ఘనంగా కార్తీక పౌర్ణమి పూజలు

ABN , First Publish Date - 2022-11-09T00:00:33+05:30 IST

కార్తీక పౌర్ణమి వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. పౌర్ణమి రోజునే చంద్రగ్రహణం ఉండటంతో భక్తులు గ్రహణం ముగిసిన తర్వాత వేడుకలు జరుపుకున్నారు.

ఘనంగా కార్తీక పౌర్ణమి పూజలు

మేడ్చల్‌(ఆంధ్రజ్యోతిప్రతినిధి)/వికారాబాద్‌/పరిగి/బషీరాబాద్‌/ఘట్‌ కేసర్‌ నవంబరు 8 : కార్తీక పౌర్ణమి వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. పౌర్ణమి రోజునే చంద్రగ్రహణం ఉండటంతో భక్తులు గ్రహణం ముగిసిన తర్వాత వేడుకలు జరుపుకున్నారు. కాగా, కార్తీకమాసంలో ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు చేస్తుంటారు. చంద్రగ్రహణం నేపథ్యంలో ప్రజలు సాయంత్రం గ్రహణం పూర్తయిన తర్వాత పూజలు చేశారు. పరిగి మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో లక్ష్మీపూజలు చేశారు. ఇంటి పరిసరాల్లో దీపాలతో అలంకరించారు. అనంతరం చిన్నారులు, యువత బాణసంచా కాల్చారు. రకరకాల బత్తీలను పేల్చి సంబురాలు జరుపుకున్నారు. బషీరాబాద్‌ మండలంలోని భవనీమాత ఆలయంలో కార్తిక దీపోత్సవం వైభవంగా జరిగింది. ఈసందర్భంగా భవానీమాతకు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు ఆలయ పూజారి శంకరప్ప స్వామిజీ ఆధ్వర్యంలో దీపాలు వెలిగించారు. దీపోత్సవ కార్యక్రమం అర్ధరాత్రి వరకూ కొనసాగగా గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా వికారాబాద్‌ పట్టణంలోని ఎంఐజీ కాలనీలోని హనుమాన్‌ ఆలయం ఆవరణలోమహారుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి కుటుంబసభ్యులు పూజలు నిర్వహించగా భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా మేడ్చల్‌ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం రాత్రి భక్తులు ఆలయాల్లో దీపాలు వెలిగించారు. గౌడవెల్లిలోని గుదిబండ రామలింగేశ్వరస్వారిమ ఆలయ ఆవరణలో మహిళలు పెద్దఎత్తున పాల్గొని దీపాలు వెలిగించారు. మంగళవారం కార్తీక పౌర్ణమి ఉన్నప్పటికీ చంద్రగ్రహణం ఉండటంతో చాలామంది భక్తులు సోమవారమే పౌర్ణమిని జరుపుకున్నారు. ఇళ్లల్లో ప్రత్యేక పూజలు జరుపుకుని ఆలయాల్లో దీపోత్సవం నిర్వహించారు. ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాలిటీల పరిధిలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామి దర్శనానికి భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. పరమశివునికి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం దేవాలయాల ఆవరణలో కార్తీక దీపాలను వెలిగించారు. ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పావని ఘట్‌కేసర్‌లోని గీతామందిర్‌లో.. కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి దీపాన్ని వెలిగించారు. ఆమెతో కౌన్సిలర్‌ శశికళా దేవేందర్‌ముదిరాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

చంద్రగ్రహణం సందర్భంగా పాంబండ ఆలయం మూసివేత

కులకచర్ల : చంద్రగ్రహణం సందర్భంగా కులకచర్ల, చౌడాపూర్‌ మండలాల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఆలయాలను మూసి వేశారు. కులకచర్ల మండలం బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయాన్ని మూసివేశారు. బుధవారం తెల్లవారుజామున ఆలయాన్ని శుద్ధి చేసి అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు ఆలయ అర్చకులు పాండు ఈ సందర్భంగా తెలిపారు.

Updated Date - 2022-11-09T00:00:35+05:30 IST