వరి వైపే మొగ్గు!
ABN , First Publish Date - 2022-09-08T04:53:10+05:30 IST
ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురవడంతో ఉమ్మడి జిల్లాలో
- ఉమ్మడి జిల్లాలో రెట్టింపు స్థాయిలో వరిసాగు
- వికారాబాద్‌లో భారీగా పెరిగిన పంటల విస్తీర్ణం
- పత్తిసాగుదే అగ్రస్థానం
ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురవడంతో ఉమ్మడి జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగింది. సగటు కంటే అదనంగా రైతులు పంటలు సాగు చేశారు. వరి, పత్తి పంటల సాగుకు మొగ్గు చూపారు. సర్కార్ వరి సాగు వద్దన్నా... ఉమ్మడి జిల్లాలో మెజారిటీ రైతులు ఆ పంటనే ఎక్కువగా సాగు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికే రైతులు సుమారు లక్ష ఎకరాల్లో అదనంగా వరి పంట వేశారు. అయితే మొత్తం పంటల సాగులో పత్తిదే అగ్రస్థానం.
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, సెప్టెంబరు 7) : ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో అనేక ప్రాంతాల్లో పంటల సాగు గణనీయంగా పెరిగింది. ఉమ్మడి జిల్లాలో రైతులు వరిపంటవైపు అధికంగా మొగ్గుచూపారు. గత ఏడాదితో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే రైతులు సుమారు లక్ష ఎకరాల్లో అదనంగా వరి సాగు చేశారు. ఈ సీజన్‌లో ఇంకా దాదాపు మరో 50వేల ఎకరాలకుపైగానే నాట్లు వేసే అవకాశం ఉంది. మొత్తం పంటల సాగులో పత్తిదే అగ్రస్థానం కావడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో పత్తిని అత్యధికంగా సాగు చేశారు. వికారాబాద్‌లో గత ఏడాదికి మించి పత్తిని వేయగా రంగారెడ్డిజిల్లాలో సగటుకు ఇంకా దాటలేదు. మొత్తం మీద ఈ సీజన్ ఆశాజనకంగానే ఉంది. వికారాబాద్ జిల్లాలో సగటుకు మించి అంటే 115శాతం రైతులు పంటలు వేశారు. రంగారెడ్డిజిల్లాలో సుమారు 79.3శాతం పంటలు సాగు జరిగింది. మేడ్చల్ జిల్లాలో ఇప్పటివరకు 80శాతం వరకు పంటలు సాగు చేశారు. వాస్తవానికి రంగారెడ్డి, మేడ్చల్‌జిల్లాలో కూడా సగటుకు మించి పంటలు సాగు జరగాల్సి ఉంది. సీజన్ ఆరంభంలో కురిసిన భారీ వర్షాలు కారణంగా పత్తి, మరికొన్ని పంటల విత్తనాలు నీటమునిగాయి. దీంతో రైతులు ఇపుడు ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటున్నారు. వికారాబాద్ జిల్లాలో వానాకాలం సీజన్‌లో సగటు 5,23,649 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 6,00,639ఎకరాల్లో వేశారు. అలాగే మేడ్చల్ జిల్లాలో 25,030 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయాల్సి ఉండగా 20,843 ఎకరాల్లో రైతులు పంటలు వేశారు.
ఈ సీజన్‌లో వరి సాగు తగ్గించాలని ప్రభుత్వం సూచించినప్పటికీ రైతులు మళ్లీ వరి వైపే మొగ్గు చూపారు. గత ఏడాది కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో రైతులు వరి సాగు చేశారు. వికారాబాద్ జిల్లాలో సగటు 53,864 ఎకరాల్లో వరిసాగు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 1,26,106 ఎకరాల్లో వరి పంట వేశారు. ఇది రెట్టింపు కంటే అధికం కావడం గమనార్హం. ఇంకా కొన్నిచోట్ల వరి వేస్తూనే ఉన్నారు. ఇక రంగారెడ్డిజిల్లాలో ఈసీజన్‌లో సగటు 60,670 ఎకరాల్లో రైతులు వరి వేయాల్సి ఉండగా, అంతకుమించి అంటే 1,01,462 ఎకరాల్లో వరి సాగు చేశారు. మరో 40వేల ఎకరాలు నాటేందుకు నారుమళ్లు సిద్ధంగా ఉన్నాయి. అలాగే మేడ్చల్ జిల్లాలో ఈ సీజన్‌లో వరి 13,810 సాగు చేయాల్సి ఉండగా 17,855 ఎకరాల్లో రైతులు వరి వేశారు. మొక్కజొన్న, కంది పంటల సాగు కూడా ఆశాజనకంగా ఉంది.
భారీగా పెరిగిన వర్షపాతం
ఈ సీజన్ ఆరంభం నుంచి ఉమ్మడి జిల్లాలో వర్షాలు దంచికొడుతూ ఉన్నాయి. అన్ని చెరువులు నిండాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జూన్, జులై నెలల్లో పలు ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో వర్షాలు కురిశాయి. మూడు జిల్లాల్లో సగటుకు మించి వర్షపాతం నమోదైంది. రంగారెడ్డిజిల్లాలో ఇప్పటివరకు 409 మి.మీ సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటికే 646 మి.మీ వర్షం కురిసింది. సగటు కంటే 58శాతం అధికం కావడం గమనార్హం. అలాగే వికారాబాద్ జిల్లాలో 36శాతం, మేడ్చల్ జిల్లాలో 43శాతం అధికంగా వర్షాలు కురిశాయి. బుధవారం కూడా మూడు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
-------------------------------------------------
వానాకాలం ఉమ్మడి జిల్లాలో వివిధ పంటల సాగు
జిల్లా సగటు పంటల సాగు ఇప్పటి వరకు పూర్తయిన సాగు శాతం
రంగారెడ్డి 4,49,980 3,57,169 79.3
వికారాబాద్ 5,23,649 6,00,639 115
మేడ్చల్ 25,030 20,843 80
--------------------------------------------------
జిల్లాల వారీగా ప్రధాన పంటల సాగు
రంగారెడ్డి
పంట సగటు సాగు విస్తీర్ణం ఇప్పటి వరకు సాగు
వరి 60,670 1,01,462
పత్తి 1,98,343 1,57,945
జొన్న 16,755 3,403
మొక్కజొన్న 90,299 73,182
కంది 30,606 17,635
వికారాబాద్
వరి 53,864 1,26,106
పత్తి 1,83,020 2,46,797
జొన్న 8,216 1,722
మొక్కజొన్న 59,716 57,561
కంది 1,55,389 1,42,480
మేడ్చల్
వరి 13,810 17,855
పత్తి 467 72
జొన్న 192 37
మొక్కజొన్న 1,720 322
కంది 728 120