సా... గుతున్న పనులు

ABN , First Publish Date - 2022-10-05T05:10:27+05:30 IST

సా... గుతున్న పనులు

సా... గుతున్న పనులు

  • కంకరవేసి వదిలేయడంతో ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు

పెద్దేముల్‌, అక్టోబరు 4: రోడ్డు పనులు ఆలస్యమవుతుండడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. గడవు సమయం దాటినా పనులు పూర్తికావడం లేదు. కంకర వేసి వదిలేయడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పెద్దేముల్‌ మండల కేంద్రం నుంచి తింసన్‌పల్లి, గోపాల్‌పూర్‌, నాగులపల్లి మీదుగా సిద్ధన్నమడుగుతండా వరకు బీటీ రోడ్డుకు ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన కింద 6.14కోట్లు మంజూరయ్యాయి. అందులో రోడ్డు పనులకు 5.79కోట్లు కేటాయించారు. ఈ నిధులతో 9కిలోమీటర్ల బీటీ రోడ్డు వేయాలి. సెప్టెంబరు 2020 నుంచి 2022 మార్చి కల్లా రోడ్డు పనులు పూర్తిచేయాల్సి ఉంది. ఆ గడువు నుంచి ఐదేళ్ల పాటు కాంట్రాక్టర్‌ రోడ్డు మెయింటెనెన్స్‌ చేయాలి. ఇందుకు మరో 35.35లక్షలు కేటాయించారు. అయితే రోడ్డు పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ మార్చి 2022 వరకు సిద్ధన్నమడుగుతండా-నాగులప ల్లి వరకు 3.7కిలోమీటర్లు మాత్రమే బీటీరోడ్డు వేశారు. పనులు ఆలస్యమవుతుండడంపై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నాగులపల్లి-పెద్దేముల్‌ వరకు 5.3కిలోమీటర్ల మేర మట్టి కంకరవేశారు. ప్రస్తుతం నాగులపల్లి వరకు మొత్తం కంకరచిప్స్‌ వేసి వదిలేయడంతో కంకరపై నుంచి జనం నడవలేక రోడ్డు దిగి మట్టిపై నడుస్తున్నారు. ఇక వాహనాలు నడవడం మొత్తమే బంద్‌ అయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కంకరపై ధైర్యం చేసి వాహనాలు నడిపినా స్కిడ్‌ అయ్యి ప్రమాదాలకు గురవుతున్నారు. గమ్యం చేరేలోపే టైర్లు పంక్చర్‌ అవుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి మండల కేంద్రం నుంచి నాగులపల్లి వరకు గల కంకరరోడ్డును త్వరగా బీటీగా మార్చాలని డిమాండ్‌ చేస్తున్నారు.


Read more