విద్యుత్‌ ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర

ABN , First Publish Date - 2022-11-02T23:49:27+05:30 IST

విద్యుత్‌ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంద్యాల నర్సింహారెడ్డి ఆరోపించారు. అదేవిధంగా వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించాలని యోచిస్తున్న కేంద్ర ప్రభుత్వ

విద్యుత్‌ ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర
సభలో మాట్లాడుతున్న నంద్యాల నర్సింహారెడ్డి

రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంద్యాల నర్సింహారెడ్డి

యాచారం, నవంబరు 2 : విద్యుత్‌ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంద్యాల నర్సింహారెడ్డి ఆరోపించారు. అదేవిధంగా వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించాలని యోచిస్తున్న కేంద్ర ప్రభుత్వ పతనం ఖాయమని అన్నారు. బుధవారం యాచారం మండలంలోని గున్‌గల్‌ గేటు వద్ద జరిగిన జిల్లా రైతు సంఘం మహాసభలో నర్సింహారెడ్డి మాట్లాడారు. కేంద్రం వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేయడం కోసం అనేక చట్టాలను తెచ్చిందని, వాటిని అమలుచేస్తే ఊరుకునేది లేదన్నారు. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నా పాలకులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. గిట్టుబాటు ధరపై అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదన్నారు. తాము రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్పడమే గానీ.. ఆచరణలో చేసిందేమీ లేదన్నారు. ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలను అడ్డగోలుగా పెంచారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌ కారణంగా రైతులకు నేటికీ పాస్‌పుస్తకాలందక రైతుబంధు రైతుబీమా పథకాలను నోచుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు సాగునీరు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఎన్నికల ముందు ఓట్లను దండుకునేందుకు ఈ అంశాన్ని వాడుకుంటుందని విమర్శించారు. శివన్నగూడ భూనిర్వాసితులకు పరిహారం చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని ప్రశ్నించారు. జిల్లాలో భారీ చిన్నతరహా పరిశ్రమల కారణంగా వ్యవసాయరంగం కుంటుపడుతుందని జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులపై రాయితీని ఎత్తివేతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని ఆయన చెప్పారు. సమావేశంలో నాయకులు బొంతల చంద్రారెడ్డి, సీపీఎం రాష్ట్ర నాయకులు పి.జంగారెడ్డి, సీపీఎం జిల్లా మాజీ కార్యదర్శి డి.రాంచందర్‌, సీపీఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ, నాయకులు ధావ్‌నాయక్‌, జగన్‌, వినోద్‌కుమార్‌ తదితరులున్నారు.

రైతు సంఘం జిల్లా నూతన కార్యవర్గం

రైతు సంఘం రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని బుధవారం గున్‌గల్‌లో జరిగిన మహాసభలో ఎన్నుకున్నట్లు నంద్యాల నర్సింహారెడ్డి తెలిపారు. జిల్లా కార్యదర్శిగా బి.మధుసూదన్‌రెడ్డి, అధ్యక్షులుగా దుబ్బాక రామచంద్రయ్య, ఉపాధ్యక్షులుగా కె.భాస్కర్‌, శ్రీనివా్‌సరెడ్డి, భాస్కర్‌రెడ్డి, విక్రమ్‌, సహాయ కార్యదర్శిగా ఎంపీ నర్సింహ, రామకృష్ణారెడ్డి, జగన్‌లతోపాటు 25మంది కార్యవర్గ సభ్యులను ఎన్నిక చేశామన్నారు.

Updated Date - 2022-11-02T23:49:27+05:30 IST
Read more