మాంసం, ఉన్ని ఉత్పత్తిని ప్రోత్సహించండి

ABN , First Publish Date - 2022-10-08T04:50:08+05:30 IST

మాంసం, ఉన్ని ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతులు

మాంసం, ఉన్ని ఉత్పత్తిని ప్రోత్సహించండి
ఇబ్రహీంపట్నంలో గొల్ల, కురుమల దసరా సమ్మేళనంలో ప్రసంగిస్తున్న దత్తాత్రేయ

  • హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

ఇబ్రహీంపట్నం, అక్టోబరు 7 : మాంసం, ఉన్ని ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతులు చేసేవిధంగా ప్రభుత్వాలు ప్రోత్సహించాలని హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. ఇబ్రహీంపట్నంలో శుక్రవారం ఏర్పాటు చేసిన గొల్ల, కురుమ దసరా సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గ్రామీణ ప్రాంతాల్లో గొల్ల, కుర్మలు వెనుకబడి ఉన్నారని, ఎంతో మంది పనులు వెతుక్కుంటూ వలసబాట పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మాంసం, ఉన్ని, పాడి ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉన్నందున వీటిపై దృష్టి సారిస్తే వలసలు తగ్గడమేగాక ఆర్థికంగా బలపడుతారని ఆయన సలహా  ఇచ్చారు. హర్యానా రాష్ట్రం చిన్నదైనప్పటికీ పాడి ఉత్పత్తిలో దేశంలో రెండో స్థానంలో ఉందనే విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణలో కూడా గొర్రెలు, మేకల పెంపకంతోపాటు ఉన్నిని పరిశ్రమగా తీర్చిదిద్ద్దేందుకు కృషి జరగాల్సి ఉందన్నారు. ఆడపిల్లల చదువులను ప్రోత్సహించాలని, అప్పుడే వారు స్వతహాగా ఎదుగుతారని అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కురుమ సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ క్యామ మల్లేష్‌ లాంటి వారికి రాజకీయంగా అవకాశాలు కల్పించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒగ్గు కళాకారులకు పింఛన్లు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. క్యామ మల్లేష్‌ మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య జయంతి, వర్థంతిలను అధికారికంగా నిర్వహించాలని, దీనికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం చౌరస్తా నుంచి శాస్తా గార్డెన్స్‌ వరకు ఒగ్గు కళాకారులు ఆటపాటలతో, మహిళలు బోనాలతో ఊరేగింపుగా చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేషం, గద్వాల జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్‌, జైపాల్‌యాదవ్‌, నాయకులు కొత్త కుర్మ శివకుమార్‌, సత్తయ్య, క్యామ శంకర్‌, పొట్టి అయిలయ్య, పగడాల యాదయ్య, చీరాల రమేష్‌, కాలె గణేష్‌, మంగ వెంకటేష్‌, కాలె రమేష్‌, మల్లేష్‌ యాదవ్‌, చిట్టె బాల్‌రాజ్‌, పాశ్య బాష, మంగమ్మ, నిట్లు జగదీష్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-10-08T04:50:08+05:30 IST