జిల్లాలో భారీ వర్షం

ABN , First Publish Date - 2022-09-30T04:58:31+05:30 IST

జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం

జిల్లాలో భారీ వర్షం
కడ్తాల్‌ : మృతిచెందిన ఎద్దు వద్ద రోదిస్తున్న రైతు

రంగారెడ్డి అర్బన్‌ / యాచారం/ఇబ్రహీంపట్నం/ చౌదరిగూడ/ మాడ్గుల/ కడ్తాల్‌, సెప్టెంబరు 29 : జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయంగా మారాయి. చౌదరిగూడెం మండలం కాసులబాద్‌లో అత్యధికంగా 75.3 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆమనగల్లులో 58.5 మిల్లిమీటర్లు, తలకొండపల్లి మండలం చుక్కాపూర్‌లో 46.0మిల్లిమీటర్లు, వెల్జాలలో 43.0 మిల్లిమీటర్లు, యాచారంలో 41.3 మిల్లిమీటర్లు, గున్‌గల్‌లో 37.3 మిల్లిమీటర్లు, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తాటివనంలో 34.0 మిల్లిమీటర్లు, సరూర్‌నగర్‌ మండలం లింగోజిగూడ ప్రాంతంలో 31.8 మిల్లిమీటర్లు వర్షపాతం నమోదైంది. కేశంపేట మండలం తొమ్మిడి రేకులో గ్రామంలో 29.0 మిల్లిమీటర్లు, హయత్‌నగర్‌లో 26.3 మిల్లిమీటర్లు, కడ్తాలలో 24.0 మిల్లిమీటర్లు, ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో 23.0 మిల్లిమీటర్లు, మంచాల మండలం ఆరుట్లలో 20.5 మిల్లిమీటర్లు వర్షపాతం నమోదైంది. 

యాచారం మండలంలో గురువారం భారీ వర్షం కురిసింది. దీంతో నందివనపర్తి చెరువు అలుగుపారింది. అదేవిధంగా నజ్దిక్‌సింగారం-నందివనపర్తి గ్రామాల మధ్య వరద నీరు పారడంతో గంటపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల వరి, పత్తి పంటలు నీటమునిగాయి. తాడిపర్తి, నానక్‌నగర్‌, మేడిపల్లి, మల్కీజ్‌గూడ, తక్కళ్లపల్లి, చింతపట్ల గ్రామాలలో చెరువులు అలుగుపారుతుండటంతో నీరంతా నల్లగొండ జిల్లా మర్రిగూడ, శివన్నగూడ గ్రామాల చెరువులకు చేరుతుంది. ఇబ్రహీంపట్నం, మంచాలలో తేలికిపాటి జల్లులు కురిశాయి. జిల్లేడ్‌ చౌదరిగూడ మండలంలో ఉరుములు మెరుపులతో  భారీ వర్షం పడింది. అదేవిధంగా ఇంద్రనగర్‌, తూంపల్లి గ్రామాలల్లో కురిసిన వర్షానికి ప్రయాణికుల రాకపోకలు గంటవరకు నిలిచిపోయాయి. వర్షానికి చౌదరిగూడలో జరుగుతున్న సంతలోని కూరగాయాలు నీటిలో కొట్టుకుపోయాయి. 

పిడుగుపడి..

మాడ్గుల మండలం కొల్కులపల్లి గ్రామానికి చెందిన పడాల అక్రమ్‌(40) పిడుగుపాటుకు మృతిచెందినట్లు సీఐ కృష్ణమోహన్‌ తెలిపారు. మదనాపురం గేటు వద్ద ఉన్న వ్యవసాయ పొలంలో అక్రమ్‌ కూలి పనికి వచ్చాడు. అక్కడ పనిచేస్తుండగా పిడుగు పడి అతను మృతి చెందాడు. అక్రమ్‌ను కూలిపనికి తీసుకొచ్చిన అప్పారావుకు కూడా తీవ్రగాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. 

కడ్తాల్‌ మండలం పుల్లేరు బోడు తండాలో గురువారం పిడుగు పాటుకు ఎద్దు మృతి చెందింది. తండాకు చెందిన రైతు నేనావత్‌ శంకర్‌ వర్షం వస్తుండగా ఎద్దును చెట్టుకింద కట్టేశాడు. అక్కడ పిడుగు పడటంతో ఎద్దు మృతి చెందింది. దీనివిలువ రూ.లక్ష ఉంటుందని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధిత రైతు వేడుకున్నాడు.Read more