పుస్తకాల జాడేదీ?

ABN , First Publish Date - 2022-06-11T05:00:51+05:30 IST

ఈ విద్యాసంవత్సరం ముందుగానే పాఠ్యపుస్తకాలు అందజేస్తామని

పుస్తకాల జాడేదీ?

  • ఎల్లుండి నుంచే స్కూళ్లు పునః ప్రారంభం
  • ఇంకా ముద్రణే పూర్తికాని పాఠ్యపుస్తకాలు
  • గోదాములకు చేరింది 15శాతమే
  • ఈ ఏడాది నుంచే ఆంగ్లమాధ్యమం


ఈ విద్యాసంవత్సరం ముందుగానే పాఠ్యపుస్తకాలు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఇంత వరకు అతీగతీ లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్లుండి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇంత వరకు ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాల జాడలేదు. కనీసస్థాయిలో కూడా ఇంకా గోదాములకు పాఠ్యపుస్తకాలు చేరలేదు. 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, జూన్‌ 10) : ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. సాఽధారణంగా మే నెలలోనే పాఠ్యపుస్తకాలు గోదాములకు చేరుకుంటాయి. కానీ ఈ ఏడాది స్కూళ్లు ప్రారంభ సమయానికి కూడా పుస్తకాలు గోదాములకు చేరుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ముద్రణ పూర్తయితే ముందు రామంతాపూర్‌లోని గోదాముకు పాఠ్యపుస్తకాలు తరలిస్తారు. అక్కడ నుంచి రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని మండల కేంద్రాలకు పంపుతారు.  ఆ తరువాత మండల కేంద్రాల నుంచి స్కూళ్లకు పాఠ్యపుస్తకాలు తరలించాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తికావడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియడం లేదు. కరోనా కారణంగా రెండేళ్లుగా స్కూళ్లు సక్రమంగా నడవని విషయం తెలిసిందే. ఈసారి సకాలంలో స్కూళ్లు తెరుస్తున్నప్పటికీ విద్యాబోధనకు అవసరమైన పుస్తకాలు ఇంతవరకు ప్రభుత్వ స్కూళ్లకు పంపిణీ చేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు  ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ఆగ్గమాధ్యమంలో బోధనను ప్రవేశపెట్టింది. ఈసారి ఒకటోతరగతి  నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఉపాధ్యాయులకు విడతలవారీగా నైపుణ్య శిక్షణ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు పుస్తకాల పంపిణీపై తగిన చర్యలు తీసుకోలేదు. ఇప్పటివరకు గోదాములకు చేరుకున్న పుస్తకాలు 15శాతం కూడా లేకపోవడం గమనార్హం. ఈ ఏడాది ఆంగ్లమాధ్యమం ప్రవేశపెడుతుండడంతో పుస్తకాల ముద్రణలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సగం పుస్తకాల ముద్రణ కూడా పూర్తికాలేదని సమాచారం. ఈ కారణంగానే ఈ ఏడాది పుస్తకాలు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. పుస్తకాలు పూర్తిస్థాయిలో జిల్లాకు చేరుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. దాదాపు సగం పుస్తకాలు గోదాములకు చేరుకుంటేనే వీటిని స్కూళ్లకు తరలించే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. ఇదిలాఉంటే రంగారెడ్డిజిల్లాలో ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు సుమారు 1.4లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అలాగే వికారాబాద్‌లో 1.14లక్షలు, మేడ్చల్‌లో 96వేల మంది చదువుతున్నారు. ఆంగ్లమాధ్యమం వారికి  కొత్తగా ముద్రించిన పుస్తకాలు అందించాల్సి ఉంది. 9, 10వ తరగతి విద్యార్థులకు మాత్రం గతేడాది పుస్తకాలు అందించనున్నారు. ప్రస్తుతం 9, 10 తరగతులకు సంబంధించిన పుస్తకాలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 


సాంకేతికతతో కొత్తగా..

సాంకేతికతను జోడించి ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను తయారు చేస్తున్నారు. అంతేకాక పుస్తకభారాన్ని తగ్గించేందుకు ఒక్కో సబ్జెక్టును రెండు భాగాలుగా తయారు చేస్తున్నారు. ముద్రణ ఆలస్యం అవుతుండడంతో ప్రస్తుతం మొదటి భాగం పుస్తకాలనే ముద్రిస్తున్నారు. అలాగే ఒకే పాఠాన్ని రెండు భాషల్లో ముద్రిస్తున్నారు. ఒకే పాఠ్య పుస్తకంలో తెలుగు, ఆంగ్లం మాధ్యమంలో రూపొందించిన పాఠాలను పక్కపక్కనే  ముద్రిస్తున్నారు. అలాగే ప్రతి పాఠానికి క్యూ ఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేశారు. దీన్ని స్కాన్‌ చేస్తే సంబంధిత పాఠం వాయిస్‌ రూపంలో వినిపిస్తుంది. అంతేకాదు... పాఠానికి సంబంధించిన ఫొటోలు కూడా కనిపిస్తాయి. ఇలా విద్యార్థులకు మరింత విజ్ఞానాన్ని అందించనున్నారు.


పక్కదారిపడితే ఇట్టే పట్టేయవచ్చు

ప్రభుత్వం అందించే ఉచిత పాఠ్య పుస్తకాలు ప్రతిఏటా పక్కదారి పడుతుంటాయి. కానీ ఇప్పుడు కొత్త సాంకేతికతో తయారు చేస్తున్న ఈ పుస్తకాలు పక్కదారి పడితే ఇట్టే పట్టేయవచ్చు. ప్రతి పాఠ్యపుస్తకంపై ప్రత్యేకసంఖ్యతోపాటు క్యూ ఆర్‌ కోడ్‌ ముద్రిస్తున్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళితే ప్రత్యేక సంఖ్య,  క్యూఆర్‌ కోడ్‌ ఆధారంగా  సులువుగా గుర్తించవచ్చు. 


జిల్లాల వారీగా విద్యార్థుల సంఖ్య,  పాఠ్యపుస్తకాల వివరాలు

జిల్లా మొత్తం విద్యార్ధులు అవసరమైన పాఠ్యపుస్తకాలు గోదాములకు చేరినవి

రంగారెడ్డిజిల్లా 1,40,000 13,00,000 2,00,000

మేడ్చల్‌ జిల్లా 96,608 7,80,000 1,05,050

వికారాబాద్‌ జిల్లా 1,14,251 8,11,000 1,05,000


Updated Date - 2022-06-11T05:00:51+05:30 IST