జోరు వాన

ABN , First Publish Date - 2022-10-07T05:41:57+05:30 IST

జోరు వాన

జోరు వాన
అలుగు పారుతున్న యాలాల మండలం విశ్వనాథ్‌పూర్‌ సమీపంలోని శివసాగర్‌ ప్రాజెక్టు

  • పొంగిన వాగులు, వంకలు  
  • పలుచోట్ల నివాస ప్రాంతాల్లోకి వరద  
  • పొలాల్లో నిలిచిన వాన నీరు  
  • పంటలకు నష్టం

కొడంగల్‌/దోమ/బొంరా్‌సపేట్‌/మోమిన్‌పేట్‌/నవాబుపేట/బంట్వారం(కోట్‌పల్లి)/తాండూరు/పరిగి, అక్టోబరు 6: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో బుధవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు వికారా బాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వివిధ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ఉధృతికి పంటలు దెబ్బతిన్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ పెద్ద చెరువు పాటు కాలువ తెగి వరద నీరు ఇళ్లలోకి చేరింది. బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి పరామర్శించారు. విషయాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణ సాయంగా రూ.4వేలు, 35కేజీల బియ్యాన్ని అందిస్తామని కలెక్టర్‌ చెప్పారు. అంతకుముందు మున్సిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి, వైస్‌చైర్‌పర్సన్‌ ఉషారాణి, కౌన్సిలర్లు మధుసూదన్‌యాదవ్‌, శంకర్‌నాయక్‌, మున్సిపల్‌ అధికారులు కాలనీల్లో ఇళ్లలోకి చేరిన వర్షపు నీటిని తొలగించేందుకు తక్షణ సహాయ చర్యలు చేపట్టారు. దోమ, మండల పరిధి గ్రామాల్లో వాగులు, చెరువులు వరద నీటితో పొంగిపొర్లాయి. గొడుగోనిపల్లి, మైలారం గేటు మధ్యలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ఐనాపూర్‌ పెద్ద చెరువు కింద 300ఎకరాల పొలాలు ముంపునకు గురయ్యాయి. బొంపల్లిలో హన్మయ్య అనే రైతుకు చెందిన ఎద్దు పిడుగు పాటుకు మృతిచెందింది. బొంరా్‌సపేట్‌ మండలంలో భారీ వర్షం కురవడంతో చెరువులు, వాగులు, కుంటలు పొంగిపొర్లాయి. తుంకిమెట్ల చెరువు ఉధృతంగా ప్రవహించింది. అనారోగ్యానికి గురైన వారిని ఆస్పత్రికి తరలించేందుకు వరదతో గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. బొంరా్‌సపేట్‌ పెద్దచెరువులోకి భారీ వరదతో అలుగు పారింది. దుద్యాల్‌లో భారీవర్షంతో వరి పొలాలు నీట మునిగాయి. మోమిన్‌పేట్‌ మండలంలోని వివిధ గ్రామాల్లో చెరువులు, కుంటల్లో భారీ గా వరద నీరు చేరింది. నవాబుపేట్‌ మండల పరిధిలోని అక్నాపూర్‌ వాగు ఉధృతంగా ప్రవహించింది. చంచల్‌పేట్‌, అక్నాపూర్‌, గంజాడ, అత్తాపూర్‌, నారాయణగూడ, గొల్లగూడ తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బంట్వారం, కోట్‌పల్లి మండల కేంద్రాలతో పాటు అన్ని గ్రామాల్లో పొలాల్లో నీరు చేరింది. సల్బత్తాపూర్‌, నూర్లపూర్‌ వాగులు పారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ధారూర్‌ మండలంలో వాగులు పొంగిపొర్లాయి. నాగారం కర్లమోని వాగులో కారు కొట్టుకుపోయింది. అయితే కారులో ఉన్న భార్యాభర్తలు సురక్షితంగా ప్రాణాలతో బయట పడ్డారు. నీటిలో ఉన్న కారును జేసీబీతో బయటకు తీశారు. తాండూరు, బషీరాబాద్‌, యాలాల, పెద్దేముల్‌ మండలాల్లోని నదులు పొంగి ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోకట్‌ కాక్రవేణి నది ప్రవాహానికి రాకపోకలు నిలిచిపోయాయి. విశ్వనాథ్‌పూర్‌ శివసాగర్‌ ప్రాజెక్టు, జుంటువాగు అలుగు పారాయి. బషీరాబాద్‌ మండలం జీవన్గిలో కాగ్నా నది ఉధృతికి నది ఒడ్డున ఉన్న మహదేవలింగేశ్వరాలయం మునిగింది. తాండూరు-కొడంగల్‌ రోడ్డు మార్గంలోని కాగ్నా నది పాత బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహించింది. పరిగి మండలం లక్నాపూర్‌ ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. పరిగి, సుల్తాన్‌పూర్‌ వాగులు రోడ్లపై నుంచి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షం వల్ల పంట పొలాలు నీట మునిగాయి. చేతికొచ్చిన మొక్కజొన్న వంటి పంటలకు నష్టం జరిగింది.


  • వరద ధాటికి కొట్టుకుపోయిన కారు.. దంపతులు క్షేమం

ధారూరు: మండలంలో వాగులు పొంగిపొర్లాయి. నాగారం కర్లమోని వాగులో కారు కొట్టుకుపోయింది. అయితే కారులో ఉన్న భార్యాభర్తలు సురక్షితంగా బయటపడ్డారు. దోర్నాల్‌కు చెందిన శివకుమార్‌, అతడి భార్య మౌనిక కలిసి గురువారం తెల్లవారుజామున కారులో హైదరాబాద్‌కు బయలుదేరాడు. దోర్నాల్‌ వాగు ఉదృతంగా పారుతుండటంతో నాగారం మీదుగా హైదరాబాద్‌ వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. నాగారం దాటిన తరువాత కర్లమోని వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో నుంచి శివకుమార్‌ కారుతో వాగుదాటే ప్రయత్నం చేశాడు. వరద ఉధృతికి కారు నీటిలో కొట్టుకుపోయి పక్కనే చెట్లకు తట్టుకొని నిలిచింది. దీంతో శివకుమార్‌, మౌనిక కారు డోర్‌ తీసుకొని బయటకు వచ్చి చెట్లను పట్టుకొని కేకలు వేశారు. గమనించిన గ్రామస్తులు వారిని బయటకు తీశారు. వరదలో ఉన్న కారును జేసీబీ సహాయంతో బయటకు తీశారు.

  • మేడ్చల్‌ జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షం

మేడ్చల్‌(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/ఘట్‌కేసర్‌, అక్టోబర్‌ 6: మేడ్చల్‌ జిల్లాలో గురువారం కొన్ని చోట్ల ముసురు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షపాతం నమోదైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరిపి ఇస్తూ కురిసిన ముసురుతో రోడ్లపైకి వెళ్లలేక జనం ఇబ్బంది పడ్డారు. ఘట్‌ కేసర్‌ మండలంలో రెండు రోజలుగా కురుస్తున్నవర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతు న్నాయి. నగరంలోని కుషాయి గూడ, ఈసీఐఎల్‌, చర్లపల్లి, కీసర మండలంలో కురుస్తున్న వర్షాలతో ఎరిమల్లెవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. హైదరాబాద్‌-వరంగల్‌ రహదారి బైపాస్‌ రోడ్డుకు ఇరువైపులా సర్వీసు రోడ్లపై నుంచి రెండు ఫీట్ల మేర వరద పారడంతో రాపోకలను నిలిపేశారు. చౌదరిగూడ, నారపల్లిల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Read more