రూ.38 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు

ABN , First Publish Date - 2022-10-11T05:44:07+05:30 IST

రూ.38 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు

రూ.38 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు

  • పూర్తయిన టెండర్‌ ప్రక్రియ 
  • పక్షం రోజుల్లో పనులు షురూ.. మార్చి వరకు పూర్తి 
  • ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రావణ్‌ ప్రకాశ్‌

ఆమనగల్లు, అక్టోబరు 10: ఆమనగల్లు-తలకొండపల్లి ప్రధాన రహదారి ఆధునీకరణ పనులు పక్షం రోజుల్లో ప్రారంభించనున్నట్లు ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రావణ్‌ప్రకాశ్‌ తెలిపారు. పట్టణంలో విస్తరించనున్న షాద్‌నగర్‌-ఆమనగల్లు  ప్రధాన రహదారిని సోమవారం ఆర్‌అండ్‌బీ డీఈ రవీందర్‌, ఏఈ రవితేజలతో కలిసి శ్రావ ణ్‌ప్రకాశ్‌ పరిశీలించారు. ఇప్పటికే రోడ్డు విస్తరణకు ఇచ్చిన మార్కింగ్‌ లను చూసి స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. షాద్‌నగర్‌-ఆమనగల్లు ప్రధాన రహదారి తలకొండపల్లి నుంచి ఆమనగల్లు వరకు 18కిలోమీటర్లు విస్తరణకు సెంట్రల్‌ రోడ్‌ ఫండ్‌ నుంచి రూ.38కోట్లు మంజూరైనట్లు ఈఈ శ్రావణ్‌ ప్రకాశ్‌ తెలిపారు. ఆమనగల్లు పట్టణంలో సురసముద్రం బ్రిడ్జి నుంచి మాడ్గుల రోడ్డులో సందబావి వరకు రోడ్డును 66ఫీట్ల వెడల్పుతో నాలుగు లైన్లుగా విస్తరించి డివైడర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. షాద్‌నగర్‌ రోడ్డులో పట్టణాన్ని అనుసరించి ఉన్న బ్రిడ్జిని కూడా ఆధునీకరించి విస్తరించనున్నట్లు తెలిపారు. మార్చి వరకు తలకొండపల్లి-ఆమనగల్లు రోడ్డు ఆధునీకరణ, ఆమనగల్లు పట్టణంలో విస్తరణ పనులు పూర్తి చేస్తామని శ్రావణ్‌ ప్రకాశ్‌ తెలిపారు. రోడ్డు విస్తరణ పనులకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, దుకాణ దారులు, స్థానిక నివాసులు సహకరించాలని ఈఈ కోరారు. రోడ్డుపరిశీలనలో ఈఈ వెంట జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్‌ కమిటీ సభ్యుడు నేనావత్‌ పత్యనాయక్‌, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు నిట్ట నారాయణ, నాయకులు జయరామ్‌, కమటం వెంకటయ్య, వస్పుల సాయిలు, ఎనుముల రమేశ్‌, వడ్డెమోని శివకుమార్‌, డేరంగుల వెంకటేశ్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-11T05:44:07+05:30 IST