జిల్లాకు బీఈడీ, ఐటీఐ కళాశాలలు మంజూరు చేయండి

ABN , First Publish Date - 2022-08-17T05:51:02+05:30 IST

జిల్లాకు బీఈడీ, ఐటీఐ కళాశాలలు మంజూరు చేయండి

జిల్లాకు బీఈడీ, ఐటీఐ కళాశాలలు మంజూరు చేయండి
సభా వేదికపై సునీతారెడ్డితో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

  • సీఎంను కోరిన జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి

తాండూరు రూరల్‌/దోమ/తాండూరు/వికారాబాద్‌/బషీరాబాద్‌, ఆగస్టు 16 : వికారాబాద్‌ జిల్లాలో విద్యారంగంలో వెనుకబడిన తాండూరు నియోజకవర్గానికి బీఈడీ, ఐటీఐ కళాశాలలు మంజూరు చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతా మహేందర్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈమేరకు బహిరంగ సభావేదికపై ఆమె వినతిపత్రం అందించారు. 2018లో తాండూరుకు మెడికల్‌ కళాశాల ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని, దాంతో జిల్లా కేంద్రంలో కళాశాల ఏర్పాటు చేసినందున సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. తాండూరు నియయోజకవర్గంలో భారీ సిమెంట్‌ కర్మాగారాలు ఉన్నందున నిరుద్యోగ యువతకు ఐటీఐ కళాశాల ఉంటే ఉపయోగపడుతుందని కోరారు. అలాగే జిల్లా పరిషత్‌ నూతన కార్యాలయానికి రూ. 7.50 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, బీఈడీ, ఐటీఐ కళాశాలలకు మంజూరుకు సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించినట్లు జడ్పీ చైరపర్సన్‌ సునీతారెడ్డి ఈ మేరకు తెలియజేశారు. 

  • సీఎం సభకు తరలిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు

వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన సీఎం కేసీఆర్‌ బహిరంగ సభకు టీఆర్‌ఎస్‌ నాయకులు భారీగా తరలివెళ్లారు. తాండూరు మండల పరిధిలోని అంతారం, చెంగోల్‌, కరన్‌కోట్‌, సంగెంకలాన్‌, చింతామణిపట్నం, ఖాంజాపూర్‌, మల్కాపూర్‌ తదితర గ్రామాల నుంచి టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. దోమ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల నుంచి టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సీఎం బహిరంగసభకు తరలివెళ్లారు. అలాగే సీఎం బహిరంగ సభకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు ఆర్టీసీ బస్సులో తరలి వెళ్లారు. వారితోపాటు తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కూడా వెళ్లారు. అదేవిధంగా సీఎం కేసీఆర్‌కు వికారాబాద్‌ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులా రమేష్‌ పుష్పగుచ్ఛం అందజేసి ఘనస్వాగతం పలికారు. అదేవిధంగా వికారాబాద్‌లో జరిగిన బహిరంగ సభకు వచ్చిన సీఎం కేసీఆర్‌ను తాండూరు మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ దీపానర్సింహులు మర్యాదపూర్వకంగా కలిశారు. 

  • హనుమాన్‌ ఆలయానికి స్థలం కేటాయించాలి

వికారాబాద్‌-మన్నెగూడ మధ్యలో ఉన్న కొత్రేపల్లి సమీపంలో గల పంచముఖ హనుమాన్‌ ఆలయానికి స్థలం కేటాయించాలని వికారాబాద్‌ జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సుభాష్‌ పంతులు కోరారు. ఈమేరకు వికారాబాద్‌కు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి దేవాలయానికి స్థలం కావాలని కోరారు. వికారాబాద్‌లో జరిగిన సీఎం బహిరంగ సభకు బషీరాబాద్‌ మండలం నుండి టీఆర్‌ఎస్‌ నాయకులు మంగళవారం భారీ సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. 

Updated Date - 2022-08-17T05:51:02+05:30 IST