అంతరిస్తున్న అంగూర్‌

ABN , First Publish Date - 2022-03-06T04:23:39+05:30 IST

ఒకప్పుడు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకు సైతం ఎగుమతి అయిన రంగారెడ్డి జిల్లాలోని ద్రాక్ష నేడు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. 14ఏళ్ల క్రితం వరకు మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లా ద్రాక్షసాగుకు పెట్టింది పేరు. దేశ విదేశాలకు సైతం ఇక్కడ పండిన అంగూర్‌ను ఎగుమతి చేసేవారు. ఈ

అంతరిస్తున్న అంగూర్‌

  • పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు 
  • ద్రాక్ష రైతులకు అందని ప్రభుత్వ ప్రోత్సాహం
  • సాగుకు దూరమవుతున్న రైతులు
  • భారీగా తగ్గిన సాగు విస్తీర్ణం

ఒకప్పుడు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకు సైతం ఎగుమతి అయిన రంగారెడ్డి జిల్లాలోని ద్రాక్ష నేడు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. 14ఏళ్ల క్రితం వరకు మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లా ద్రాక్షసాగుకు పెట్టింది పేరు. దేశ విదేశాలకు సైతం ఇక్కడ పండిన అంగూర్‌ను ఎగుమతి చేసేవారు. ఈ తోటలతో వేలాదిమందికి ఉపాధి లభించేది. ప్రస్తుతం పెరుగుతున్న సాగు పెట్టుబడులు, కూలీల కొరత, నీటి ఎద్దడి, రియల్‌ఎస్టేట్‌ పుణ్యమా అని అంగూర్‌ సాగు తగ్గుతోంది. ప్రభుత్వం నుంచి  రైతులకు ప్రోత్సాహం కొరవడడంతో ద్రాక్షకు  బదులుగా ఇతర పంటలు సాగు చేస్తున్నారు.

రంగారెడ్డి అర్బన్‌/మేడ్చల్‌/శంషాబాద్‌ రూరల్‌, మార్చి 5: రాష్ట్రంలో ద్రాక్ష పళ్ల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో నేడు ద్రాక్ష తోటలు కనుమరుగవుతున్నాయి. 14 ఏళ్ల క్రితం 4వేల ఎకరాలకుపైగా సాగైన తోటలు నేడు వేయిలోపునకు చేరుకున్నాయి. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం నారాయణపూర్‌, అనంతారం, కొల్తూరు, మూడుచింతలపల్లి, ఉద్దెమర్రి, పొన్నాల్‌, శామీర్‌పేట, తూంకుంట, దేవరయంజాల్‌, మేడ్చల్‌ మండలం యాడారం, రాజబొల్లారం, ఎల్లంపేట, రాయిలాపూర్‌, కీసర, బోగారం, రాంపల్లి, ఘట్‌కేసర్‌ మండలం ఎదులాబాద్‌, అవుషాపూర్‌, అంకుషాపూర్‌ గ్రామాల్లో ద్రాక్ష ఎక్కువగా సాగు చేసేవారు. ఆలాగే రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, గట్టుపల్లి, మంచాన్‌పల్లి, తోకుంట, మంకాల్‌, శంషాబాద్‌ మండలం సంఘీగూడ, ఆమనగల్లు, తలకొండపల్లి, ఫరూక్‌నగర్‌ మండలాల్లో కూడా ఈ పంటను సాగు చేస్తున్నారు. సీడ్‌(విత్తులు), సీడ్‌లెస్‌ ద్రాక్ష(ఎక్స్‌పోర్టు క్వాలిటీ)ను పండించి కంటైనర్లలో ఎగుమతి చేసేవారు. అయితే, ఎంతో పేరు ప్రఖ్యాతులున్న దారక్ష సాగు నేడు క్రమేణా తగ్గుముఖం పడుతోంది.


  • యేటా పెరుగుతున్న సాగు ఖర్చులు..

ద్రాక్ష సాగులో పెరుగుతున్న పెట్టుబడులు, కూలీల కొరత, నీటి ఎద్దడి పుణ్యమా అని ద్రాక్ష సాగు తగ్గుతోంది. ఎకరా ద్రాక్ష సాగుకు రూ. లక్షల్లో ఖర్చు అవుతోంది. ఫర్టిలైజర్‌, పురుగుమందుల రేట్లు పెరిగాయి. కూలీల కొరత కూడా తీవ్రంగా ఉంది. ఇవన్నీ ఒకెత్తయితే ద్రాక్ష సాగైన భూముల్లో ఇప్పుడు రియల్‌ఎస్టేట్‌ వెంచర్లు చేశారు. చాలామంది రైతులు భూములను అమ్ముకున్నారు. పంటవేసి ఎండిపోయి నష్టపోయే బదులు భూములకు మంచి రేటు వస్తుండటంతో రైతులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు అమ్మేందుకు మొగ్గు చూపుతున్నారు. 


