అతలాకుతలం

ABN , First Publish Date - 2022-10-07T05:50:33+05:30 IST

అతలాకుతలం

అతలాకుతలం
ఇబ్రహీంపట్నం పరిధి పోచారం కత్వ వద్ద ఉధృతంగా ప్రవహిసున్న వరద నీరు

  • జిల్లాలో భారీ వర్షం
  • పొంగిన వాగులు.. వంకలు
  • రాకపోకలకు అంతరాయం
  • నీట మునిగిన పంట పొలాలు

లోతట్టు ప్రాంతాలు జలమయంజిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు వర్షం దంచికొట్టింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరద ఉధృతికిపలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. పంట పొలాలు నీట మునిగాయి. వాగులు.. వంకలు పొంగి పొర్లడంతో రహదారులపై నుంచి వరద నీరు ప్రవహించింది.

ఆమనగల్లు/షాబాద్‌/యాచారం/ఇబ్రహీంపట్నం/కందుకూరు/చేవెళ్ల/మంచాల, అక్టోబరు 6: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంతో పాటు కడ్తాల, తలకొండపల్లి మండలాల పరిధిలో గురువారం భారీ వర్షం కురిసింది. ఆమనగల్లులో ఏపీజీవీబీ బ్యాంక్‌ ఎదురుగా హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై వర్షం పెద్ద ఎత్తున నిలిచి కుంటను తలపిస్తుంది. దీంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. మేడిగడ్డ కత్వ వాగు పొంగిపొర్లుతోంది. వ్యవసాయ పొలాలన్నీ జలమయమయ్యాయి. గ్రామీణ, అంతర్గత రోడ్లు నీరు నిలిచి చిత్తడిగా మారాయి. ఆమనగల్లు పట్టణంలోని పలు కాలనీలతో పాటు, గ్రామాలలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కడ్తాల మండలం గాన్గుమర్ల తండాలోని నేనావత్‌ లక్ష్మీకి చెందిన పాడి ఆవు రెండు రోజులుగా వర్షానికి తడుస్తూ గురవారం మృతి చెందింది. షాబాద్‌లోని పహిల్వాన్‌ చెరువులోకి నీరు రావడంతో అలుగులు పారాయి. యాచారం మండలం తక్కళ్లపల్లి, మేడిపల్లి. తమ్మలోనిగూడ. చౌదర్‌పల్లి తదితర గ్రామాల్లో పత్తి పంట నీట మునిగిపోయింది. నందివనపర్తి-నజ్దిక్‌సింగారం గ్రామాల మద్యన కాజ్‌వే గుండా నీరు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో గంటపాటు రాకపోకలకు నిలిచిపోయాయి. మేడిపల్లి-నానక్‌నగర్‌ మధ్య కల్వర్టు కొట్టుకుపోయింది. రహదారి  కుంగిపోయింది. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువుకు వరద నీరు వచ్చి చేరుతోంది. ఎలిమినేడు వద్ద రహదారిపై బ్రిడ్జిని తాకుతూ నీరు ప్రవహిస్తోంది. పోచారం వద్ద కత్వ నిండి నీరు కిందకు ఉదృతంగా ప్రవహిస్తోంది. ఇక ఫిరంగినాలా నుంచి కూడా వరద నీరు చెరువుకు చేరుతోంది. చిన్న చెరువు ఎఫ్‌టీఎల్‌లో పలు ఇళ్లలోకి వరదనీరు వచ్చి చేరింది. వాకింగ్‌ ట్రాక్‌ పార్కు నీట మునిగింది. మంచాల మండలంలోనూ భారీ వర్షం కురిసింది. కందుకూరు మండలంలోని కుంటలు, చెరువులు, ఉధృతంగా పారుతున్నాయి. షాద్‌నగర్‌ పట్టణంలో సుమారు గంటన్నర పాటు భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని రోడ్లు జలమయమయాయి. జనజీవనం స్తంభించిపోయింది. కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి, పోమాలపల్లిలోని నోటిఫైడ్‌ చెరువులు అలుగు పారుతున్నాయి. చేవెళ్ల, షాబాద్‌, శంకర్‌పల్లి, మొయినాబాద్‌ తదితర మండలాల్లో  భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలో ఉన్న వాగులు, వంకలు వర్షం నీటితో  ప్రవహించాయి. కూరగాయలతో పాటు పూలు, పత్తి పంట సైతం మునిగిపోయింది.

Updated Date - 2022-10-07T05:50:33+05:30 IST