గన్నీ.. కొన్నే!

ABN , First Publish Date - 2022-11-20T00:28:02+05:30 IST

అన్నదాతలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఎండకు ఎండి.. వానకు తడిచి.. చలికి వణుకుతూ పండించిన పంట అమ్ముకునేందుకు తంటాలు పడాల్సి వస్తోంది. పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళితే.. గన్నీ సంచుల కొరత వెక్కిరిస్తోంది.

 గన్నీ.. కొన్నే!
బొంరాస్‌పేట కొనుగోలు కేంద్రంలో కాంటాలు కాక పేరుకుపోయిన ధాన్యం రాశులు

వేధిస్తున్న ధాన్యం సంచుల కొరత

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఊపందుకున్న వరికోతలు

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నింపేందుకు బస్తాలు లేక ఇబ్బందులు

యాచారానికి చిరిగిన బ్యాగుల సరఫరా

పట్టించుకోని పౌరసరఫరాల శాఖ అధికారులు

మేడ్చల్‌ జిల్లాలో అవసరానికి మించి గన్నీ సంచుల సరఫరా

అన్నదాతలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఎండకు ఎండి.. వానకు తడిచి.. చలికి వణుకుతూ పండించిన పంట అమ్ముకునేందుకు తంటాలు పడాల్సి వస్తోంది. పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళితే.. గన్నీ సంచుల కొరత వెక్కిరిస్తోంది. బస్తాలు లేక కాంటాలు కాకపోవడంతో రోజుల కొద్ది అక్కడే ధాన్యం రాశులు పోసుకొని ఎదురుచూడాల్సిన పరిస్థితి దాపురించింది.

ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌/వికారాబాద్‌ ప్రతినిధి/మేడ్చల్‌ ప్రతినిధి, నవంబరు 19): ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా గన్నీ బ్యాగుల కొరత వేధిస్తోంది. సివిల్‌ సప్లయ్‌ అధికారులు పట్టించుకోక పోవడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. అక్టోబరు చివరివారం నుంచే వరికోతలు మొదలయ్యాయి. సివిల్‌ సప్లయ్‌ అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అయితే, గన్నీ బ్యాగులు లేకపోవడంతో రైతులు ధాన్యాన్ని కల్లాల వద్దనే ఉంచేశారు. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. అకాల వర్షాలు అన్నదాతలకు అపారనష్టం తెచ్చిపెట్టింది. దీంతో అప్పుల ఊబిలోకి నెట్టుకుపోయారు. ఈ సారి కూడా అదే పరిస్థితి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని కేంద్రాలకు అసలు గన్నీ సంచులే రాకపోగా, మరి కొన్నిచోట్ల చిరిగిన బస్తాలు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా యాచారంలోని కొనుగోలు కేంద్రానికి 10వేల గన్నీ సంచులు రాగా అందులో సంగం చిరిగిన బస్తాలు రావడంతో కేంద్రం నిర్వాహకులు, రైతులు తలలు పట్టుకుంటున్నారు. చిరిగిపోయిన బ్యాగుల్లో నుంచి మంచిగా ఉన్న వాటిని ఏరుకుని తీసుకెళుతున్నారు. దీని కోసం గంటల తరబడి సమయాన్ని కేటాయిస్తున్నారు. వానాకాలంలో 1,25,456 ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. మొత్తంగా ఈ సీజన్‌లో 90వేల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ, వాటిని తగినట్టుగా గన్నీ బస్తాలు తెప్పించడంలో అధికారులు విఫలమయ్యారన్న వాదన వినిపిస్తోంది. వికారాబాద్‌ జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా గన్నీ బస్తాలు అందుబాటులో లేక ఇంకా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించలేదు. బస్తాలు లేక విక్రయించేందుకు తీసుకు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ఆవరణలో రాశులుగా పోసి టార్పాలిన్‌లు కప్పి ఉంచారు. జిల్లాలో ఇప్పుడిప్పుడే ధాన్యం మార్కెట్‌కు వస్తుండగా, ఇదే సమయంలోనే గన్నీ బస్తాల కొరత ఏర్పడడం గమనార్హం. ప్రారంభంలోనే ఈ విధంగా ఉంటే.. ధాన్యం ఉత్పత్తులు ఒక్కసారిగా కొనుగోలు కేంద్రాలకు వస్తే బస్తాల కొరత సమస్య మరింత తీవ్రమై రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఽ3.80 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. దీంట్లో 2.56 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావచ్చని అంచనా వేశారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లాలో 126 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ వారం జిల్లాలో 15 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ఇంత వరకు ఒక్క కిలో ధాన్యం కూడా కొనుగోలు చేయలేదు. గన్నీ బస్తాలు సరఫరా, ధాన్యం తరలించే ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టర్లు ఖరారు కాలేదని, అందుకే ఈ ప్రక్రియ ఆలస్యమవుతోందన్న వాదన వినిపిస్తోంది. మేడ్చల్‌ జిల్లాలో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. జిల్లాలో 45వేల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. వీటికోసం 7.5లక్షల గన్నీ బ్యాగులు అవసరం ఉంది. అయితే, అధికారులు ముందుచూపుతో 8లక్షల సంచులను సిద్ధంగా ఉంచారు. ఇక్కడ గన్నీ సంచుల కొరత లేకపోవడంతో కాంటాలు సజావుగా సాగుతున్నాయి.

