పడకేసిన పల్లెలు!

ABN , First Publish Date - 2022-08-05T04:47:31+05:30 IST

సీజనల్‌ వ్యాధుల విజృంభణతో పల్లెలు మంచం పట్టాయి.

పడకేసిన పల్లెలు!
చేవెళ్లలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో బారులుదీరిన రోగులు

  • విజృంభిస్తున్న జ్వరాలు 
  • సర్కారు దవఖానాల్లో అందని వైద్యం 
  • ప్రైవేట్‌ ఆస్పత్రులకు రోగుల పరుగులు
  • ఓపీతోనే సరిపెడుతున్న డాక్టర్లు 
  • ప్రైవేట్‌ ఆస్పత్రులకు రెఫర్లతో ఇబ్బందులు
  • ఆసుపత్రుల్లో ఇన్‌పేషెంట్లు లేక బెడ్లు ఖాళీ 
  • కలుషిత నీటితో ప్రబలుతున్న డయేరియా
  • గ్రామాల్లో లోపించిన పారిశుధ్యం.. విజృంభిస్తున్న దోమలు  
  • అల్లాడుతున్న ప్రజలు


సీజనల్‌ వ్యాధుల విజృంభణతో పల్లెలు మంచం పట్టాయి. ఏ రోగమొచ్చినా, నొప్పొచ్చినా స్థానికులకు అందుబాటులో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో అవసరమైన వైద్యులు, సిబ్బంది లేక సేవలు సరిగా అందడం లేదు. వాటిల్లో మందులున్నా ఇచ్చేవారు కరువయ్యారు. దీంతో ప్రభుత్వ వైద్యం పేదలకు అందని ద్రాక్షే అవుతోంది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చూపించుకునే స్థోమత లేక పేదలు విషజ్వరాలు, డెంగీ, డయేరియా, మలేరియా తదితర సీజనల్‌ వ్యాధులతో మగ్గుతున్నారు. ఇదిలాఉంటే గ్రామాలు, పట్టణాల్లో లోపించిన పారిశుధ్యంతో ఈగలు, దోమలు వృద్ధిచెంది వ్యాధులు మరింత ఎక్కువ మందికి ప్రబలుతున్నాయి.


రంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 4: జోరుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతోన్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈసీ మూసీ నదుల ప్రవాహం కొనసాగుతోంది. వరదకు చెత్తా చెదారం కొట్టుకు రావడం.. వీధుల్లో నీళ్లు నిలిచి దోమలకు నెలవుగా మారాయి. గ్రామాల్లో అపరిశుభ్రత వాతావరణం నెలకొంది. మురుగునీటి నిలువతో దోమలు పెరుగుతున్నాయి. పారిశుధ్య లోపంతో సీజనల్‌ వ్యాధులు సోకి పల్లెలు పడకేశాయి. ప్రజలు జ్వరాలతో మంచం పడుతున్నారు. కలుషిత నీటితో అతిసార వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి.


మందులు ఫుల్‌... వైద్య సేవలు నిల్‌

జిల్లా పరిధిలోని జిల్లా, ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో సీజనల్‌ వ్యాధులకు మందు గోలీలు, వ్యాక్సిన్లు, ఇతర మెడిసిన్‌ అందుబాటులో ఉన్నా రోగులకు వాటిని అందించేందుకు వైద్యులు.. సిబ్బంది తక్కువ సంఖ్యలో ఉన్నారు. పట్టణాలు, గ్రామాలు, తండాల్లో ప్రతీసారి డెంగీ, మలేరియా, విషజ్వరాలు చాలామందికి వస్తున్నాయి. వీరంతా ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. డాక్టర్లు లేక ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్తున్నారు. విష జ్వరాల బారిన పడిన పేదలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే స్థోమతలేక ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యం చేయించుకుంటున్నారు. అయితే వారికి పూర్తిస్థాయి వైద్యం అందడం లేదు. కొన్నిరకాల మందులు ప్రైవేట్‌లో కొనాల్సి వస్తోంది. ప్రభుత్వ వైద్యం సరిగా అందక రోగులు కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోతున్నారు. యంత్రాంగం ఆసుపత్రులపై దృష్టిసారించి పూర్తిస్థాయి వైద్యులను, సిబ్బందిని నియమించి రోగులకు అన్ని రకాల మందులను సమయానికి అందించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.


