జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ABN , First Publish Date - 2022-12-31T00:00:57+05:30 IST
రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తోందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.
ఆదిభట్ల, డిసెంబరు 30: రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తోందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జిల్లా మూడో మహాసభ ఆదిభట్ల పరిధి కొంగర కలాన్ కల్వకోలు లక్ష్మీదేవమ్మ గార్డెన్‌లో శుక్రవారం నిర్వహించారు. టీయూడబ్ల్యూజే 143 యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్‌సాగర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమానికి బాటలు వేస్తోందన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, వారి పిల్లలకు స్కూ ల్ ఫీజుల్లో రాయితీ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతీ జిల్లా, మండలాల్లో ప్రెస్‌క్లబ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి పత్రికారంగం నాలుగో స్తంభం లాంటిదన్నారు. జనం సమస్యలు తీర్చే విధంగా నిష్పాక్షికంగా వార్తలు రాస్తూ ప్రజలకు వాస్తవాలు తెలియజే యాలని సూచించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. ప్రజా శ్రేయస్సుకు జర్నలిస్టులు పనిచేస్తున్నారని, వారి సంక్షేమానికి ప్రెస్ అకాడమీ కృషి చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతిసాగర్, రమేష్, వెంకటేష్, సత్యనారాయణ, మహేందర్, ఆదిభట్ల మున్సిపల్ చైర్‌పర్సన్ ఆర్తికగౌడ్, పారిజాత, జిల్లాలోని జర్నలిస్టులు పాల్గొన్నారు.