ఆరుబయటకు కోళ్ల ఎరువు

ABN , First Publish Date - 2022-12-06T23:37:41+05:30 IST

తక్కళ్లపల్లి-మేడిపల్లి గ్రామాల మధ్య కోళ్ల ఫారాల నిర్వాహకుల కారణంగా మంగళవారం జనం ఇబ్బందిపడ్డారు.

ఆరుబయటకు కోళ్ల ఎరువు
తక్కళ్లపల్లి-మేడిపల్లి గ్రామాల మధ్య వదిలిన కోళ్ల ఎరువు

ఇష్టారాజ్యంగా లిట్టర్‌ను వదిలేస్తున్న ఫాం నిర్వాహకులు

దుర్వాసనతో జనం గోస.. కోళ్ల ఫారాన్ని తీసేయించాలని డిమాండ్‌

యాచారం, డిసెంబరు 6: తక్కళ్లపల్లి-మేడిపల్లి గ్రామాల మధ్య కోళ్ల ఫారాల నిర్వాహకుల కారణంగా మంగళవారం జనం ఇబ్బందిపడ్డారు. హ్యాచరీ్‌సలోని కోళ్ల ఎరువు ఫాంలో ఎండిపోయిన తరువాత దాన్ని ఎత్తిపోయాలి. కానీ ఫాంల నిర్వాహకులు ఎరువు తడిగా ఉన్నపుడే నీరుపోసి లిట్టర్‌ను ఆరు బయటకు వదిలేస్తున్నారు. దాంతో తీవ్ర దుర్వాసనతో జనం ఇబ్బందులు పడుతున్నారు. లిట్టర్‌లో ఎక్కువ మొత్తంలో నీరు కలిపి పంపింగ్‌ చేయడంతో ఆ ద్రవం భూమిలోకి ఇంకి నీరు కూడా కలుషితమవుతోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పౌల్ర్టీ సూపర్‌వైజర్‌ సుధాకర్‌రెడ్డిని ఆంధ్రజ్యోతి వివరణ కోరగా లిట్టర్‌ వ్యర్థాల వాసన రాకుండ కెమికల్‌ చల్లినట్లు చెప్పారు. ఇకపై లిట్టర్‌ నీటితో దుర్వాసన రాకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంట్టాం.

ఈగలతో వేగలేకపోతున్నాం : పి.శ్రీశైలం, ఉపసర్పంచ్‌, తక్కళ్లపల్లి

తక్కళ్లపల్లి-మేడిపల్లి మధ్య ఉన్న కోళ్లఫారం కారణంగా ఈగలతో వేగలేకపోతున్నాం. మేం రోగాల బారిన పడుతున్నాం. కోళ్ల లిట్టర్‌ బయటకు వదలేస్తున్నారు. దుర్వాసన భరించలేకపోతున్నాం. లిట్టర్‌ పూర్తిగా ఎండిపోయిన తరువాతే ఎత్తిపోయాలి. కానీ పచ్చిగా ఉన్నప్పుడే పైపులతో పొలంలోకి వదుళ్తున్నారు. వాసన భరించలేకపోతున్నం. అలాగే కలుషిత నీరు భూమిలోకి భూగర్భ జలం కలుషితమవుతుంది. సమస్యపై అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదు.

భూగర్భ జలం కలుషితమవడం ఖాయం : ఆలంపల్లి నర్సింహ, మేడిపల్లి

కోళ్ల లిట్టర్‌ నీటిలో కలిపి వదిలేస్తున్నారు. వాసన భరించలేకపోతున్నాం. ఈ వ్యర్థం అంతా ఇంకి భగర్భ జలం కలుషితమైతుంది. అధికారులు పట్టించుకోవడం లేదు. కోళ్లఫారాల్లో గుడ్లు పగిలి ఈగలు వృద్ధి చెందుతున్నాయి. ఊరంతా ఈగల ముసురుతున్నాయి. కాలుష్యాన్ని వెదజల్లుతున్న కోళ్లఫాంను తీసేయాలి.

Updated Date - 2022-12-06T23:37:42+05:30 IST