విద్యుత్ సబ్‌స్టేషన్లకు స్థలాల గుర్తింపు
ABN , First Publish Date - 2022-12-16T00:00:31+05:30 IST
తాండూరు నియోజకవర్గానికి మంజూరైన నాలుగు 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లకు రెవెన్యూ శాఖ స్థలాలను గుర్తించింది.
వారం రోజుల్లో విద్యుత్‌శాఖ అధికారులకు అప్పగించనున్న రెవెన్యూ శాఖ
స్థలాల క్లియరెన్స్‌కు చొరవచూపిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి
తాండూరు, డిసెంబరు 15 : తాండూరు నియోజకవర్గానికి మంజూరైన నాలుగు 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లకు రెవెన్యూ శాఖ స్థలాలను గుర్తించింది. స్థానిక ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కలెక్టర్‌కు విన్నవించిన వెంటనే స్థలాలు గుర్తించాలని కలెక్టర్ తహసీల్దార్లకు ఆదేశాలిచ్చింది. పెద్దేముల్ మండలం కందనెల్లిలో గురువారం ఎకరా ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి సర్వేచేసి అట్టి మ్యాప్‌ను స్థానిక సర్పంచ్‌కు అప్పగించారు. యాలాల మండలం జుంటుపల్లిలో, తాండూరు మండలం చంద్రవంచ, జినుగుర్తిలో ఇప్పటికే ప్రభుత్వ స్థలాలను గుర్తించి సబ్ స్టేషన్ల ఏర్పాటుపై వెంటనే స్థలం క్లియరెన్స్ ఇవ్వాలని విద్యుత్ శాఖ అధికారులు కోరిన మేరకు కలెక్టర్‌కు తహసీల్దార్లు నివేదికలు పంపించారు. వారం రోజుల్లో విద్యుత్‌శాఖ అధికారులకు ఆయా స్థలాలను అప్పగించనున్నారు. స్థలం అప్పగించడం పూర్తి కాగానే వారం రోజుల్లో విద్యుత్ శాఖ అధికారులు పనులు ప్రారంభిస్తారని, మూడు నెలల్లో సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని విద్యుత్ శాఖ ఏడీ తెలిపారు. సుమారు రూ.10కోట్లతో నిర్మిస్తున్న నాలుగు విద్యుత్ సబ్‌స్టేషన్లకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన నిధులు మంజూరైనందున వెంటనే పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టనున్నారు. సబ్‌స్టేషన్ ఏర్పాటు వల్ల స్థానికంగా గ్రామాలకు 24గంటల విద్యుత్ సరఫరాతోపాటు ఆ ప్రాంతం పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందనుంది. ఈమేరకు గురువారం కందనెల్లిలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాజిరెడ్డి, సర్వేయర్ శ్రీహరి, విద్యుత్ శాఖ ఏడీ ఆదినారాయణ, ఏఈ సాయినాథ్, సర్పంచ్ మోహన్‌రెడ్డి, మాజీసర్పంచ్ మధుసూదన్‌రెడ్డిలు సబ్‌స్టేషన్ నిర్మాణానికి సంబంధించి స్థలం గుర్తించి సర్వే చేసి మ్యాప్ రూపొందించారు.