పెరుగుతున్న డెంగీ కేసులు

జిల్లాలో రోజురోజుకూ డెంగీ కేసులు పెరుగుతున్నాయి. వాతావరణ పరిస్థితులు.. వర్షాల కారణంగా దోమలు విజృంభిస్తున్నాయి. జిల్లాలో జనవరి నుంచి ఇప్పటివరకు 61 డెంగీ కేసులు నమోదయ్యాయి. గుంతల్లోని మురుగునీటిలో దోమలు వృద్ధి చెందుతున్నాయి. ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి నిర్వహిస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోందని ప్రజలు అంటున్నారు. నివేదికల్లో మాత్రం అధికారులు ప్రగతిని చూపిస్తున్నారు. కానీ గ్రామాల్లో పారిశుధ్యం లోపించింది. మురుగు నీరు రోడ్లపై పారి లోతట్టు కాలనీల్లోకి చేరుతోంది. దుర్గంధం, దోమల బెడదతో ప్రజలు అల్లాడుతున్నారు. 


పెద్దాస్పత్రులకు రెఫర్‌

సీజనల్‌ వ్యాధులతో ప్రజలు అవస్థ పడుతున్నారు. డెంగీ, డయేరియా, విష జ్వరాలతో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే అక్కడ సరైన చికిత్సలు చేయడం లేదు. ఓపీ మాత్రమే చూస్తున్నారు. రోగిని ఇన్‌పేషెంట్‌గా చేర్చుకోవడం లేదు. పెద్దాస్పత్రులకు రెఫర్‌ చేస్తున్నారు. దీంతో పేద రోగులు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చూపించుకునే ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు భాస్కర ఆసుత్రికి, మరికొందరు పట్నం మహేందర్‌రెడ్డి ప్రైవేట్‌ ఆసుపత్రులకు(మెడికల్‌ కళాశాల ఉన్న ఆసుపత్రులు) వెళ్తున్నారు. చేవెళ్ల, షాద్‌నగర్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో గత సోమవారం ఇన్‌పేషెంట్‌ ఒక్కరూ లేరు. బెడ్లు అన్నీ ఖాళీగా ఉంటున్నాయి.


అర్బన్‌ వైపే వైద్యుల ఆసక్తి

గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేందుకు డాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. నగర శివారు ప్రాంతాల్లో పనిచేసేందుకే ఇష్టపడుతున్నారు. జిల్లాలో 93 పల్లె దవాఖానాలకు సంబంధించి 93 మంది ఎంబీబీఎస్‌ డాక్టర్లు అవసరం. వాటిల్లో ఇప్పటివరకు 21మంది మాత్రమే పనిచేసేందుకు ముందుకు వచ్చారు. వాళ్లలోనూ శివారు ప్రాంతాల్లోనే పనిచేసేందుకు ఆసక్తి చూపుతోన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌, శంషాబాద్‌, సరూర్‌నగర్‌లలో పనిచేసేందుకు డాక్టర్లు ముందుకు వచ్చారు. వారిని ఎంపికచేసి ఆయా ప్రాంతాల్లోనే నియమించారు. షాద్‌నగర్‌, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలో పనిచేసేందుకు డాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. మరోసారి నోటిఫికేషన్‌ వేసి ఖాళీ పోస్టులను భర్తీ చేసే విషయమై ఇటీవల నిర్వహించిన జడ్పీ సమావేశంలో చర్చకు వచ్చింది.


సీజనల్‌ వ్యాధుల వివరాలు

(2022 జనవరి నుంచి జూలై వరకు)

డయేరియా, కడుపులో ఇన్ఫెక్షన్‌ : 2,899

బంక విరోచనాలు : 283

అంతుబట్టని జ్వరం : 3,566

కుక్క కాటు : 2,893

పాముకాటు : 29

డెంగీ : 61

మలేరియా : 01 





Updated Date - 2022-08-05T04:47:31+05:30 IST