‘ఆశా’లతో స్కూటమి డబ్బాలు మోపించొద్దు

ABN , First Publish Date - 2022-12-12T23:20:46+05:30 IST

‘ఆశా’లతో స్కూటమి (తెమడ) డబ్బాలు మోపించే విధానాన్ని రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కవిత డిమాండ్‌ చేశారు.

‘ఆశా’లతో స్కూటమి డబ్బాలు మోపించొద్దు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యలయం ఎదుట ధర్నా చేస్తున్న ‘ఆశా’లు

సీఐటీయూ జిల్లా కార్యదర్శి కవిత

రంగారెడ్డి అర్బన్‌, డిసెంబర్‌ 12 : ‘ఆశా’లతో స్కూటమి (తెమడ) డబ్బాలు మోపించే విధానాన్ని రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కవిత డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుష్ఠువ్యాధి గుర్తింపు ఉద్యమంలో భాగంగా ఆశాలతో ఇంటింటి సర్వే చేయిస్తున్నారని, తెమడ డబ్బాలు మోపించే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. డిసెంబరు 6 నుంచి నిర్వహిస్తున్న లెప్రసీ సర్వేకు, 2023 జనవరి 18 నుంచి నిర్వహించే కంటి వెలుగు పనికి ప్రభుత్వం అదనంగా డబ్బులు చెల్లించాలని కోరారు. ఆశాలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఈ లోపు ఏపీలో ఇస్తున్నట్లు ఫిక్స్‌డ్‌ వేతనం రూ.10 వేలు ఇవ్వాలన్నారు. 2021 జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు 6 నెలల పీఆర్సీ ఏరియర్స్‌ వెంటనే చెల్లించాలని, కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్‌ అలవెన్స్‌ నెలకు వేయి రూపాయల చొప్పున 16 నెలల బకాయిలు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 32 రకాల రిజిస్టర్స్‌ ప్రింట్‌ చేసి ప్రభుత్వమే సరఫరా చేయాలని, ఈ లోపు ఆశాలు రిజిస్టర్‌ కోసం పెట్టిన ఖర్చులు చెల్లించాలని, క్వాలిటీతో కూడిన ఐదేళ్ల పెండింగ్‌ యూనిఫామ్స్‌ వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జిల్లా ఆసుపత్రుల్లో ఆశాలకు రెస్టు రూం ఏర్పాటు చేయాలని, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆశాలకు పీఎఫ్‌, ఈఎ్‌సఐ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అధికారుల వేధింపులు అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో ఆశా కార్యదర్శి సునీత, జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రమోహన్‌, సాయిబాబ, రుద్రకుమార్‌, జిల్లా కమిటీ సభ్యులు కురుమయ్య, శేఖర్‌, సుజాత, సరస్వతి, లత, శంకరమ్మ, అనిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T23:20:46+05:30 IST

Read more