మూఢనమ్మకాలతో జీవితాన్ని పాడు చేసుకోవద్దు

ABN , First Publish Date - 2022-05-19T05:30:00+05:30 IST

మూఢనమ్మకాలతో జీవితాన్ని పాడు చేసుకోవద్దు

మూఢనమ్మకాలతో జీవితాన్ని పాడు చేసుకోవద్దు
అశ్వినితో మాట్లాడుతున్న మాజీమంత్రి ప్రసాద్‌కుమార్‌

  • ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్‌, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ 
  • భూతవైద్యుడి నిర్వాకంతో గాయాలపాలైన బాలికకు పరామర్శ

వికారాబాద్‌/ధారూరు, మే 19 : మూఢనమ్మకాలతో జీవితాన్ని పాడుచేసుకోవద్దని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ పేర్కొన్నారు. గురువారం ధారూరు మండలం కుక్కింద గ్రామానికి చెందిన అశ్వినీని తల్లిదండ్రులు నస్కల్‌లోని రఫీ అనే దొంగ బాబాను నమ్మి.. మూఢనమ్మకంతో నిప్పులపై రెండు కాళ్లు, ఒక చెయ్యి పెట్టించడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను వికారాబాద్‌ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఈమేరకు అశ్విన్‌ను ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేర్వేరుగా వెళ్లి పరామర్శించి జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా, అశ్విని ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించగా.. మాజీమంత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో దొంగ బాబాల వివరాలు సేకరించి వారిపై చర్యలు తీసుకోవాలని, వైద్య, పోలీస్‌ శాఖతో ఎమ్మెల్యే మాట్లాడారు. వారితో పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. కాగా, మాజీ మంత్రి జి. ప్రసాద్‌కుమార్‌ వైద్యఖర్చుల నిమిత్తం రూ.10వేల నగదును కుటుంబసభ్యులకు అందజేశారు. ఆయనతో కాంగ్రెస్‌ పార్టీ ధారూరు మండలాధ్యక్షుడు పి.రఘువీరారెడ్డి, మాజీ జడ్పీటీసీ పి.రాములు తదితరులు ఉన్నారు. అదేవిధంగా టీఆర్‌ఎస్‌ నాయకుడు వడ్ల నందు అశ్వినీని ఆస్పత్రిలో పరామర్శించారు. అనంతరం ఆమె కుటుంబసభ్యులతో మాట్లాడి రూ.5వేల ఆర్థికసాయం అందించారు. ఆయనవెంట సర్పంచుల సంఘం అధ్యక్షులు వీరేశం, కొండాపూర్‌ కలాన్‌ సర్పంచ్‌ పరమేశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.

  • బురిడీ బాబాలపై చర్యలు తీసుకోవాలి

బురడీ బాబాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, అశ్వినికి జరిగిన విధంగా ఎవరికీ జరుగకుండా చూడాలని బీఎస్పీ వికారాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పెద్ది అంజయ్య అన్నారు. గురువారం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అశ్వినీని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.


Updated Date - 2022-05-19T05:30:00+05:30 IST