వ్యక్తుల ప్రాణాలు కాపాడటమే హెచ్‌ఆర్సీ ఉద్దేశం

ABN , First Publish Date - 2022-09-25T04:53:05+05:30 IST

వ్యక్తుల ప్రాణాలు కాపాడటమే హెచ్‌ఆర్సీ ఉద్దేశం

వ్యక్తుల ప్రాణాలు కాపాడటమే హెచ్‌ఆర్సీ ఉద్దేశం
తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో వైద్యులు, అధికారులతో మాట్లాడుతున్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ జస్టిస్‌ చంద్రయ్య


  •  రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ జస్టిస్‌ చంద్రయ్య
  •  తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి తనిఖీ

తాండూరు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : వ్యక్తుల ప్రాణాలు, ఆస్తులు కాపాడటమే మానవ హక్కుల కమిషన్‌ ప్రధాన ఉద్దేశమని, ఈ రెండు హక్కులు కాపాడేందుకు కేంద్రం, రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్లను ఏర్పాటు జరిగిందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ జస్టిస్‌ చంద్రయ్య అన్నారు. శనివారం వికారాబాద్‌ జిల్లా తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు. ఈమేరకు మానవ హక్కుల కమిషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ అనేది.. కేంద్ర మానవ హక్కుల కమిషన్‌కు సబార్డినేట్‌ కాదని ఆయన తెలిపారు. న్యాయపరమైన అంశాలపై అవగాహన కల్పించడానికి రెండు ప్రధాన సంస్థలున్నాయని, ఒకటి లీగల్‌ సర్వీసెస్‌ అఽథారిటీ కాగా మరొకటి మానవ హక్కుల కమిషన్‌ అని చెప్పారు. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించే బాధ్యత ఈ రెండు సంస్థలపై ఉందన్నారు. మానవ హక్కులు, ప్రాథమిక హక్కులపై అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లో అక్షర జ్ఞానం పెరుగుతుందని కానీ, జాతీయ భావన తగ్గుతోందని అన్నారు. ప్రేమ, సేవ చేసే గుణం తగ్గిందని, కేవలం స్వార్థం కోసమే ఆలోచిస్తున్నారు తప్పా, ఎదుటివారి బాగు కోసం ప్రయత్నాలు సాగడం లేదన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందినా, మనం అనే భావన వల్ల వ్యక్తులకు మనశ్శాంతి లేకుండా పోయిందని ఆయన తెలిపారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మానవ హక్కుల కమిషన్‌ ప్రజల్లో అవగాహన కల్పిస్తుందన్నారు. వైద్యుల విలువ అమోఘమైనదని, ఆసుపత్రుల నిర్వహణ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. వైద్య, విద్యా వ్యవస్థ బాగుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవలు బాగున్నాయని, ఆసుపత్రి నిర్వహణ కూడా బాగుందని కితాబిచ్చారు. వైద్యులు, నర్సులు, అటెండర్లు సేవల వల్ల రోగులు సంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు. ఆసుపత్రిలో తనిఖీ చేస్తుండగా ఇక్కడ పరిశుభ్రత తన సొంత ఇంటిని చూసినట్లుందని అన్నారు. వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు టాయిలెట్స్‌ లేక బహిర్భూమికి వెళుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఈ విషయమై సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి డీఈవోకు తగిన ఆదేశాలిస్తామన్నారు. ధరణి పోర్టల్‌లో సమస్యలు, వ ృద్ధుల పింఛన్లకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఆర్డీవో అశోక్‌కుమార్‌, డీఎస్పీ శేఖర్‌గౌడ్‌, తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవిశంకర్‌, తహసీల్దార్‌ చిన్నప్పలనాయుడు తదితరులున్నారు. 

వైద్యం కోసం ఫీజు చెల్లించలేక తల్లిని కోల్పోయా..

వైద్యం కోసం సరిపడా ఫీజు చెల్లించలేక తల్లిని కోల్పోయిన సందర్భాన్ని జస్టిస్‌ చంద్రయ్య గుర్తు చేసుకున్నారు. గుండె నొప్పితో బాధపడుతున్న మా అమ్మ సమీపంలో ఉన్న వైద్యుడి వద్దకు పరీక్ష కోసం వెళ్లగా.. రూ.500 ఫీజు అడిగారని, ఆ సమయంలో ఆమె వద్ద రూ.200 మాత్రమే ఉన్నాయని, అట్టి డబ్బులతో వైద్యం చేయలేని కారణంగా తన తల్లి మృతి చెందిందని గుర్తుచేశారు. వైద్యులు సమాజ రక్షకులుగా ఉండాలని, కేవలం డబ్బుల కోసమే పనిచేయరాదని జస్టిస్‌ చంద్రయ్య హితవు పలికారు.

Read more