అక్రమాలకు అండ!
ABN , First Publish Date - 2022-03-05T04:28:03+05:30 IST
అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై అందినకాడికి దండుకుంటూ అక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధిలో కొంత కాలంగా యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఒక వేళ కూల్చివేతలు చేపడితే ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారు.
- ఘట్‌కేసర్‌లో జోరుగా అనుమతుల్లేని నిర్మాణాలు
- నాయకుల అండదండలు.. పట్టించుకోని అధికారులు
- పాక్షికంగా కూల్చివేతలు... ఆ వెంటనే తిరిగి నిర్మాణాలు
- దేవాదాయ స్థలంలో జోరుగా కట్టడాలు
అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై అందినకాడికి దండుకుంటూ అక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధిలో కొంత కాలంగా యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఒక వేళ కూల్చివేతలు చేపడితే ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారు.
ఘట్‌కేసర్, మార్చి4 : ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజాపతినిధులు కనుసన్నల్లో పెద్దఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో అక్రమణదారులు అడిందేఆట పాడిందేపాటగా మారింది. ఘట్‌కేసర్ నగరానికి దగ్గరగా ఉండటంతోపాటు నగరంలో ప్లాట్ల ధరలు ఆకాశాన్నంటడంతో రియల్‌వ్యాపారులు, బిల్డర్లు, నగర శివారు ప్రాంతాలపై దృష్టి సారించారు. దీనికి తోడు గతంలో శివారు ప్రాంతంలోని గ్రామ పంచాయతీలను ప్రభుత్వం మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. మొదట్లో చూసిచూడనట్లుగా వ్యవవహరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్మాణాలు సగం పూర్తికాగానే నిర్మాణదారుడి పరిస్థితిని బట్టి వసుళ్లకు పాల్పడుతున్నరనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అక్రమ నిర్మాణాల కూల్చివేతలను అడ్డుకుంటున్న వైనం
మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల హెచ్‌ఎండీఏ, మున్సిపల్ అధికారుల ఎన్ ఫోర్స్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. ఈవిషయం తెలుసుకున్న ప్రజాప్రతినిధులు, అధికారపార్టీ నాయకులు రంగప్రవేశం చేసి కూల్చివేతలపై అధికారులతో వాగ్వాదానికి దిగారు. నిర్మాణాలు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ఏం చేేశారని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అక్రమ నిర్మాణాలను తొలగిస్తే ప్రజాప్రతినిధులు, నాయకులకు ఎందుకు బాధ కలుగుతుందోనని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈవిషయమై అధికారులేమో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన సిబ్బందిని తరచూ ఆపడంతో తాము ఏమీ చేయలేక పోతున్నామని మున్సిపల్ అధికారులు వాపోతున్నారు.
దేవాదాయ భూమిలో యథేచ్ఛగా నిర్మాణాలు
ఘట్‌కేసర్‌లో దాదాపు 220 ఎకరాల దేవాదాయశాఖ భూమిలో 80 శాతం మేర ఇళ్లు నిర్మిస్తున్నా అధికారు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండానే బహుళఅంతస్తుల భవనాలు వెలిశాయి. ఇక్కడ నిరంతరం అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పడో గుర్తుకొచ్చినప్పుడు ఒకటిరెండు నిర్మాణాలు కూల్చివేసి తర్వాత పట్టించుకోకపోవడం షరామామూలుగా మారింది. ఇక్కడ దేవాదాయ, మున్సిపల్ అధికారుల మధ్య సమన్వయం లోపించడంతో దేవాదాయ స్థలం అన్యాక్రాంతం అవుతోంది.
