కారుణ్యంపై కసరత్తు!

ABN , First Publish Date - 2022-11-24T00:00:08+05:30 IST

జడ్పీల విభజన జరిగిన తరువాత తొలిసారిగా వికారాబాద్‌ జిల్లా పరిషత్తు ఆధ ్వర్యంలో కారుణ్య నియామకాలు చేపట్టేందుకు కసరత్తు జరుగుతోంది.

కారుణ్యంపై కసరత్తు!
వికారాబాద్‌ జిల్లా పరిషత్తు కార్యాలయం

15 నెలలుగా నిలిచిన నియామకాలకు మోక్షం

ఆశావహుల ఎదురు చూపులు

జిల్లాలోదరఖాస్తు చేసుకున్న 13 కుటుంబాలు

నేడు అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

ఖాళీగా లేని జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు

జడ్పీల విభజన జరిగిన తరువాత తొలిసారిగా వికారాబాద్‌ జిల్లా పరిషత్తు ఆధ ్వర్యంలో కారుణ్య నియామకాలు చేపట్టేందుకు కసరత్తు జరుగుతోంది. స్థానిక సంస్థల్లో కారుణ్య నియామకాల కోసం బాధిత కుటుంబాలు ఎదురు చూస్తున్న విషయం విదితమే. అయితే ఈ నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం జిల్లా పరిషత్తు కార్యాలయంలో చేపట్టనున్నారు. అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.

వికారాబాద్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): స్థానిక సంస్థల్లో కారుణ్య నియామకాల కోసం బాధిత కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. 15 నెలలుగా కారుణ్య నియామకాలు చేపట్టక పోవడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో 2021, జూలై నెల వరకు కారుణ్య నియామకాలు చేపట్టినా జిల్లా పరిషత్తు అధికార యంత్రాంగం ఆ తరువాత వివిధ కారణాలతో నిలిపివేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కారుణ్య నియామకాల కోసం బాధిత కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. ఉద్యోగుల పదవీ విరమణ గడువును 58 నుంచి 61 ఏళ్లకు ప్రభుత్వం పెంచడంతో ఖాళీలు ఏర్పడడం లేదు. జీవో 317 ప్రకారం చేపట్టిన ఉద్యోగుల విభజనలో జిల్లాలో వివిధ కేడర్ల పోస్టులన్నీ భర్తీ అయ్యాయి. స్థానిక సంస్థల్లో కారుణ్య నియామకాల కోసం మృతి చెందిన 13 ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఉద్యోగుల కుటుంబాలకు చెందిన వారసులు జిల్లా పరిషత్తు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. కారుణ్య నియామకాల కింద డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు జూనియర్‌ అసిస్టెంట్‌, తెలుగు, ఇంగ్లీష్‌ హయ్యర్‌ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు టైపిస్టులుగా ఉద్యోగాల్లో నియమిస్తారు. పదవ తరగతి వరకు చదువుకున్న అభ్యర్థులను ఆఫీస్‌ సబార్డినేట్‌ ఉద్యోగాల్లో నియామకం చేస్తారు. జడ్పీ పరిధిలో మూడు టైపిస్ట్‌, 80 వరకు ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగా, జిల్లాలో కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల్లో ఇద్దరికి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌తో పాటు బీఎడ్‌ విద్యార్హతలు కలిగి ఉండగా, ఒకరు బీఈ పూర్తి చేసిన వారున్నారు. ఆరుగురు డిగ్రీ చదివిన వారు ఉండగా, వారిలో ఒకరు బీఈడీ కూడా పూర్తి చేశారు. ముగ్గురు ఇంటర్‌, ఒకరు పదవ తరగతి విద్యార్హతలు కలిగి ఉన్నారు. మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో అర్హత కలిగిన ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. పాఠశాలలు, స్థానిక సంస్థల్లో పనిచేస్తూ మృతి చెందిన ఉపాధ్యా యులు, ఇతర ఉద్యోగుల కుటుంబాలకు సంబంధించిన కారుణ్య నియామకాల ప్రక్రియ జిల్లా పరిషత్తు అధికారులు చేపడతారు.