20 రోజులుగా కేంద్రాల వద్దే పడిగాపులు

బొంరా్‌సపేట్‌ : వరికోతలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట మండలంలో ధాన్యం కొనుగోలుకు నోచుకోవడం లేదు. అధికారులు నెల రోజులుగా చర్చలు జరుపుతూ ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నా నేటి వరకు ఒక్క బస్తా కూడా తూకం చేయలేదు. బొంరాస్‌పేట, నాగిరెడ్డిపల్లి, కొత్తూర్‌, గౌరారం, దుద్యాల్‌ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. చిలుముల్‌మైలారం, మెట్లకుంట, ఏర్పుమళ్ల, బురాన్‌పూర్‌ గ్రామాల్లో అక్కడి ఐకేపీ, పీఏసీఎస్‌ సిబ్బంది కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అయినా ఏ ఒక్క కేంద్రానికీ ఇప్పటి వరకు ఒక్క గన్నీ బస్తా రాలేదు. హమాలీల కొరత సైతం పట్టి పీడిస్తోంది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి 20 రోజులైనా కాంటాలు కాకపోవడంతో కేంద్రాల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గన్నీ సంచుల కోసం ఎదరు చూస్తున్నా: దిద్దెల ముత్యాలు, నిర్ధవెళ్లి రైతు

నాలుగు ఎకరాల్లో వరి వేశాను. పంట కోతకు సిద్ధంగా ఉంది. వరికోత యంత్రాన్ని కూడా మాట్లాడి పెట్టాను. గన్నీ బ్యాగులు లేకపోవడంతో పంట కోయడం లేదు. అనుకోకుండా వర్షం పడితే నష్టపోయే ప్రమాదముంది. గన్నీ బ్యాగులు వెంటనే అందించాలి.

చిరిగిన బస్తాలు వచ్చాయి: జంగారెడ్డి, నానక్‌నగర్‌, యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా

90 బస్తాల ధాన్యం పండించాను. కొనుగోలు కేంద్రానికి తీసుకు వెళ్లేందుకు బస్తాల కోసం ఎదురు చూశాను. బస్తాల కోసం కేంద్రానికి వెళితే అక్కడ చిరిగిపోయిన బస్తాలే ఎక్కువగా ఉన్నాయి. అందులో నుంచి మంచివి ఏరుకునేందుకు మూడు గంటల సమయం పట్టింది. టైమంతా బస్తాలు ఏరుకునేందుకే సరిపోయింది.

20 రోజులుగా వేచి చూస్తున్నాం :కాశప్ప, రైతు, బొంరాస్‌పేట్‌, వికారాబాద్‌ జిల్లా

20 రోజుల క్రితమే వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చాను. రేపు, మాపు కొనుగోలు చేస్తామంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతుల దగ్గర వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.

కొత్త బ్యాగులు వస్తున్నాయి:శ్యామరాణి, పౌరసరఫరాల డీఎం, రంగారెడ్డి జిల్లా

గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాము. 90వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి అవసరమైన గన్నీ బ్యాగులను తెప్పిస్తున్నాము. యాచారం కొనుగోలు కేంద్రంలో చిరిగిన బ్యాగులు వచ్చిన విషయం తెలిసింది. చిరిగిన గన్నీ బ్యాగులను రిటన్‌ చేసి వాటి స్థానంలో కొత్త వాటిని అందిస్తాం.

Updated Date - 2022-11-20T00:28:03+05:30 IST