ముగిసిన సైన్స్‌ఫేర్
ABN , First Publish Date - 2022-12-15T23:49:44+05:30 IST
బాలాపూర్ మండలం నాదర్గుల్‌లోని శ్రీ వంశీధర్ ఉన్నత పాఠశాలల్లో రెండు రోజులపాటు నిర్వహించిన జిల్లా సైన్స్‌ఫేర్ గురువారం ముగిసింది.
రంగారెడ్డి అర్బన్, డిసెంబరు 15 : బాలాపూర్ మండలం నాదర్గుల్‌లోని శ్రీ వంశీధర్ ఉన్నత పాఠశాలల్లో రెండు రోజులపాటు నిర్వహించిన జిల్లా సైన్స్‌ఫేర్ గురువారం ముగిసింది. 50వ జిల్లా స్థాయి సైన్స్, మ్యాథెమెటిక్స్, పర్యావరణ ప్రదర్శనలో మొత్తం 310 ప్రాజెక్టులు ప్రదర్శించారు. 32 పాఠశాలలకు చెందిన సుమారు 7,500 మంది పిల్లలు ప్రదర్శనలను తిలకించారు. ప్రతి ఉప అంశానికి ప్రాథమికోన్నత, ఉన్నత స్థాయిలో ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేశారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపన్యాసాలు ఆకట్టుకున్నాయి. సైన్స్‌ఫేర్‌లో జిల్లా నుంచి ప్రథమ స్థాయిలో నిలిచిన ఉత్తమ ప్రదర్శనలు రాష్ట్ర స్థాయిలో జరిగే గణిత, వైజ్ఞానిక, పర్యావరణ ప్రదర్శనకు ఎంపిక చేశారు. ముగింపు సమావేశానికి శాసన మండలి సభ్యుడు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రాజెక్టులను రూపొందించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. ప్రదర్శనలో ప్రథమ, ద్వితీయ బహుమతులను పొందిన ప్రతి ప్రాజెక్టుకు రూ.3 వేలు, 2వేలు చొప్పున శ్రీ వంశీధర్ పాఠశాల చైర్మన్ క్రిష్ణారెడ్డి నగదు బహుమతి అందజేశారు. అనంతరం కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మాట్లాడారు. విద్యార్థుల మేథాశక్తికి ప్రతిరూపమే ఈ విద్యా ప్రదర్శనలని, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం జీవితాన్ని గుర్తు చేస్తూ, ఆలోచన భిన్నంగా ఉంటే ఆవిష్కరణలు కూడా భిన్నంగానే ఉంటాయని తెలిపారు. పేదరికం సృజనాత్మకతకు అడ్డుకాదని, ప్రతి విద్యార్థి ఏకాగ్రత, నిరంతర శ్రద్ధతో శ్రమిస్తే ఫలితం సాధించవచ్చన్నారు. డీఈవో సుశీందర్‌రావు మాట్లాడుతూ ఎంతో మంది శాస్త్రవేత్తల కృషితోనే నేడు ప్రజలు విజ్ఞాన ఫలాలను అనుభవిస్తున్నారని తెలిపారు. వారి జీవితాలను, స్ఫూర్తిదాయక సంఘటనలను ఆదర్శంగా తీసుకుని నేటి బాలలు కూడా కొత్త ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని ఆయన తెలిపారు. ప్లానెటరీ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ రఘునందన్‌రావు మాట్లాడుతూ భారత మేథస్సు స్వీయ పరికరాలతో అంతరిక్షంలోకి అడుగుపెట్టే దిశగా ఎదిగిందని, దానిని అందిపుచ్చుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సైన్స్ అధికారి వై. శ్రీనివా్‌సరావు, ప్రొఫెసర్ నేతానియల్, శైల, ప్రొఫెసర్ ఆదిలక్ష్మి, జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ రాజిరెడ్డి, డీసీఈబీ సెక్రటరీ రామచంద్రారెడ్డి, వంశీధర్ పాఠశాల డీన్ గోదాలక్ష్మి, అకాడమిక్ ఇన్‌చార్జ్ మధు, ప్రిన్సిపాల్ గోపాలకృష్ణ, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, గైడ్ టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.