దశలవారీగా అందరికీ ‘దళితబంధు’

ABN , First Publish Date - 2022-09-25T05:53:28+05:30 IST

దశలవారీగా అందరికీ ‘దళితబంధు’

దశలవారీగా అందరికీ ‘దళితబంధు’
పెద్దేముల్‌ : నాగులపల్లిలో చీరలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

పెద్దేముల్‌, సెప్టెంబరు 24 :  దశలవారీగా అందరికీ దళితబంధు పథకం వర్తింపజేస్తామని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. శనివారం పెద్దేముల్‌ మండలంలోని గాజీపూర్‌, నాగులపల్లి, మారేపల్లిలో ఎమ్మెల్యే బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితబంధు పథకాన్ని అందరికీ అందజేస్తామని అన్నారు. ఎంపీపీ అనురాధ రమేష్‌, జడ్పీటీసీ ధారాసింగ్‌, వైస్‌ఎంపీపీ మధులత, ఎంపీటీసీల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్‌చారి, సర్పంచ్‌లు వీరప్ప, భాగ్యలక్ష్మి, ఎంపీటీసీలు పటేల్‌ ప్రవీణ్‌కుమార్‌, సురేఖ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కోహీర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

  • కండువా కప్పుకుంటేనే దళితబంధు ఇస్తారా?

గులాబి కండువా కప్పుకుంటేనే దళితబంధు ఇస్తారా? అంటూ నాగులపల్లిలో కొంతమంది దళితులు ఎమ్మెల్యేను నిలదీశారు. పెద్దేముల్‌ మండలం నాగులపల్లిలో బతుకమ్మ చీరలు పంపిణీని వెళుతున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని గ్రామంలోని చర్చి వద్ద కారు ఆపి నిలదీశారు. మీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డామని, దళితబంధు కోసం ధరఖాస్తు చేసుకుందామంటే టీఆర్‌ఎస్‌లో చేరాలని, కండువా కప్పుకుంటేనే దళితబంధు ఇస్తామని చెపుతున్నారని, కండువా కప్పుకోకుంటే ఇవ్వరా అంటూ ప్రశ్నించారు. దీంతో కొంత అసహనానికి గురైన ఎమ్మెల్యే అవును కండువా కప్పుకుంటేనే ఇస్తామని, కష్టపడే వారికి ప్రాధాన్యత ఇవ్వాలి కాదా? అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. 

  • పండుగ వేళ ప్రతీ ఒక్కరు సంతోషంగా ఉండాలి

బషీరాబాద్‌ : బతుకమ్మ పండుగ వేళ ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. బషీరాబాద్‌ మండల కేంద్రంతోపాటు కొర్విచెడ్‌ గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరలు, పాత పింఛన్‌దారులకు కార్డులు పంపిణీ చేశారు. ఎంపీపీ కరుణా అజయ్‌ప్రసాద్‌, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఎ.వెంకట్‌రాంరెడ్డి, వైస్‌చైర్మన్‌ అజయ్‌ప్రసాద్‌, వైస్‌ఎంపీపీ అన్నపూర్ణ, సర్పంచ్‌ ప్రియాంక, టీఆర్‌ఎస్‌ ప్రెసిడెంట్‌ రామునాయక్‌, సీనియర్‌ నాయకులు నర్సిరెడ్డి, తహసీల్దార్‌ వెంకటస్వామి, సర్పంచ్‌లు, తదితరులున్నారు. కాగా, చీరల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేను  వీఆర్‌ఏలు కలిసి తమ సమస్యలను విన్నవించగా, త్వరలోనే సమస్యల పరిష్కారమవుతాయని, ప్రభుత్వం ఆదిశగా యోచిస్తున్నట్లు వివరించారు. 

  • మాజీ ఎమ్మెల్యేను కలిసిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

మాజీ ఎమ్మెల్యే ఎం.నారాయణరావును బషీరాబాద్‌లోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే కలిశారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే ప్రమాదవశాత్తు కిందపడటంతో కాలికి సర్జరీ చేయించుకున్నారు. దీంతో రోహిత్‌రెడ్డి నారాయణరావు యోగ క్షేమాలు, ఆర్యో పరిస్థితుల గురించి ఆయనతో ముచ్చటించారు. ఎమ్మెల్యే వెంట తాండూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విఠల్‌నాయక్‌, మండలాధ్యక్షుడు రామునాయక్‌, సీనియర్‌ నాయకులు ఇందర్‌చెడ్‌ నర్సిరెడ్డి తదితరలున్నారు.

  • ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిక

తాండూరు రూరల్‌ :  తాండూరు మండలం కోటబాస్పల్లి, యాలాల మండలం అగ్గనూరు, కోట్‌పల్లి మండలానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరగా, రోహిత్‌ వారికి కండువాలుకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లా కో-ఆప్షన్‌ సభ్యులు అక్బర్‌బాబా, ఎంపీటీసీల ఫోరం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సాయిరెడ్డి, వైస్‌ఎంపీపీ రమేష్‌, యాలాల, టీఆర్‌ఎస్‌ తాండూరు మండలాల అధ్యక్షులు రవీందర్‌రెడ్డి, రామ్‌దాస్‌, శేఖర్‌గౌడ్‌, సీనియర్‌ నాయకులు ఉమాశంకర్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పాండు, రాంచందర్‌, ఎంపీటీసీ గరివప్ప, వెంకటయ్య, సాయిలు, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.


Read more