శ్రీనిధిలో టేకు చెట్లు కనుమరుగు
శివారెడ్డిగూడలో గల శ్రీనిధి వెస్ట్ వెంచర్‌లో టేకుచెట్లు కనుమరుగువుతున్నాయి. ఇక్కడ గతంలో లేఆవుట్ నిర్వాహకులు వెంచరు చేసి టేకు మొక్కలను నాటారు. ఈ వెంచర్ గ్రీనరి పరిధిలో ఉందని నిర్మాణ అనుమతులు నిలిపివేశారు. అనంతరం ఎల్‌ఆర్‌ఎస్ కింద ఇళ్ల నిర్మాణం చేపట్టారు. దీంతో ఇక్కడ ఉన్నటేకు చెట్లను చాలా మంది నిర్మాణదారులు ఎలాంటి అనుమతి లేకుండానే తొలగించి కట్టడాలు చేపట్టారు. ఎవ్వరూ ఎన్‌వోసీ కోసం దరఖాస్తు చేసుకోలేదని మున్సిపల్ అధికారులు తెలిపారు. అయితే ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్థులు నిర్మిస్తున్నారు. అయిన అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు.
టౌన్ ప్లానింగ్ విభాగం అలసత్వం
మున్సిపాలిటీ పరిధిలో అక్రమాలకు టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారి నిర్లక్ష్యం అద్దంపడుతోంది. నిర్మాణ అనుమతులు జారీ చేసేముందు స్థల పరిశీలన చేయకపోవడంతో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఎన్‌ఎ్‌ఫసీనగర్‌లో ఎఫ్‌టీఎల్ పరిధిలో ఇంటినిర్మాణ అనుమతులు జారీ చేశారంటే అధికారుల ఉదాసీనత అర్థమవుతోంది. ఇదే కాలనీలో గతంలో పని చేసిన టౌన్‌ప్లానింగ్ అధికారి బైనెంబర్‌కు సైతం అనుమతి జారీ చేశారు. జనాలు ఈవిషయాలను అధికారలు దృష్టికి తీసుకువచ్చినప్పుడు స్పందించిన పాపానా పోలేదు. ఇకనైనా ఉన్నతాధికారులు ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాల విషయంలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కూల్చివేతలు.. వెంటనే నిర్మాణాలు
మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. అయితే తిరిగి కూల్చినవాటిని నిర్మించుకుంటున్నారు. అనుమతులు లేకుండా నిర్మించిన గోదాంను ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కూల్చివేశారు. కానీ నిర్మాణ దారుడు స్థానిక ప్రజాప్రతినిధులకు సన్నిహితుడు కావడంతో రెండు రోజుల్లోనే తిరిగి నిర్మాణం చేపట్టాడు. ఇదంతా జరుగుతున్నా మున్సిపల్ అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. ఇలా పలుచోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల అండదండలతో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి.
అధికారుల, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం: గడ్డం మహేష్, మాజీ ఎంపీటీసీ ఘట్‌కేసర్
పేదలు ఇళ్లు కట్టుకుంటే ఇబ్బందులు పెట్టే మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్దవాళ్లకు వత్తాసు పలుకుతున్నారు. మొదటి నుంచి అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి.
విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం : ఎన్.వసంత, మున్సిపల్ కమిషనర్ ఘట్‌కేసర్
ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమనిర్మాణలపై వివరాలు సేకరిస్తున్నాం. అనంతరం కట్టడాలను కూల్చివేస్తాం. గతంలో కూల్చివేసిన నిర్మాణాలు తిరిగి నిర్మిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. శ్రీనిధిలో కనుమరుగైన టెకుచెట్ల విషయమై విచారణ జరిపి అటవీశాఖ అధికారులకు వివరిస్తాం.
వివరాలు సేకరించి కూల్చివేతలు చేపడతాం : భాగ్యలక్ష్మి, ఈవో, గట్టుమైసమ్మ దేవాలయం ఘట్‌కేసర్
దేవాదాయశాఖ భూమిలో నిర్మిస్తున్న అక్రమకట్టడాల వివరాలను సేకరిస్తున్నాం. గతంలో దేవాదాయ భూమిలో బోర్డులు ఏర్పాటు చేశాం. కొన్ని చోట్లబోర్డులు కనిపించడంలేదు. విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిస్తాం. అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.