డీసీసీ పీఠం ఎవరికో?
ABN , First Publish Date - 2022-12-16T00:08:19+05:30 IST
కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. చాలామంది సీనియర్లు ఆ పదవి పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
అధ్యక్షుడి నియామకంపై కాంగ్రెస్ మల్లగుల్లాలు
తెరపైకి మల్రెడ్డి రాంరెడ్డి పేరు!
రేస్‌లో మరికొందరు సీనియర్లు
కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. చాలామంది సీనియర్లు ఆ పదవి పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష రేస్‌లో అనేకమంది పేర్లు వినిపిస్తున్నప్పటికీ సీనియార్టీతోపాటు అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం, ఆర్థిక, అంగబలం ఉన్న నేతకు పగ్గాలు అప్పగించాలని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. డీసీసీ రేస్‌లో మల్రెడ్డి రాంరెడ్డి ముందున్నట్లు ప్రచారం సాగుతోంది.
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, డిసెంబరు 15) : వచ్చే ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్న వేళ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మాత్రం ఇంకా జిల్లా అధ్యక్షుని నియామకంపై మల్లగుల్లాలు పడుతూనే ఉంది. ఈ నెల 10వ తేదీన టీపీసీసీ కార్యవర్గంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 26మంది డీసీసీ అధ్యక్షులను నియమించిన కాంగ్రెస్ అధినాయకత్వం.. 9 చోట్ల డీసీసీ అధ్యక్షులను భర్తీ చేయలేదు. ఇందులో రంగారెడ్డిజిల్లా పార్టీ అధ్యక్షుని నియామకాన్ని కూడా పెండింగ్ పెట్టింది. ప్రస్తుత అధ్యక్షునిగా ఉన్న చల్లా నర్సింహారెడ్డిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించింది. దీంతో జిల్లా అధ్యక్ష పగ్గాలు ఎవరికి అప్పగిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. డీసీసీ పగ్గాలు చేపట్టేందుకు అనేకమంది నేతలు ఆసక్తిచూపుతున్నారు. అయితే సీనియార్టీతో పాటు అందరినీ కలుపుకుని పోయే వ్యక్తిత్వం గల వారికి పగ్గాలు అప్పగించాలని పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. దీనిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నప్పటికీ కొందరు సీనియర్లు అడ్డుతగలడంతో పార్టీ నాయకత్వం పునరాలోచనలో పడినట్లు సమాచారం. దీనిపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో కూడా ఇప్పటికే రెండు, మూడు సార్లు పార్టీ అధినాయకత్వం మాట్లాడినట్లు తెలిసింది.
ఉమ్మడి జిల్లా నుంచే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఈ మూడు జిల్లాల్లో పార్టీ పదవుల నియామకాల్లో ఆయన నిర్ణయమే కీలకం. ఆయన సూచన మేరకే వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌లను డీసీసీ అధ్యక్షులుగా కొనసాగించాలని నిర్ణయించారు. కానీ రాజకీయ ప్రాఽధాన్యత కలిగిన రంగారెడ్డిజిల్లా విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అంతేకాక జిల్లాలోని పలు నియోజకవర్గాలకు ఇంకా ఇన్‌చార్జ్‌ల నియామకం జరగలేదు. వత్తిళ్లు ఎక్కువగా ఉండడంతో పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. అయితే ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ నాన్చివేత ఽధోరణి పార్టీకి నష్టం జరుగుతుందని పార్టీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. ఇంకా పట్టుమని ఏడాది కూడా ఎన్నికలకు సమయం లేనందున పూర్తిస్థాయిలో జనంలోకి పార్టీని తీసుకువెళ్లేందుకు కార్యక్రమాలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. గత ఎన్నికల తరువాత కాంగ్రెస్ జిల్లాలో డీలా పడింది. ముఖ్యనేతలంతా అధికార పార్టీలో చేరిపోయారు. మరోవైపు బీజేపీ జిల్లాలో దూసుకుపోతోంది. ఇప్పటికే నగర శివార్లలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గణనీయంగా కేడర్‌ను పెంచుకుంది. బీజేపీ దూకుడు చూసి కాంగ్రె్‌సలో కొం దరు నేతలు కాషాయ గూటికి చేరే ఆలోచనలో ఉన్నారు. ఈ సమయంలో పార్టీని ముందుకు నడిపే వారు కనిపించకపోతే మరింత నష్టం జరుగుతుందని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
రేస్‌లో మల్రెడ్డి రాంరెడ్డి!
రంగారెడ్డిజిల్లా కాంగ్రెస్ అధ్యక్ష రేస్‌లో అనేకమంది పేర్లు వినిపిస్తున్నప్పటికీ సీనియార్టీతోపాటు అందరినీ కలుపుకుపోయే ఆర్థిక, అంగబలం ఉన్న నేతకు పగ్గాలు అప్పగించాలని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. డీసీసీ అధ్యక్ష పగ్గాలు కోసం కొందరు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ పెద్దలను కలిసి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఇదిలాఉంటే డీసీసీ రేస్‌లో మాజీ మంత్రి కోండ్రు పుష్పలీలతోపాటు మల్రెడ్డి రాంరెడ్డి, చేవెళ్లకు చెందిన ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి, పి.జనార్దన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నంకు చెందిన మర్రి నిరంజన్‌రెడ్డి, మహిపాల్, శేఖర్‌గౌడ్, మహేశ్వరానికి చెందిన దేప భాస్కర్‌రెడ్డి, ఏనుగు జంగారెడ్డి, అమరేందర్‌రెడ్డి, దండెం రామిరెడ్డి, శంషాబాద్ వేణుగౌడ్ తదితరులు ఉన్నారు. ఇందులో మాజీ మంత్రి పుష్పలీల మహిళా కోటా కింద తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అలాగే మిగతా నేతలు కూడా సామాజిక, ఇతర సమీకరణాల ఆధారంగా తమకు అవకాశం కల్పించాలని అడుగుతున్నారు. అయితే రేస్‌లో మల్రెడ్డి రాంరెడ్డి ముందున్నట్లు ప్రచారం సాగుతోంది.