యథేచ్ఛగా కబ్జా
ABN , First Publish Date - 2022-07-12T05:07:17+05:30 IST
చెరువులు, కుంటలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం
- ఆక్రమణకు గురవుతున్న తుక్కుగూడ సూరం చెరువు
- గిగా సిటీ పేరుతో అక్రమ వెంచర్
- నాలాలు, కాలువలను పూడ్చివేసిన రియల్టర్లు
- సర్వే చేసి రెండేళ్లయినా ఎఫ్‌టీఎల్ హద్దులు నిర్ణయించని ఇరిగేషన్ అధికారులు
మహేశ్వరం, జూలై 11 : చెరువులు, కుంటలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. అవి రియల్టర్ల అక్రమాలను అడ్డుకోలేక పోతున్నాయి. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన చెరువులను సైతం ఆక్రమించుకోవడానికి కొందరు రియల్టర్లు వెనకాడటం లేదు. నగరానికి కూతవేటు దూరంలో ఉన్న తుక్కుగూడ మున్సిపాలిటీ కేంద్రంలో వందల కోట్ల విలువ చేసే సూరం చెరువు శిఖం భూమి కబ్జాకు గురైంది. ఆ భూమిని సర్వే చేసి ఎఫ్‌టీఎల్ హద్దులు నిర్ణయించాల్సిన ఇరిగేషన్ శాఖ అధికారులు.. పట్టించుకోకపోవడంతో సూరం చెరువు యథేచ్ఛగా కబ్జాకు గురవుతోంది. అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ చెరువు ఆక్రమణకు గురవుతున్నా అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తుక్కుగూడ మున్సిపాలిటీ మంఖాల్ రెవెన్యూ పరిధిలో శ్రీశైలం జాతీయ రహదారిపై సూరం చెరువు ఎఫ్‌టీఎల్ 145 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చెరువు శిఖం భూమి సర్వే నెంబర్ 139లో 40 ఎకరాల 21 గుంట, సర్వే నెంబర్ 140లో 20 ఎకరాల 12 గుంటలు కలిపి మొత్తం 60 ఎరకాల 33 గుంటలు ఉంది. జిల్లాలో భూములకు ధరలు విపరీతంగా పెరగడంతో అక్రమార్కులు సూరం చెరువుతోపాటు శిఖం భూములపై కన్ను పడింది. అక్రమాలు ఆ భూమిని చదును చేస్తూ కబ్జాకు పాల్పడుతున్నారు. 2021లో సూరం చెరువు ఎఫ్‌టీఎల్ సర్వే చేసిన ఇరిగేషన్ శాఖ అధికారులు నేటికీ హద్దు రాళ్లు పాతకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం సూరం చెరువు సుందరీకరణ పేరుతో అభివృద్ధి చేస్తున్న తరుణంలో గిగాసిటీ వెంచర్ యాజమాన్యం చెరువులోకి నీరు వచ్చే నాలాలను, కాలువలను పూడ్చి వేయడం అధికారుల పనితీరును పై కొందరు పర్యావరణ పరిరక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూరం చెరువు కబ్జాపై పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులు కొందరు జిల్లా కలెక్టర్, హెచ్‌ఎండీఎ కమిషనర్, ఇరిగేషన్, తుక్కుగూడ మున్సిపల్ కమిషనర్‌కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదు. అదేవిధంగా నూతనంగా ఏర్పడిన తుక్కుగూడ మున్సిపాలిటీలో 15 మంది కౌన్సిలర్లు ఉన్నా వందల కోట్ల విలువ చేసే ఊరి చెరువు కబ్జాకు గురవుతుంటే చూస్తూ ఊరుకుంటున్నారు తప్ప దానిని కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.
చెరువు ఆక్రమణకు గురైతే చర్యలు తీసుకుంటాం
తుక్కుగూడలోని సూరం చెరువు ఆక్రమణకు గురైతే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. చెరువు విస్తీర్ణం మొత్తం 60 ఎకరాలు ఉంది. ఒకవేళ ఎవరైనా చెరువు భూమిని కబ్జా చేసినట్లైతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. చెరువు ఫుల్‌ట్యాంక్‌లెవల్ (ఎఫ్‌టీఎల్) పరిధిని నిర్ణయించేది ఇరిగేషన్ శాఖాధికారులు. వారు హద్దులు నిర్ణయించాల్సి ఉంటుంది. చెరువు కబ్జాకు గురవుతుంది.. సర్వే చేయాలని కొందరు తమ దృష్టికి తీసుకొ చ్చారు. వెంటనే నేను ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇవ్వగా.. వారు సర్వే చేస్తామన్నారు.
- ఆర్‌పీ జ్యోతి, మహేశ్వరం తహసీల్దార్
ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలి
సూరం చెరువు కబ్జా విషయంపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఏమైనా నిర్మాణాలు చేపడితే.. వాటిని ఆపే అధికారం మాత్రమే మాకు ఉంటుంది. ఈ విషయంపై పర్యావరణ పరిరక్షణ సమితివారు కూడా మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారని ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చాం.
- జ్జానేశ్వర్, తుక్కుగూడ మున్సిపల్ కమిషనర్