మా భూమిని మాకే కేటాయించాలి

ABN , First Publish Date - 2022-12-15T00:26:33+05:30 IST

మా భూమిని మాకే కేటాయించాలని కోరుతూ ఎన్కతల గ్రామ దివ్యాంగులు ధర్నాకు దిగారు. గతంలో దివ్యాంగుల కోసం కేటాయించిన భూమిని ప్రస్తుతం ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తుండటాన్ని నిరసిస్తూ ఎన్కతల గ్రామ వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.

మా భూమిని మాకే కేటాయించాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న దివ్యాంగులు

కలెక్టరేట్‌ ఎదుట ఎన్కతల గ్రామ దివ్యాంగుల ఆందోళన

వికారాబాద్‌, డిసెంబరు 14: మా భూమిని మాకే కేటాయించాలని కోరుతూ ఎన్కతల గ్రామ దివ్యాంగులు ధర్నాకు దిగారు. గతంలో దివ్యాంగుల కోసం కేటాయించిన భూమిని ప్రస్తుతం ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తుండటాన్ని నిరసిస్తూ ఎన్కతల గ్రామ వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకుడు వడ్ల మురహరి మాట్లాడుతూ ఎన్కతల గ్రామ రెవెన్యూ పరిధి సర్వేనెంబర్‌-174లో 20 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇరవై ఎకరాల భూమిని వికలాంగుల సమైక్య సంఘానికి కేటాయించిందని, ప్రస్తుతం దానిని లాక్కునే ప్రయత్నం చేస్తుందన్నారు. భూమి కేటాయించినప్పటి నుంచి పలు అభివృద్ధి పనులు చేశామని, రాళ్లు తొలగించి బోరు బావులను సైతం వేసినట్లు తెలిపారు. ఆ భూమిని సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నామని వాపోయారు. ఇప్పుడు భూమిని లాక్కునేందుకు ఆర్డీవో నుంచి సమాచారం వచ్చిందని, ఎట్టి పరిస్థితుల్లో భూమిని వదులుకొనే ప్రసక్తే లేదని, ప్రాణాలు తీసుకోవడానికైనా సిద్ధమవుతామని హెచ్చరించారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనలో దివ్యాంగులు పోచయ్య, సంగయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:26:34+05:30 IST