బెల్టు షాపులో నకిలీ, అక్రమ మద్యాన్ని గుర్తించినట్లు తెలుస్తుంది.

ఒడిశా నుంచి వచ్చిన మద్యం?

గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఒడిశా రాష్ట్రం నుంచి ఒక లారీలో 300 కాటన్ల మద్యాన్ని తీసుకువచ్చి హయత్‌నగర్‌ రేడియో స్టేషన్‌ సమీపంలో ఓ రేకుల గదిలో డంపు చేసినట్లు తెలుస్తుంది. ఎక్కువగా అమ్ముడు పోయే ఐబీ, ఓసీ ఫుల్‌ బాటిళ్లను తీసుకువచ్చారు. ఎక్సైజ్‌ అధికారులు, వినియోగదారులు గుర్తించకుండా తెలంగాణ ప్రభుత్వ ఎక్సైజ్‌ స్టిక్కర్లను బాటిళ్లకు అంటించి బెల్టు షాపులకు సరఫరా చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్‌, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలాలలోని బెల్టు షాపులను ఎంచుకుని విక్రయిస్తున్నట్లు సమాచారం. తక్కువ ధరకు ఒరిస్సా నుంచి మద్యం తీసుకువచ్చి తెలంగాణ ప్రభుత్వం ధర కన్న తక్కువ రేటుకు బెల్టు షాపుల నిర్వాహకులకు అందిస్తున్నారు. యాచారం మండలంలోని మంతన్‌గౌరెల్లిలో ఓ మద్యం ప్రియుడు నకిలీ మద్యంను గుర్తించి ఎక్సైజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూపీ లాగారు. దీంతో అసలు విషయం బయట పడింది. బాటిళ్లుకు అంటించిన నకిలీ స్టిక్కర్‌లు స్కాన్‌ కాకపోవడంతో అవి కూడా నకిలీవని తేలాయి. దీంతో జిల్లా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రంగంలోకి దిగారు. యాచారంలోని బెల్టు షాపు నిర్వాహకుడి ద్వారా అసలు వ్యక్తిని హయత్‌నగర్‌లో పట్టుకున్నట్లు తెలిసింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా తీగ లాగితే డొంక కదిలినట్లు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నకిలీ మద్యం అమ్మకాలకు సంబంధించిన నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. హయత్‌నగర్‌లో డంపు చేసిన మద్యాన్ని కూడా ఎక్సైజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నకిలీ, అక్రమ మద్యం డంపు వెనుక బడా మద్యం వ్యాపారులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Updated Date - 2022-12-16T23:20:04+05:30 IST