ప్రభుత్వ పనులను పక్కాగా చేయాలి

ABN , First Publish Date - 2022-12-15T23:07:27+05:30 IST

ప్రభుత్వం మంజూరు చేసే అభివృద్ధి నిధులను సద్వినియోగం చేసుకుంటూ పనులన్నీ పక్కాగా నాణ్యతతో చేయాలని మేడ్చల్‌ అదనపు కలెక్టర్‌ అభిషేక్‌ ఆగస్త్య అన్నారు.

ప్రభుత్వ పనులను పక్కాగా చేయాలి
కీసరలో పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ అభిషేక్‌ ఆగస్య్త

అదనపు కలెక్టర్‌ అభిషేక్‌ ఆగస్త్య

కీసరలో పర్యటన

కీసర, డిసెంబరు 15: ప్రభుత్వం మంజూరు చేసే అభివృద్ధి నిధులను సద్వినియోగం చేసుకుంటూ పనులన్నీ పక్కాగా నాణ్యతతో చేయాలని మేడ్చల్‌ అదనపు కలెక్టర్‌ అభిషేక్‌ ఆగస్త్య అన్నారు. గురువారం ఆయన కీసరలో పర్యటించారు. పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌ యార్డు, నర్సరీ, వైకుంఠధామాన్ని సందర్శించారు. డంపింగ్‌ యార్డుకు రోడ్డు సరిగ్గా లేకపోడవంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. డంపింగ్‌ యార్డుకు దారి ఇరుకుగా ఉందని, రోడ్డు వెడల్పునకు చర్యలు చేపట్టాలని సర్పంచ్‌ మాధురిని ఆదేశించారు. రెవెన్యూ అధికారులతో స్థలాన్ని సర్వే చేయించాలన్నారు. ప్రభుత్వ పథకాలపై నిర్లక్ష్యం చేయొద్దని, ప్రణాళికలు రూపొందించుకొని గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు.

పల్లె ప్రకృతి వనాలు భవిష్యత్తు ఆలయాలు

మేడ్చల్‌: పల్లె ప్రకృతి వనాలు భవిష్యత్తు ఆలయాలని అదనపు కలెక్టర్‌ అభిషేక్‌ అన్నారు. మేడ్చల్‌ మండలం మునీరాబాద్‌లో ఆయన పర్యటించారు. నర్సరీ, వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం, డంపింగ్‌ యార్డులను పరీశీలించారు. క్రీడా ప్రాంగంణ నిర్మాణానికి స్థలం అనువుగా ఉందన్నారు. మునీరాబాద్‌ నగరానికి చేరువలో ఉన్నందున్న ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు సందర్శించే అవకాశం ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి పనులు చేయించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీపీ రజితరాజమల్లారెడ్డి, సర్పంచ్‌ గణేష్‌, ఎంపీడీవో పద్మావతి, ఎంపీటీసీ రఘు, గ్రామస్థులు ఉన్నారు.

Updated Date - 2022-12-15T23:07:28+05:30 IST