కలగానే లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు

ABN , First Publish Date - 2022-09-20T04:56:08+05:30 IST

రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌

కలగానే లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు
పాదయాత్రలో షర్మిల వెంట వస్తున్న ప్రజలు

  • వైఎస్‌ఆర్‌ హయాంలోనే షాద్‌నగర్‌ అభివృద్ధి 
  • వైఎస్‌ఆర్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల 


షాద్‌నగర్‌ రూరల్‌, సెప్టెంబరు 19 : రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని వైఎ్‌సఆర్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి 80వేల ఎకరాలకు సాగు నీరందిస్తాని కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. షాద్‌నగర్‌ నియోజకవర్గం చుట్టూ పరిశ్రమలున్నా స్థానికులకు మాత్రం ఉద్యోగాలు దొరకడం లేదని విమర్శించారు. షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర సోమవారం మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి ఫరూఖ్‌నగర్‌ మండలం రామేశ్వరంకు చేరుకుంది. అక్కడి నుంచి కిషన్‌నగర్‌, హాజిపల్లి మీదుగా 8 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా రామేశ్వరం, కిషన్‌నగర్‌ గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు చేపట్టడం లేదన్నారు. 


డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఎక్కడ?

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నవారికి నేటికీ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు.  ఎనిమిదేళ్లుగా ఇళ్ల కోసం పేదలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. రుణమాఫీ కాకపోవడంతో జిల్లా రైతాంగం అప్పుల పాలవుతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ చెప్పేవన్నీ ఒట్టి మాటలేనని, ఇక టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన సమయం వచ్చిందని ఆమె అన్నారు. 


అభివృద్ధికి నోచని షాద్‌నగర్‌ 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో షాద్‌నగర్‌ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని వైఎస్‌ షర్మిల విమర్శించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే షాద్‌నగర్‌ పట్టణంలోని దళితులకు ఇళ్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన హయాంలోనే స్టేడియం నిర్మాణానికి అనుమతులు జారీ చేశారని చెప్పారు. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు విద్యుత్‌, బస్‌చార్జీలను పెంచలేదని.. కేసీఆర్‌ మాత్రం చార్జీలను పెంచుతూ గ్రామీణ ప్రజల నడ్డి విరుస్తున్నారని చెప్పారు. 


భారీగా తరలివచ్చిన జనం 

వైఎస్‌ షర్మిలను చూడటానికి రామేశ్వరం, కిషన్‌నగర్‌, హాజీపల్లి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ పింఛన్లు వస్తున్నాయా.. అని అడుగుతూ పాద యాత్రలో ముందుకు సాగారు. ప్రజలకు అభివాదం చేస్తూ, రోడ్డుపై వెళ్తున్నవారిని పలకరించారు. జనం ఉన్నచోట సభ నిర్వహించి రాష్ట్రప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగట్టారు. 


షర్మిలకు ఘనస్వాగతం 

మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం నుంచి రామేశ్వరం చేరుకున్న వైఎస్సార్‌ టీపీ అధినేత్రి షర్మిలకు షాద్‌నగర్‌ వైఎ్‌సఆర్‌ టీపీ నాయకులు బొబ్బిలి సుధాకర్‌రెడ్డి, కోన దేవయ్య, ఇబ్రహిం, రమాదేవి, శీలం శ్రీను ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ప్రజాప్రస్థాన పాదయాత్ర తొలిరోజు షాద్‌నగర్‌ నియోజకవర్గంలో 8 కిలోమీటర్లు సాగింది. మార్గమధ్యలోకిషన్‌నగర్‌ గ్రామశివారులో గంట పాటు విశ్రాంతి తీసుకుని హాజిపల్లి మీదుగా షాద్‌నగర్‌కు పాదయాత్ర చేరుకుంది.  


Updated Date - 2022-09-20T04:56:08+05:30 IST