జయహో.. వినాయక

ABN , First Publish Date - 2022-08-31T06:04:05+05:30 IST

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వినాయక చవితి

జయహో.. వినాయక

  • వినాయక చవితి ఉత్సవాలకు సర్వం సిద్ధం 
  • ఉమ్మడి జిల్లాలో ముస్తాబైన మండపాలు 
  • వాడవాడలా కొలువుదీరనున్న విగ్రహాలు


రంగారెడ్డి అర్బన్‌ / ఆమనగల్లు, ఆగస్టు 30 : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వినాయక చవితి పండగ రానే వచ్చింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. కాలనీలు, అపార్టుమెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, యూత్‌ అసోసియేషన్లు ఇప్పటికే వినాయక మండపాలను సుందరంగా ముస్తాబు చేశారు. విద్యుత్‌ దీపాలతో అలకరించారు. లౌడ్‌ స్పీకర్లు, సౌండ్‌ బాక్స్‌లు ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారితో రెండేళ్లుగా వినాయక చవితి ఉత్సవాలు ఇళ్లకే పరిమితమయ్యాయి. ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణకు భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. నేడు బుధవారం వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. కోరిన కోర్కెలు తీర్చే బొజ్జగణపయ్యను ప్రతీ గల్లీలో ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలను భక్తులు ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. ఆ తర్వాత ఉత్సవాలు నిర్వహించి భారీ ఊరేగింపులతో వినాయక నిమజ్జనాలు నిర్వహించనున్నారు. మూడు సంవత్సరాల తర్వాత వినాయక చవితి ఉత్సవాలకు సిద్ధం అవుతున్నారు. ఈసారి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజకీయ పార్టీల వారీగా పోటాపోటీగా విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. మట్టి వినాయకులతో పాటు కలర్‌ఫుల్‌ వినాయకులను ప్రతిష్ఠించేందుకు సిద్ధం చేసుకున్నారు. కొన్ని గేటెడ్‌ కమ్యూనిటీలు తమ అపార్టుమెంటుల్లో గణపయ్యను ప్రతిష్ఠించి, దూప దీప నైవేద్యాలను సమర్పించి నిమజ్జనం అయ్యేంత వరకు ఇంటిల్లిపాది మండపం వద్దే సహపంక్తి భోజనాలు చేయనున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా వంటవాళ్లను నియమించుకుంటారు. ఉమ్మడి జిల్లాలో ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకునే విధంగా జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ చర్యలు తీసుకుంటున్నారు. 


పూలు, పండ్లు, చవితి పత్రి, ఇతర సామగ్రి ధరలకు రెక్కలొచ్చాయి. గతంతో పోలిస్తే ఈ సారి ధరలు విపరీతంగా పెరిగాయి. మార్కెట్‌లో అమ్మకాల జోరు పెరిగింది. ఎక్కడ చూసినా పూజా సామగ్రి విక్రయించే దుకాణాలు వెలిశాయి. మండల, పట్టణ కేంద్రాల్లో మెయిన్‌ సెంటర్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. పువ్వులు, పండ్లు, కిరాణ, బట్టల దుకాణాల వద్ద రద్దీ కనిపించింది. 


వినాయక చవితి పండుగ నేపథ్యంలో ఆమనగల్లు పట్టణంతోపాటు అన్ని గ్రామాలలో సందడి వాతావరణం నెలకొంది. నవరాత్రోత్సవాల నిర్వహణకు ఉత్సవ కమిటీలు, యువజన సంఘాలు, ప్రజలు సిద్ధమయ్యారు. మంగళవారం ఆమనగల్లు పట్టణంలో గణనాథుల ప్రతిమల కొనుగోలుతోపాటు మండపాల ఏర్పాట్లలో యువకులు బిజీబిజీగా కన్పించారు. చిన్న, పెద్ద కలిపి పట్టణంలో 50 వరకు వినాయక విగ్రహాల ప్రతిష్ఠకు మండపాలను సిద్ధం చేశారు. కొందరు హైదరాబాద్‌ నుంచి పెద్ద విగ్రహాలను కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు. ఇదిలాఉండగా ఈ ఏడాది వినాయక ప్రతిమల ధరలు 20 నుంచి 30శాతం వరకు పెరిగాయి.


వినాయక చవితిని ప్రశాంతంగా జరుపుకోవాలి

కొత్తూర్‌, ఆగస్టు 30: వినాయక చవితి పండుగను ప్రజలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని షాద్‌నగర్‌ ఏసీపీ కుషాల్కర్‌ పేర్కొన్నారు. స్థానిక జేపీ దర్గా రోడ్డులో గల గణపతి గార్డెన్స్‌లో ఇన్‌స్పెక్టర్‌ బాల్‌రాజ్‌ అధ్యక్షతన నిర్వహించిన శాంతి కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏసీపీ హాజరై మాట్లాడారు. వినాయక మండప నిర్వహకులు పోలీస్‌శాఖ అనుమతి తీసుకోవాలన్నారు. నిమజ్జనం రోజు చెరు వులు, కుంటల వద్ద జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ బాల్‌రాజ్‌, ఎంపీడీవో శరత్‌ చంద్రబాబు, ట్రాన్స్‌కో ఏడీఈ రవీందర్‌, నీటిపారుదల శాఖ ఏఈ రవీందర్‌రెడ్డి, ఎస్‌ఐలు సయూద్‌, శంకర్‌, సర్పంచ్‌ రవీనాయక్‌, కౌన్సిలర్లు మాదారం నర్సింహగౌడ్‌, సోమ్లానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.  


వినాయక చవితి శుభాకాంక్షలు : మంత్రి సబితాఇంద్రారెడ్డి

రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గణనాథుని ఆశీ స్సులు అందరిపై ఉండాలని, అందరికీ మంచి జరగాలని  ఆమె ఆకాంక్షించారు. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధ లతో ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించుకోవాలని ఆమె సూచించారు.









Updated Date - 2022-08-31T06:04:05+05:30 IST