చింతపట్ల లక్ష్మణ్ చెరువు నిండేదెలా?
ABN , First Publish Date - 2022-07-14T05:40:30+05:30 IST
యాచారం మండలం చింతపట్లలోని
- వరదనీరు రాకుండా వెంచర్ల ఏర్పాటు
- కల్వర్టులనూ మూసేసిన రియల్టర్లు
- బ్లాస్టింగులతో చెరువు నీరు కలుషితం
- మృత్యువాతపడుతున్న చేపలు
యాచారం, జూలై 13 : యాచారం మండలం చింతపట్లలోని లక్ష్మణ్ చెరువుకు ముప్పు పొంచి ఉంది. తక్కళ్లపల్లి, మేడిపల్లి గ్రామాల నుంచి వరదనీరు వచ్చే దారిలో వాగులు కబ్జాలకు గురయ్యాయి. రియల్టర్లు కల్వర్టులు మూసివేసి మూడుచోట్ల వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో చెరువులోకి వరద నీరు రావడం లేదని రైతులు చెబుతున్నారు. మండలంలో లక్ష్మణ్ చెరువు అతిపెద్ద చెరువు. దీని ఆయకట్టు 150 ఎకరాలలో 318 మంది రైతులు జీవనం సాగిస్తున్నారు. చెరువు నిండితే 85 కుటుంబాల మత్స్యకారులకు ఏడాది పొడవునా ఉపాధి లభిస్తుంది. కాగా వరద నీరు రాకుండా వెంచర్లు వెలుస్తుండటంతో చెరువు నిండటం లేదు. దీంతోపాటు చెరువులోకి వరదనీరు వచ్చే దారిలో రియల్టర్లు తరచూ బ్లాస్టింగ్‌లు చేయడంతో వాగులోకి కాలుష్య పదార్థాలు చెరువులోకి చేరుతున్నాయి. దీంతో చేపలు చనిపోతున్నాయని మత్స్యకారులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. దీంతో తాము ఉపాధి కోల్పోతున్నామని అంటున్నారు. చెరువు అలుగుపారితే మూడేళ్లపాటు మూడు మార్లు వరి పంటతోపాటు కూరగాయలు సాగు చేసుకుంటామని ఆయకట్టు రైతులు చెబుతున్నారు. ఈ చెరువు నిండితే మంతన్‌గౌరెల్లిలో చెరువు నిండి నల్లగొండ జిల్లాలోని మర్రిగూడ, నాంపల్లి మండలాల్లోని చెరువుల్టోకి వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం చెరువులో వరద నీరు వచ్చే దారులు మూసుకుపోవడంతోపాటు పూడిక కూడా బాగా నిండిపోయింది. దీంతో చెరువు మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని రైతులు గగ్గోలు చెందుతున్నారు. చెరువు ఉన్నచోట వెంచర్ల ఏర్పాటుకు ఇరిగేషన్ అధికారులు ఎలా అనుమతి ఇస్తారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. వెంచర్లలో ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
చెరువును కాపాడండి
మా చెరువులోకి వరద నీరు రాకుండా వెంచర్లు ఏర్పాటు చేశారు. కల్వర్టు కూడా మూసేశారు. దాంతో వరద నీరు రాక చెరువు నిండటం లేదు. కొన్ని రోజులుగా చెరువు పైభాగాన తరచూ బ్లాస్టింగులు చేస్తున్నారు. బ్లాస్టింగుల కారణంగా చెరువు నీరు కలుషితమై చేపలు చనిపోతున్నాయి. దీంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేపలు చావకుండ అధికారులు చొరవ తీసుకోవాలి.
- కె.మల్లేష్, రైతు చింతపట్ల