వికారాబాద్‌ జడ్పీ ఆధ్వర్యంలో తొలిసారి

ఏడాదిన్నర వరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్తు పరిధిలో కారుణ్య నియామకాలు చేపట్టారు. జడ్పీల విభజన జరిగిన తరువాత తొలిసారిగా వికారాబాద్‌ జిల్లా పరిషత్తు ఆధ ్వర్యంలో కారుణ్య నియామకాలు చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించారు. కారుణ్య నియామకాల కోసం బాధిత కుటుంబాలు జడ్పీ అధికారులు, సంబంధిత ప్రజా ప్రతినిధులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తీసుకు వస్తున్నాయి. కుటుంబాన్ని పోషించే ప్రభుత్వ ఉద్యోగులు చనిపోయి ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నెలనెలా వచ్చే వేతనం నిలిచిపోయి ఆర్థికంగా ఇక్కట్లు తప్పడం లేదు. కుటుంబాన్ని పోషించుకునే స్తోమత కరువై అగచాట్లు పడుతున్నారు. జిల్లాలో కారుణ్య నియామకాల కోసం 11 ఉపాధ్యాయ, ఒక మినిస్ట్రీరియల్‌, ఒక ఆఫీస్‌ సబార్డినేట్‌ కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. కారుణ్య నియామకాలు చేపట్టాలంటూ కొంత కాలంగా బాధిత కుటుంబాల నుంచి జడ్పీ అధికారులపై ఒత్తిళ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు జడ్పీ అధికారులు కారుణ్య నియామకాలు చేపట్టేందుకు కసరత్తు ప్రారంభించారు.

నేడు అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

జిల్లాలోని స్థానిక సంస్థల్లో కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈనెల 24వ తేదీన జిల్లా పరిషత్తు కార్యాలయంలో చేపట్టనున్నారు. కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కుటుంబ యజమాని (ఉద్యోగి) డెత్‌సర్టిఫికెట్‌, ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌, అభ్యర్థి విద్యార్హతలు, ఒకటి నుంచి ఏడు వరకు బోనాఫైడ్‌ సర్టిఫికెట్లు, కులం, నివాసం సర్టిఫికెట్లు, ఎంప్లాయ్‌మెంట్‌ కార్డు, నో ఎర్నింగ్‌ మెంబర్‌ సర్టిఫికెట్‌, నో ప్రాపర్టీ సర్టిఫికెట్‌, అన్‌ ఎంప్లాయ్‌మెంట్‌ సర్టిఫికెట్‌, ఫైనాన్షియల్‌ స్టేటస్‌ రిపోర్ట్‌, బాధిత ఉద్యోగి ఒరిజినల్‌ సర్వీస్‌ రిజిష్టర్‌, కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరం లేదని చెప్పే నో అబ్జెక్షన్‌ అఫిడవిట్‌ విత్‌ నోటరీ అడ్వకేట్‌, కంప్యూటర్‌ సర్టిఫికెట్‌, అభ్యర్థి దరఖాస్తు ఫారం తీసుకురావాలని జడ్పీ అధికారులు సమాచారం పంపించారు. గురువారం ఉదయం 11 గంటలకు జడ్పీ కార్యాలయంలో జరగనున్న సర్టిఫికెట్ల పరిశీలనలో అభ్యర్థులు అటెస్టేషన్‌ చేయించుకున్న పైన పేర్కొన్న తమ సర్టిఫికెట్లతో పాటు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో సీఈవోను కలవాలని సూచించారు.

ఎదురుచూపులు ఫలించేనా..

కారుణ్య నియామకాల కోసం సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టనున్న అధికారులు ఉద్యోగాలు ఎప్పు డు కల్పిస్తారోనని అభ్యర్థులు ఎదురు చూస్తున్నా రు. ఎక్కువ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఆఫీసు సబార్డినేట్‌ ఉద్యోగాలకు ఆసక్తి కనబరచ డం లేదని తెలిసింది. ఆఫీస్‌ సబార్డినేట్‌ ఉద్యోగాలకు సరిపడా విద్యార్హతలు 13 మందిలో ముగ్గు రికి మాత్రమే ఉన్నాయి. మిగతా వారికి జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి అవసరమయ్యే విద్యార్హతలు ఉన్నాయి. జిల్లాలో స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ ప్రారంభమయ్యే వరకు జూనియర్‌ అసిస్టెంట్ల పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో కారుణ్య నియామకాల కోసం బాధిత కుటుంబాల ఎదురు చూపులు ఎప్పుడు ఫలిస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది.

Updated Date - 2022-11-24T00:00:10+05:30 IST