పొంగిపొర్లాయి
ABN , First Publish Date - 2022-08-05T04:42:27+05:30 IST
జిల్లాలో గురువారం పలు చోట్ల మోస్గరు నుంచి భారీ వర్షం
- జిల్లాలో వదలని వాన
- అలుగుపారుతున్న చెరువులు, కుంటలు
- జలమయమైన రోడ్లు.. పాడైన పంటలు
రంగారెడ్డి అర్బన్ / యాచారం / కొత్తూర్ / ఆమనగల్లు/ ఆగస్టు 4 : జిల్లాలో గురువారం పలు చోట్ల మోస్గరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లాయి. ఈసీ, మూసీ నదులు ఉధృతంగా ప్రవహించాయి. దీంతో సమీప ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షానికి యాచారం మండలం గున్‌గల్‌లో 40.5 మిల్లిమీటర్లు వర్షపాతం నమోదైంది. యాచారం మండలంలో భారీ వర్షం కురవడంతో నందివనపర్తిలో పెద్ద చెరువులోకి వరద నీరు చేరుతుంది. అదేవిధంగా మల్కీజ్‌గూడ మగ్దుం అలీ చెరువు కూడా నిండుతుండటంతో అలుగు పారే అవకాశముంది. నానక్‌నగర్, మేడిపల్లి. తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో చెరువులు నిండి అలుగుపారుతున్నాయి. మండలంలో 120 ఎకరాలలో వరి పంట నీటమునిగింది. మరో వంద ఎకరాలలో టమాట తోటలు పాడయ్యాయి. తాడిపర్తి బంధం చెరువు అలుగు పారుతుంది. మేడిపల్లిలోని సాలి చెరువు, ఎక్వచెరువు, ఊరచెరువులు నిండుతుండటంతో అలుగు పారే అవకాశముంది. కొత్తూర్ మండలంలో కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లాయి. ఇన్ముల్‌నర్వ గ్రామ శివారులోని జహంగీర్‌పీర్ దర్గా పరిసరాలు వర్షపు నీటితో నిండిపోయాయి. డ్రెయినేజీ వ్యవస్థ సరిగాలేకపోవడంతో వర్షపు నీరు నిలిచిపోతుందని దర్గావాసులు చెబుతున్నారు. ఆమనగల్లు పట్టణంలో కురిసిన వానకు గాంధీచౌక్ వద్ద వర్షం నీరు నిలిచి కుంటను తలపించింది. ఆమనగల్లు సురసముద్రం చెరువులోకి కూడ పెద్దఎత్తున వర్షం నీరు చేరి నిండకుండలా మారింది. మండలంలోని పలు గ్రామాలలో భారీ వర్షం కురిసింది.
చర్లగూడ గ్రామానికి రాకపోకలు బంద్
షాబాద్ / మొయినాబాద్ : బుధవారం రాత్రి కురిసిన వర్షానికి చర్లగూడ గ్రామానికి వెళ్లే బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయింది. బ్రిడ్జి గురించి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మొయినాబాద్, షాబాద్ మండలాల పరిధిలోని ఈసీ వాగు నిండుగా ప్రవహిస్తుంది.
దేవునిపల్లి మొగుళ్ల చెరువుకు గండి
షాద్‌నగర్‌రూరల్ : ఫరూఖ్‌నగర్ మండలంలో కురిసిన భారీ వర్షానికి దేవునిపల్లి శివారులోని మొగుళ్లచెరువుకు గండిపడి నీరంతా వృథాగా పోయింది. వృథా నీరు పల్లెం చెరువులోని చేరుతుండటంతో గ్రామస్తులు.. అలుగు దగ్గర నీరు పోయేందుకు జేసీబీతో కాలువ తీశారు. నీటి ఉధృతికి రోడ్డు కూడ దెబ్బతింది. మిషన్ కాకతీయలో కట్ట మరమ్మత్తుకు సుమారు 20 లక్షలు మంజూరైనా పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు కనీసం పనులు ప్రారంభించలేదని గ్రామస్తులు తెలిపారు. గురువారం ఉదయం ఇరిగేషన్ ఎస్‌ఈ రంగారెడ్డి, ఈఈ మాదవి, డీఈ కరుణశ్రీ, ఏఈ శ్రవంతి, సర్పంచ్ రాఘవేందర్‌గౌడ్‌తో కలిసి చెరువుకు గండి పడిన స్థలాన్ని పరిశీలించారు.
వాగులో నుంచి పైపుల తొలగింపు
కొందుర్గు : షాబాద్ మండల అప్పారెడ్డిగూడెం వాగు పొంగిపొర్లడంతో శ్రీరంగాపూర్ కల్వర్టు నుంచి రోడ్డుపై వరద నీరు ఉధృతంగా పారింది. గంటపాటు షాద్‌నగర్-కొందుర్గు మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. వాగు పక్కన భూమిని కొనుగోలు చేసిన వారు మధ్యలో పెద్ద పైపులను వేసి, దారి చేసుకున్నారు. బుధవారం కురిసిన వర్షానికి వాగు ఉధృతి ఎక్కువ కావడంతో చెట్లు, పోదలు నీటిలో వెళ్లి పైపులకు అడ్డంగా మారాయి. దీంతో వరద రోడ్డు పై పారడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. దీంతోపాటు చిన్న కల్వర్టు వద్ద ఉన్న గోడ వరద ఉధృతికి కొట్టుకుపోయింది. గురువారం ఉదయం గ్రామానికి చెందిన షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటి మాజీ వైస్ చైర్మెన్ సయ్యద్ సాధిక్ ఆధ్యర్యంలో వాగుకు అడ్డంగా వేసిన పైపులను తొలగించారు.