క్షుద్ర పూజల నెపంతో మహిళల నిర్బంధం

ABN , First Publish Date - 2022-10-18T04:34:49+05:30 IST

క్షుద్ర పూజల నెపంతో మహిళల నిర్బంధం

క్షుద్ర పూజల నెపంతో మహిళల నిర్బంధం
రాపోల్‌లో క్షుద్రపూజలు చేస్తున్నారని ఆరుగురు మహిళలను పంచాయతీ భవనంలో బంధించిన గ్రామస్థులు

 వికారాబాద్‌ జిల్లా రాపోల్‌లో ఘటన

పరిగి రూరల్‌, అక్టోబర్‌ 17(ఆంధ్రజ్యోతి): క్షుద్ర పూజలు చేస్తున్నారనే నెపంతో ఆరుగురు మహిళలను గ్రామ పంచాయతీ భవనంలో నిర్బంధించిన  సంఘటన సోమవారం పరిగి మండలం రాపోల్‌లో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని రోజులుగా ఇళ్ల ముందు క్షుద్రపూజల పటాలు గ్రామస్థులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. రోజూ ఇళ్ల ముందు పసుపు, కుంకుమ ముగ్గులు వేసి నిమ్మకాయలు పెడుతున్నారు. దీంతో ఊరంతా భయంతో వణికిపోతున్నారు. 15 రోజులుగా ఈ తంతు కొనసాగుతుంది.  గ్రామానికి చెందిన వారే ఈపని చేస్తున్నారని, వారిని పట్టుకోవాలని కాపు కాశారు. ఆదివారం అర్ధరాత్రి నలుగురు గ్రామ మహిళలు పోచమ్మ గుడి వద్ద అటు, ఇటు తిరుగుతూ అనుమానాస్పదంగా తచ్చాడారు. గుడివద్ద తిరుగుతున్న వారిని పట్టుకొని ఇంత రాత్రి ఇక్కడేం చేస్తున్నారని నిలదీశారు. ఆ మహిళలు పొంతన లేని సమాధానాలు చెప్పి ఓ ఇంట్లోకు పారిపోయే ప్రయత్నం చేశారు. అక్కడ మరో ఇద్దరు మహిళలు ఉన్నారు. క్షుద్ర పూజలకు పాల్పడుతున్నది మీరే అంటూ వారిని పంచాయతీ భవనంలో బంధించారు. సోమవారం ఉదయం పట్టుబడిన సదరు మహిళలను శిక్షించాలని గ్రామస్థులు పట్టుబట్టారు. కాని పట్టుబడిన మహిళలు మాత్రం తాము క్షుద్ర పూజలు చేయలేదని వాపోయారు. మరి అర్ధరాత్రి పోచమ్మగుడి చుట్టూ ఎందుకు తిరిగారని గ్రామస్థులు నిలదీయగా ఏమీ చెప్పలేక పోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని గ్రామస్థులతో మాట్లాడారు. ఆరుగురు మహిళలను పరిగి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Updated Date - 2022-10-18T04:34:49+05:30 IST