ఆమనగల్లుకు మహర్దశ
ABN , First Publish Date - 2022-12-16T23:27:54+05:30 IST
ఆమనగల్లు పట్టణంలో పలు అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ముమ్మరంగా సాగుతున్న అభివృద్ధి పనులు
ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చొరవతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, కళాశాల, గ్రంథాలయ భవన నిర్మాణాలు
ఆమనగల్లు, డిసెంబరు 16: ఆమనగల్లు పట్టణంలో పలు అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న పలు పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయి. కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్ చొరవతో ఆయా పనులకు రూ. 7.50 కోట్లు విడుదల కావడంతో పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. వచ్చే మార్చిలోగా నిర్మాణ పనులు పూర్తిచేసి భవనాలను వినియోగంలోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మోడల్ గ్రంథాలయ భవన నిర్మాణం
పట్టణంలోని అంగడిబజార్‌లో జవహార్ శాఖ ఆంద్ర గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరుకుంది. జిల్లా గ్రంథాలయ సంస్థ అప్పటి చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, మంత్రి సబితారెడ్డిలు నూతన మోడల్ గ్రంథాలయ భవన నిర్మాణానికి రూ.కోటి నిధులు మంజూరు చేయించారు. భనవ నిర్మాణం పనులు తుదిదశకు చేరుకున్నాయి.
ముమ్మరంగా ఇంటిగ్రెటెడ్ మార్కెట్ పనులు
ఆమనగల్లులో కూరగాయలు, చేపలు, మాంసం విక్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రెటెడ్ మార్కెట్ యార్డ్ నిర్మాణానికి రూ. 4.50 కోట్లు నిధులు విడుదలచేసింది. వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో దీని నిర్మాణానికి 1.04 ఎకరాల భూమిని కేటాయించారు. 2021 నవంబర్ 8న మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితారెడ్డి శంకుస్థాఫన చేశారు. పనుల ప్రారంభంలో జాప్యం జరుగడంతో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రత్యేక శ్రద్ద తీసుకొని మరో కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. దీంతో నెల రోజుల క్రితం పనులు ప్రారంభించి ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మార్చి నాటికి పనులు పూర్తి చేసి యార్డ్‌ను వినియోగంలోకి తీసుకురావడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు చేపట్టారు.
ఎట్టకేలకు కళాశాల భవన నిర్మాణం
ఆమనగల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణం పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. 2001లో ఆమనగల్లు కు ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు కాగా భవనం లేక బాలుర ఉన్నత పాఠశాలలో రెండు దశాబ్దాలుగా అసౌకర్యాల నడుమ కొనసాగుతుంది. కళాశాల భవన నిర్మాణానికి మాజీ ఎ మ్మెల్యే దివంగత ఎడ్మ కిష్టారెడ్డి దాతల సహకారంతో మాడ్గుల రోడ్డులో 9.15 ఎకరాలు భూమిని కొనుగోలు చేసి గవర్నర్ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. భూవివాదం కారణంగా ఏళ్ల కాలంగా పనులు నిలిచిపోయాయి. దీంతో సమస్యను ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం ద్వారా రూ. 2 కోట్లు మంజూరు చేయించారు. ఇటీవల కళాశాల భవన నిర్మాణం పనులు ప్రారంభించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఆమనగల్లు అభివృద్ధికి పెద్దపీట
ఆమనగల్లు అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. కళాశాల, గ్రంథాలయ భవనాలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాలకు ప్రభుత్వం ద్వారా రూ.7.50 కోట్లు మంజూరు చేయించా. కళాశాల భవన నిర్మాణానికి మరో రూ.5 కోట్ల విడుదలకు ప్రతిపాదనలు పంపాం. ఆమనగల్లు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.15 కోట్లు ప్రత్యేక నిధులు మంజూరు చేయించాం.
- గుర్కా జైపాల్ యాదవ్, ఎమ్మెల్యే, కల్వకుర్తి
దుకాణ సముదాయం నిర్మించాలి
మండల పరిషత్ ఎదుట దుకాణ సముదాయం నిర్మించి రోడ్డు విస్తరణతో ఉపాధి కోల్పోయిన చిరువ్యాపారులను ఆదుకోవాలి. వంద పడకల నూతన ఆసుపత్రి భవనాన్ని నిర్మించాలి. ఆమనగల్లు- షాద్‌నగర్ రోడ్డు విస్తరణ పనులు వెంటనే ప్రారంభించారు. కోర్టు నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి. బస్టాండ్ ఉన్నత పాఠశాలకు సొంత భవనం నిర్మించాలి. పండ్ల విక్రయాలకు ప్రత్యేక మార్కెట్ ఏర్పాటు చేయాలి.
- గాజుల శ్రీనివాస్, చిరువ్యాపారుల సంఘం అధ్యక్షుడు, ఆమనగల్లు