పరిహారం ఇచ్చి భూములు వేలం వేయండి
ABN , First Publish Date - 2022-11-14T23:29:43+05:30 IST
తమ నుంచి స్వాధీనం చేసుకున్న భూములకు పరిహారం చెల్లించిన తరువాతే రాజీవ్ స్వగృహ భూములను వేలం వేయాలని భూనిర్వాసితులు ఆందోళనకు దిగారు.
ఆర్డీవో కార్యాలయం వద్ద నిర్వాసితుల ఆందోళన
అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించిన పోలీసులు
వేలంలో ఎకరానికి రూ.1.06 పలికిన ధర
3.5ఎకరాలకు ప్రభుత్వానికి రూ.3.71కోట్ల ఆదాయం
వికారాబాద్, నవంబరు 14(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తమ నుంచి స్వాధీనం చేసుకున్న భూములకు పరిహారం చెల్లించిన తరువాతే రాజీవ్ స్వగృహ భూములను వేలం వేయాలని భూనిర్వాసితులు ఆందోళనకు దిగారు. వికారాబాద్ పరిధి గంగారంలోని సర్వే నెంబర్ 67లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు చెందిన 3 ఎకరాల విక్రయానికి సోమవారం ఆర్డీవో కార్యాలయ ఆవరణలో బహిరంగ వేలాన్ని నిర్వహించారు. తమకు న్యాయం జరిగిన అనంతరమే రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ భూములు వేలం వేయాలని నిర్వాసితులు ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అదే సమయంలో వేలం పాట పర్యవేక్షణకు వచ్చిన అదనపు కలెక్టర్ రాజీవ్‌శర్మ వాహనానికి అడ్డంగా బైఠాయించారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితిని గమనించిన రాహుల్‌శర్మ ఆర్డీవో కార్యాలయ మెయిన్ గేటు వద్ద తన వాహనం నుంచి దిగి వేలం జరిగే చోటకు నడుచుకుంటూ వెళ్లారు. ఒకవైపు భూనిర్వాసితులు తమ ఆందోళన కొనసాగిస్తుండగా, మరోవైపు భూముల వేలాన్ని కొనసాగించారు. భూనిర్వాసితులు ఆందోళన తీవ్రం చేయగా, పోలీసులు వారిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా తోపులాటలో పెంటమ్మ అనే మహిళ చేతికి గాయమైంది.
14ఏళ్ల కిందట స్వాధీనం.. కొందరికే పరిహారం
గంగారం శివారులో సర్వే నెంబర్ 67, బిల్లాదాఖలాలో 1975 నుంచి 1986 వరకు, 1994లో పలువురు వడ్డెరలకు, నిరుపేదలకు ప్రభుత్వం భూములు అసైన్డ్ చేసింది. గంగారంలో సర్వే నెంబర్ 67, బిల్లాదాఖలాలో రాజీవ్ స్వగృహ నిర్మాణం కోసం 18మంది నుంచి 44ఎకరాల ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ భూములను ఆంధ్రప్రదేశ్ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్‌కు స్వాధీనం చేసిన సమయంలో ఎకరానికి రూ.1.5 లక్షలు, 40గజాల నివేశన స్థలం, పశుక్రాంతి కింద గేదెలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం నిర్వాసితులకు హామీ ఇచ్చింది. అయితే 18మంది లబ్ధ్దిదారుల్లో ఆరుగురికి మాత్రం 18.20ఎకరాలకు రూ.1.5లక్షల వంతున పరిహారం చెల్లించారు. గేదెల పంపిణీ, ఒక్కొక్కరికీ 40చదరపు గజాల నివాస స్థలం ఇస్తామన్న హామీ నెరవేర్చలేదు. 18 మంది అసైన్డ్ రైతుల నుంచి పాస్‌బుక్, టైటిల్ డీడ్లు స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు కేవలం ఆరుగురికి మాత్రం పరిహారం చెల్లించారు. మిగతా 25.20ఎకరాలకు సంబంధించి 12 మంది నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేదు. అప్పటి నుంచి పరిహారం కోసం వారు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రాజీవ్ స్వగృహ భూములను వేలం వేస్తున్నారని తెలుసుకున్న నిర్వాసితులు న్యాయం చేసిన తరువాతనే వేలం వేసుకోవాలని ఆందోళన చేస్తున్నారు. వేలం పూర్తయిన తరువాత వడ్డె అంజయ్య నేతృత్వంలో భూనిర్వాసితులు ఆర్డీవో విజయకుమారికి గోడు వెళ్లబోసుకున్నారు. భూములు అప్పగించి 14ఏళ్లు గడిచిపోయినా తమకు పరిహారం రాలేద ని, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ వారు విజ్ఞప్తి చేశారు.
3.5ఎకరాలు.. రూ.3.71కోట్ల ఆదాయం
గంగారం శివారులోని రాజీవ్ స్వగృహ భూమి 3.5ఎకరాలను విక్రయించేందుకు సోమవారం ఆర్డీవో కార్యాలయం ఆవరణలో నిర్వహించిన బహిరంగ వేలానికి అనూహ్య స్పందన లభించింది. వేలంలో 40మంది పాల్గొన్నారు. ఎకరానికి ప్రభుత్వ రిజర్వు ధర రూ.55లక్షలుండగా, హైదరాబాద్‌కు చెందిన జాయ్ వెంచర్స్ యాజమాన్యం ఎకరానికి రూ.1.06లకు పాడి భూములను దక్కించుకుంది. 3.5ఎకరాలు విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి రూ.3.71కోట్ల ఆదాయం సమకూరనుంది. జాయ్ వెంచర్స్ యాజమాన్య బృందానికి కలెక్టర్ నిఖిల, అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో విజయకుమారి, రాజీవ్ స్వగృహ జనరల్ మేనేజర్ నరేందర్‌రెడ్డి, టీఎ్‌సఐఐసీ జోనల్ మేనేజర్ శ్రవణ్, తహసీల్దార్ వాహీదా ఖాతూన్ పాల్గొన్నారు. కాగా బహిరంగ వేలానికి ప్రింట్, ఎలక్ర్టానిక్ మీడియాను అధికారులు అనుమతించకపోవడం గమనార్హం.
==============================================