  • దక్కని ప్రభుత్వ సహకారం..

ప్రభుత్వం ద్రాక్ష రైతులకు సబ్సిడీలు ఇవ్వడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే.. రెండు మూడేళ్లలో ద్రాక్ష తోటలు కనుమరుగయ్యే ప్రమాదముంది. గతంలో ద్రాక్ష సాగుకు బ్యాంకులు సైతం రుణాలు ఇచ్చేందుకు ముందుకువచ్చేవి. కానీ ఇప్పుడు అవి కూడా ముందుకు రావడం లేదు. పంట నష్టపోయిన సమయాల్లోనూ సర్కారు రైతులను ఆదుకునేందుకు ముందుకు రావడం లేదు. కనీసం సాగుకు సబ్సిడీలు కూడా ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

  • ద్రాక్ష తోటల్లో వెలసిన ప్లాట్లు

హైదరాబాద్‌ నగరానికి రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలు ఆనుకుని ఉండటంతో ఇక్కడి భూముల రేట్లు కోట్లకు పడగెత్తాయి. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం పుంజుకోవడంతో చాలామంది రైతులు భూములను అమ్ముకున్నారు. దీంతో ద్రాక్షతోటలు ప్లాట్లుగా మారాయి. పచ్చని పొలాలన్నీ వెంచర్లుగా మారాయి. కొందరు రైతులు ద్రాక్ష తోటల సాగుతో నష్టాలు రావడంతో వాటి స్థానంలో ఇతర పంటలను సాగు చేస్తున్నారు. 


  • గిట్టుబాటు ధర లేక.. : - వెంకట్‌రెడ్డి, ద్రాక్ష రైతు, యాడారం

గిట్టుబాటు ధర లేక ఎక్స్‌పోర్టు క్వాలిటీ ద్రాక్షను సాగుచేయడం లేదు. మామూలు ద్రాక్ష సాగు కంటే ఎక్స్‌పోర్టు క్వాలిటీ ద్రాక్ష సాగుకు ఎకరాకు దాదాపు 60వేల వరకు అదనంగా ఖర్చు వస్తుంది. దీనికనుగుణంగా రేట్లు పెరుగకపోవడంతో ఎక్స్‌పోర్టు క్వాలిటీని పండించేందుకు రైతులు విముఖత చూపుతున్నారు. 


  • ద్రాక్ష రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : బుద్ధారెడ్డి, రైతు సంఘీగూడ, శంషాబాద్‌

27 ఏళ్లుగా 13 ఎకరాల్లో ద్రాక్ష సాగు చేస్తున్నాను. వచ్చిన డబ్బుల్లో ఖర్చులన్నీ తీసేస్తే గిట్టుబాటు కావడం లేదు. కూలీల సమస్య అధికంగా ఉంది. ఐదేళ్ల క్రితం గిట్టుబాటు బాగానే ఉండేది. కరోనా తర్వాత పరిస్థితులు మారాయి. ద్రాక్ష రైతులకు సబ్సిడీలు అందించి ప్రభుత్వం ఆదుకోవాలి.


  • మన అంగూర్‌కు మంచి డిమాండ్‌ : సునందారెడ్డి, రంగారెడ్డి జిల్లా ఉద్యానశాఖ అధికారి

రంగారెడ్డి జిల్లాలో అంగూర్‌ తోటలు వేసేందుకు అనువైన భూమి ఉంది. ఇక్కడ పండించే ద్రాక్షకు మంచి డిమాండ్‌ ఉంది. ద్రాక్ష తోట వేయడం కొంత ఖర్చుతో కూడుకున్నదే. నిర్వహణ ఎక్కువగా ఉండటం కారణంగా రైతులు ద్రాక్ష వేయడం తగ్గించారు. దీనికి తోడు మహారాష్ట్ర నుంచి దిగుమతి అవుతున్న ద్రాక్ష కిలో 30 రూపాయలకు అమ్మడంతో మన రైతులు నష్టపోతున్నారు. 

ఉమ్మడి జిల్లాలో ద్రాక్ష సాగు వివరాలు(ఎకరాల్లో)

సంవత్సరం         సాగైంది

2008-09 4,212.5

2009-10 1,875

2010-11 1,875

2011-12 2,047.5

2012-13 2,047.5

2014-14 2,047.5

2014-15 2,090

2016-2022 776 (ప్రతీ సంవత్సరం 776 ఎకరాలు)

సాగు ఖర్చు పెరుగుదల ఇలా (రూపాయల్లో)

     పదేళ్లక్రితం ప్రస్తుతం

ఒక కూలీకి 50 500

సల్ఫర్‌ 30 160

బ్లూకాపర్‌ 60 420


Updated Date - 2022-03-06T04:23:39+05:30 IST