భారీ వర్షాలు కురిసినా...

ABN , First Publish Date - 2022-12-07T00:05:23+05:30 IST

ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసినా విచల్చవిడి నీటి వాడకంతో అనేక మండలాల్లో భూగర్భ జల మట్టాలు శరవేగంగా పడిపోతున్నాయి. ఒక్క నవంబర్‌ నెలలో జిల్లాలోని 17మండలాల్లో ఒక్కసారిగా భూగర్భ జలాలు పడిపోయాయి.

భారీ వర్షాలు కురిసినా...

శరవేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు

నవంబర్‌లో 1.17మీటర్లు తగ్గిన నీటి మట్టం

ఒక్క నెలలోనే 17 మండలాల్లో భారీగా పతనం

పక్కనే జలాశయాలున్న గండిపేటలో సైతం తగ్గుదల

విచ్చలవిడి నీటి వినియోగమే కారణం

రోజురోజుకూ పడిపోతున్న భూగర్భ జలమట్టాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది వర్షాలు భారీగానే కురిసి రికార్డు వర్షపాతం నమోదైనా విచ్చలవిడి నీటి వినియోగంతో భూగర్భ జలం తరిగిపోతోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో సగటున 3.85 మీటర్లు, నవంబర్‌లో 5.02 మీటర్ల చొప్పున భూగర్బ జలమట్టం పడిపోయింది. ఒక్క నెల వ్యవధిలోనే 1.17మీటర్ల నీటి మట్టం తరిగిపోయింది. గతేడాదితో పోలిస్తే ఏకంగా 17 మండలాల్లో భూగర్భ జలాలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. నవంబర్‌లో వర్షాలు కురువకపోవడం, సాధారణ, పారిశ్రామిక, ఇతర అవసరాలకు నీటి వినియోగం పెరగడం నీటి మట్టాలు పడిపోవడానికి కారణంగా అధికారులు చెబుతున్నారు.

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లాప్రతినిధి, డిసెంబరు 6): ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసినా విచల్చవిడి నీటి వాడకంతో అనేక మండలాల్లో భూగర్భ జల మట్టాలు శరవేగంగా పడిపోతున్నాయి. ఒక్క నవంబర్‌ నెలలో జిల్లాలోని 17మండలాల్లో ఒక్కసారిగా భూగర్భ జలాలు పడిపోయాయి. శరవేగంగా భూగర్భ జలాలు అడుగంటుతున్న మండలాల్లో చుట్టూ జంట జలాశయాలు(హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌) ఉన్న గండిపేట మండలం కూడా ఉండడం గమనార్హం. వర్షాలు దండిగా పడిన్పటికీ గడిచిన ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే నవంబర్‌లో భూగర్భ జలమట్టం జిల్లాలో గణనీయంగా పడిపోయింది. 2022 అక్టోబర్‌లో జిల్లాలో సగటు 3.85మీటర్ల లోతులో భూగర్భజలాలు.. నవంబర్‌లో 5.02మీటర్లకు పడిపోయాయి. అంటే ఒక్కనెలలో 1.17మీటర్ల భూగర్భజలాలు తగ్గిపోయాయి. గత ఏడాది నవంబర్‌తో పోల్చినా భూగర్భ జలాలు 0.17మీటర్లు తగ్గిపోవడం గమనార్హం. 2022 అక్టోబర్‌తో పోల్చిచూస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో భూగర్భజలాలు 0.71మీటర్లు అధికంగా ఉండడం విశేషం. అయితే నవంబర్‌లో వర్షాలు కురియకపోవడంతో నీటి వినియోగం భారీగా పెరగడమే భూగర్భజలాలు ఒక్కసారిగా పడిపోవడానికి కారణంగా తెలుస్తోంది. ఇదే పరిస్థితి ఉంటే వేసవిలో కొన్ని చోట్ల నీటి ఇబ్బందులు తలెత్తే ఆస్కారం కనిపిస్తోంది. ఈ ఏడాది రికార్డుస్థాయిలో వర్షాలు కురిసినప్పటికీ గతేడాదితో పోలిస్తే 17మండలాల్లో భూగర్భ జలాలు మరింత కిందకు పడిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. పలు ప్రాంతాల్లో విచ్చలవిడి నీటి వాడకంతో జల మాట్టాలు శరవేగంగా తరిగిపోతున్నట్లు అధికారులు తెలిపారు. నవంబర్‌ నెలలో అత్యధికంగా కొత్తూరు మండలం తీగాపూర్‌లో 6.36 మీటర్లు భూగర్భజలాలు పడిపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇస్తుండడం వల్ల కొందరు రైతులు అవసరం లేకున్నా నీటిని తోడేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో వ్యవసాయ మోటర్లను నిరంతరం వినియోగిస్తున్నారు. అలాగే పరిశ్రమలకు కూడా నీటి వినియోగం పెరిగింది. హైదరాబాద్‌ చుట్టు పక్కల కాలనీలు పెరగడంతో పాటు, కొత్త పరిశ్రమలు వస్తుండడంతో శివార్లలో జనాభా గణనీయంగా పెరుగతోంది. దీనికి అనుగుణంగా నీటి వినియోగం కూడా పెరిగింది. ఈ కారణాల వల్ల భూగర్భజలాలు శరవేగంగా పడిపోతున్నాయి. ప్రభుత్వం తాగునీటి అవసరాల కోసం జంటజలాశయాలతో పాటు కృష్ణా, గోదావరి జలాలను తరలిస్తోంది. సాధారణ వినియోగంతో పాటు వ్యాపార అవసరాలు, ఇతరత్రా నీటి వాడకం పెరగడంతో భూగర్భ జలాలు శరవేగంగా తగ్గిపోతున్నాయి.

రికార్డు స్థాయిలో వర్షపాతం

ఈ ఏడాది రికార్డు స్థాయిలో జిల్లాలో వర్షాలు కురిశాయి. ఈ ఏడాది సగటు వర్షపాతం 694మి.మీ కాగా ఇప్పటికే రికార్డు స్థాయిలో 959మి.మీ వర్షం కురిసింది. అంటే 51శాతం అధిక వర్షపాతం నమోదైంది. దాదాపు అన్ని మండలాల్లో వర్షపాతం ఎక్కువ ఉంది. అయినా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భూగర్భజలాలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది నవంబరులో మాత్రం అక్కడక్కడ వర్షాలు కురిశాయి. భూగర్భ జలాలు శరవేగంగా పడిపోవడానికి నవంబరు నెలలో వర్షాలు పడకపోవడం కూడా ఒక కారణమనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఆమన్‌గల్‌ మండలంలో సగటు కంటే 143శాతం అధికవర్షం కురిసింది. షాబాద్‌లో 90శాతం, చౌదరిగూడెంలో 85శాతం, కొత్తూరులో 77శాతం, మాడ్గుల్‌లో 68శాతం, ఇబ్రహీంపట్నంలో 65శాతం చొప్పున అధిక వర్షం నమోదైంది.

శరవేగంగా భూగర్భ జలాలు అడుగంటుతున్న మండలాలు

గండిపేట, హయత్‌నగర్‌, సరూర్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, షాబాద్‌, శంకరపల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, బాలాపూర్‌, అబ్ధుల్లాపూర్‌మెట్‌, మంచాల, మహేశ్వరం, మెయినాబాద్‌, కొత్తూరు, నందిగామ, కొందుర్గు, చౌదరిగూడెం మండలాలు.

Updated Date - 2022-12-07T00:05:24+05:30 IST