ముగిసిన రాష్ట్ర స్థాయి బాలల జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌

ABN , First Publish Date - 2022-12-11T23:46:05+05:30 IST

విద్యార్థుల్లోని సృజనాత్మకతకు పదును పెట్టేందుకు నందిగామ మండలం రంగాపూర్‌లోని నాట్కో హైస్కూల్‌లో రెండు రోజుల పాటు ఏర్పాటు చేసిన 30వ రాష్ట్ర స్థాయి బాలల జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ విజయవంతంగా ముగిసింది.

ముగిసిన రాష్ట్ర స్థాయి బాలల జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌
జాతీయస్థాయికి ప్రాజెక్టులకు ఎంపికైన విద్యార్థులతో అధికారులు

రెండు రోజుల పాటు నందిగామ మండలం రంగాపూర్‌లోని నాట్కో హైస్కూల్‌లో నిర్వహణ

జాతీయ స్థాయి పోటీలకు 13 ప్రాజెక్టుల ఎంపిక

రంగారెడ్డి అర్బన్‌/నందిగామ, డిసెంబరు 11 : విద్యార్థుల్లోని సృజనాత్మకతకు పదును పెట్టేందుకు నందిగామ మండలం రంగాపూర్‌లోని నాట్కో హైస్కూల్‌లో రెండు రోజుల పాటు ఏర్పాటు చేసిన 30వ రాష్ట్ర స్థాయి బాలల జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ విజయవంతంగా ముగిసింది. జాతీయ శాస్త్ర సాంకేతిక, సమాచార విభాగం (ఎన్‌సీఎ్‌సటీసీ), రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ-రాష్ట్ర విద్యాశిక్షణ-పరిశోధన సంస్థ కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి 33 జిల్లాల నుంచి 174 ప్రాజెక్టులు ప్రదర్శించారు. జాతీయ సైన్స్‌ కాంగ్రె్‌సలో 13 ప్రాజెక్టులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. అందులో రంగారెడ్డి జిల్లా నుంచి రెండు స్కూల్స్‌ జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యాయి. కందుకూరు మండలం నేదునూరు గ్రామంలోని టీఎ్‌సఎంఎస్‌ విద్యార్థిని శివనందిని ఆలోమీటర్‌. శంకర్‌పల్లిలోని టీఎ్‌సఎంఎస్‌ స్కూల్‌కు చెందిన విద్యార్థి ఎండీ అమీర్‌ ఆటోమెటిక్‌ ఫర్టిలైజర్‌ డిస్పెన్సర్‌ గురించి ప్రదర్శించారు.

ముగింపు కార్యక్రమానికి తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సెక్రటరీ నాగేష్‌ హాజరయ్యారు. జాతీయ స్థాయికి ఎంపికైన 13 ఉత్తమ ప్రదర్శనలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. సైన్స్‌ ప్రదర్శనలు భవిష్యత్‌లో విద్యార్థులు శాస్త్రవేత్తలుగా అవతరించడానికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన తెలిపారు.

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ మదన్‌మోహన్‌ మాట్లాడుతూ సమకాలీన సమాజంలో మానవుడు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషణ దృక్పథంతో పరిశీలించి సమస్యలకు పరిష్కారం కోసం ఆలోచించాలని విద్యార్థులకు తెలిపారు.

జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఎంపికైన ప్రాజెక్టులను తప్పనిసరిగా జనవరిలో అహ్మదాబాద్‌లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు తీసుకెళ్లాలని సూచించారు. ఏర్పాట్లు చేసిన నాట్కో స్కూల్‌ బృందాన్ని అభినందించారు.

ముగింపు సమావేశంలో తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అధికారులు రామకృష్ణ, జిల్లా సైన్స్‌ అధికారులు రాజిరెడ్డి, శ్రీనివాస్‌, ఎంఈవో క్రిష్ణారెడ్డి, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు నాట్కో పాఠశాల డైరెక్టర్‌ రాంబాబు, కె. శైలజ, పి. మోహన్‌రావు, డాక్టర్‌ విజయ్‌కుమార్‌, ప్రొఫెసర్‌ వి. నథనైల్‌, డాకట్ర్‌ శశికళ, జె, శ్రీనివాసులు, డాక్టర్‌ ఎ. శ్రీనివాస్‌, డాక్టర్‌ డి. అపర్ణ, కె. భారతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-11T23:47:35+05:30 IST