రహదారి విస్తరణకు ప్రతిపాదనలు: ఎంపీ

ABN , First Publish Date - 2022-09-26T05:37:41+05:30 IST

రహదారి విస్తరణకు ప్రతిపాదనలు: ఎంపీ

రహదారి విస్తరణకు ప్రతిపాదనలు: ఎంపీ
కడ్తాలలో సెంట్రల్‌లైటింగ్‌ను ప్రారంభిస్తున్న ఎంపీ రాములు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు

ఆమనగల్లు/కడ్తాల్‌, సెప్టెంబరు 25: హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించడానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు  నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ సభ్యుడు పోతుగంటి రాములు తెలిపారు. ఆమనగల్లు పట్టణంలో, కడ్తాల మండల కేంద్రంలో హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో రూ.4.75కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ లైటింగ్‌ను ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎన్‌బీసీ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌నాయక్‌లతో కలిసి ఎంపీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ శ్రీనివా్‌సరెడ్డి, వై్‌స్‌చైర్మన్‌ తోట గిరియాదవ్‌, జడ్పీటీసీలు దశరథ్‌ నాయక్‌, అనురాధపత్యనాయక్‌, దుర్గయ్య, గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి, శ్యామ్‌సుందర్‌, సీతారాములు, జోగు వీరయ్య పాల్గొన్నారు. 

సెంట్రల్‌ లైటింగ్‌ ప్రారంభోత్సవంలో స్వల్ప ఉద్రిక్తత

పట్టణంలో సెంట్రల్‌ లైటింగ్‌ ప్రారంభోత్సవంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయ సమీపంలో ఎంపీ రాములుతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సెంట్రల్‌ లైటింగ్‌ స్విచ్‌ను ఆన్‌చేసి అక్కడి నుంచి మార్కెట్‌ యార్డు  ఎదురుగా ఉన్న మరో స్విచ్‌ను ఆన్‌ చేయడానికి బయల్దేరారు. కాగా స్విచ్‌ బోర్డు సమీపం వద్దకు చేరుకుంటుండగానే అక్కడి సెంట్రల్‌ లైటింగ్‌లు వెలగడంతో అంతా అవాక్కయ్యారు. మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌ నాయక్‌, మరికొందరు కౌన్సిలర్లు కలిసి అక్కడ స్విచ్‌ ఆన్‌ చేసి వెళ్లడం కనిపించింది. అక్కడికి చేరుకున్న ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు స్విచ్‌ను ఆఫ్‌ చేసి మళ్లీ ఆన్‌ చేసి లైట్లను వెలిగించారు. అనంతరం టీఆర్‌ఎస్‌ శ్రేణులు రాజీవ్‌ కూడలికి చేరుకోగా అప్పటికే  ప్రధాన కూడలిలో పెద్దఎత్తున పోగైన బీజేపీ నేతలు ‘భారత్‌ మాతాకీ జై.. బీజేపీ, ఆచారి జిందాబాద్‌..’ అంటూ నినాదాలు చేశారు. ఇది చూసిన టీఆర్‌ఎస్‌ నేతలు బాణసంచా కాలుస్తూ ‘జై తెలంగాణ.. జై టీఆర్‌ఎస్‌’ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఒకింత ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఆంజనేయస్వామి ఆలయం వద్ద నిర్వహిస్తున్న బతుకమ్మ సంబురాల వద్దకు వెళ్లగా బీజేపీ నాయకులు ఆచారితో కలిసి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఆచారి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఆతర్వాత ఇరువర్గాలు ప్రధాన రహదారిపై నుంచి వెళ్లడంతో వివాదం సద్దు మణిగింది. 

Read more