నర్సరీలను ప్రభుత్వ స్థలాల్లోకి మార్చాలి
ABN , First Publish Date - 2022-12-16T00:04:51+05:30 IST
జిల్లాలో పరిధిలోని ప్రైవేట్ స్థలాల్లో నిర్వహిస్తున్న నర్సరీలన్నింటినీ వారం రోజుల్లో ప్రభుత్వ స్థలాల్లోకి మార్చాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు.
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్, డిసెంబరు 15: జిల్లాలో పరిధిలోని ప్రైవేట్ స్థలాల్లో నిర్వహిస్తున్న నర్సరీలన్నింటినీ వారం రోజుల్లో ప్రభుత్వ స్థలాల్లోకి మార్చాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో హరితహారం నర్సరీలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతివనాలు, గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం, తదితర అంశాలపై మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేట్ స్థలాల్లో నిర్వహిస్తున్న నర్సరీలన్నింటినీ ప్రభుత్వ స్థలాల్లోకి మార్చాలని, మొక్కలను నాణ్యమైన మట్టితో బ్యాగ్ఫిల్లింగ్ చేపట్టాలని సూచించారు. మొక్కలు వందశాతం మొలకెత్తేలా చూడాలని, వనసేవకుల ద్వారా నర్సరీలను నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, బృహత్ పల్లె ప్రకృతివనాలకు సంబంధించి స్థల సేకరణ పనులను తహసీలార్ల సహకారంతో పూర్తి చేయాలని అధకారులను ఆదేశించారు. క్రీడా ప్రాంగణాల్లో మొలిచిన గడ్డి, పిచ్చిమొక్కలను తొలగించి అందంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు. పంచాయతీల్లో పారిశుధ్య పనులను సక్రమంగా నిర్వహించి పరిశుభ్రంగా ఉంచాలని, జిల్లాలో మొదటి విడతలో మంజూరైన మన ఊరు-మన బడి పనులను వేగవంతం చేసి పాఠశాలలను అభివృద్ధి చేయాలని అన్నారు. పనులు పూర్తయిన వెంటనే బిల్లులు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా రెవిన్యూ అధికారి ఆశోక్‌కుమార్, డీఆర్డీవో కృష్ణన్, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు తదితరులు పాల్గొన్నారు.