మునుగోడు ఉప ఎన్నికకు ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2022-10-07T05:46:52+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికకు ఎమ్మెల్యేలు

మునుగోడు ఉప ఎన్నికకు ఎమ్మెల్యేలు

  • తాండూరు, కొడంగల్‌, వికారాబాద్‌ ఎమ్మెల్యేలకు ఇన్‌చార్జి బాధ్యతలు 
  • ఒక్కొక్కరికీ రెండేసి గ్రామాల అప్పగింత 

వికారాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వికారాబాద్‌ జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. బీఆర్‌ఎ్‌స(టీఆర్‌ఎస్‌) అభ్యర్థి తరఫున ప్రచారం చేసేందుకు వికారాబాద్‌, తాండూరు, కొడంగల్‌ ఎమ్మెల్యేలను రెండేసి గ్రామాలకు ఎన్నికల ఇన్‌చార్జిలుగా పార్టీ అధిష్టానం నియమించింది. తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డిని ఉడుతలపల్లి, పడమటితల్ల గ్రామాలకు ఇన్‌చార్జిగా నియమించారు. ఉడుతలపల్లిలో 924 మంది ఓటర్లు ఉండగా, పడమటితల్లలో 608 మంది ఓటర్లు ఉన్నారు. కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని కొండాపురం, నర్మెట్ల గ్రామాలకు ఇన్‌చార్జిగా నియమించారు. కొండాపురంలో 1657 మంది ఓటర్లు ఉండగా, నర్మెటలో 1497 మంది ఓటర్లు ఉన్నారు. వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు చౌటుప్పల్‌ మునిసిపాలిటీలో తంగడ్‌పల్లి పరిధిలోకి వచ్చే 4వ వార్డు, 15వ వార్డుల బాధ్యతను అప్పగించారు. కాగా, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది. పార్టీ అభ్యర్థి విజయం సాధించేందుకు వ్యూహ రచన చేస్తూ ఎక్కువ మెజారిటీ కోసం కృషి చేయాల్సి ఉంటుంది. 

కత్తి మీద సామే..

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారానికి వెళుతున్న ఎమ్మెల్యేల పరిస్థితి కత్తి మీద సాములా ఉండబోతోంది. తమకు కేటాయించిన ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పడేలా ప్రచారానికి వెళుతున్న జిల్లా ఎమ్మెల్యేలు ఎంతగానో కృషి చేయాల్సి ఉంటుంది. తమ నియోజకవర్గ బాస్‌లు ఎన్నికల ప్రచారానికి వెళ్లే గ్రామాల్లో అధికార పార్టీ అభ్యర్థికి మెజారిటీ వస్తే పార్టీ అధిష్టానం వద్ద ఎప్పటిలాగే మంచి గుర్తింపు ఉంటుందని, మెజారిటీ తగ్గితే తమ బాస్‌ల పరిస్థితి ఎలా ఉంటుందోనని పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మునుగోడు ఉపఎన్నికను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో పార్టీ వర్గాల్లో తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్న దిగాలు నెలకొంది.


Updated Date - 2022-10-07T05:46:52+05:30 IST