కూలిన కల్వర్టు.. మరమ్మతులు ఎప్పుడో!

ABN , First Publish Date - 2022-12-15T23:57:37+05:30 IST

ఈ ఏడాది జూన్‌, జూలై, సెప్టెంబర్‌ మాసాలలో కురిసిన భారీ వర్షాలకు కేశంపేట మండలంలో చెరువులు నిండి అలుగుపారాయి

కూలిన కల్వర్టు.. మరమ్మతులు ఎప్పుడో!
వరద తాకిడికి కూలిన కల్వర్టు

కేశంపేట, డిసెంబరు 15: ఈ ఏడాది జూన్‌, జూలై, సెప్టెంబర్‌ మాసాలలో కురిసిన భారీ వర్షాలకు కేశంపేట మండలంలో చెరువులు నిండి అలుగుపారాయి. పెద్దవాగు నేటికీ పారుతోంది. వరదల తాకిడికి అక్కడక్కడ కల్వర్టులు దెబ్బతిన్నాయి. మండల పరిధిలోని కాకునూర్‌ గ్రామం నుంచి లేమామిడికి వెళ్లే మార్గంలో వరద తాకిడికి వాగు సమీపంలోని కల్వర్టు దెబ్బతిన్నది. నీటి ఉధృతికి పైపుల కిందమట్టి కొట్టుకుపోయింది. దీంతో కల్వర్టు ప్రమాదకరంగా మారింది. అక్కడ రోడ్డు కుంగుతుంది. ప్రస్తుతం వాగు పారుతుండడంతో మోటరు సైకిల్‌, ఆటోలు మాత్రమే వెళ్తున్నాయి. అందులో ప్రయాణించే వారు సైతం బిక్కుబిక్కుమంటూ వెళ్తున్నారు. వాగులో నీరు పారడం ఆగిపోతే ఈ మార్గంలో ట్రాక్టర్లు, మిని డీసీఎంలు వెళ్లే అవకాశం ఉంది. లోడుతో ఆ వాహనాలు వెళ్తే కల్వర్టు పూర్తిగా ధ్వంసమయ్యే ప్రమాదముంది. ప్రమాదాలు జరగకముందే అధికారులు కల్వర్టుకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు.

మరమ్మతులు చేపట్టాలి

వరదలకు దెబ్బతిన్న కల్వర్టుకు మరమ్మతులు చేపట్టాలి. వరద తాకిడికి కల్వర్టు పైపుల కింద మట్టికొట్టుకు పోయింది. దీంతో రోడ్డు వదులుగా మారి ప్రమాదకరంగా మారింది. లోడుతో ట్రాక్టర్లు, మినీ డీసీఎంలు ఈ మార్గంలో వెళ్తే ప్రమాదం జరగవచ్చు. ఎలాంటి ప్రమాదాలు జరుగక ముందే అధికారులు స్పందించి కల్వర్టుకు మరమ్మతులు చేపట్టాలి.

- కోడూర్‌ రాములు, కాకునూర్‌

Updated Date - 2022-12-15T23:57:38+05:30 IST