‘భగీరథ’ నీరు బంద్
ABN , First Publish Date - 2022-12-15T00:22:09+05:30 IST
మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో మూడు రోజులుగా వికారాబాద్ మునిసిపల్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పట్టించుకోని మునిసిపల్ కమిషనర్
ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిపెట్టని యంత్రాంగం
వికారాబాద్, డిసెంబరు 14: మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో మూడు రోజులుగా వికారాబాద్ మునిసిపల్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ పనులు నిలిచిపోవడంతో పట్టణంలోని ఆయా వార్డుల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వికారాబాద్ పట్టణానికి గతంలో నీరందించిన శివసాగర్ చెరువు నుంచి సరైన పైపులైన్ సదుపాయం లేకపోవడం, కాలనీల్లో కనీసం బోరు ద్వారా నీటిని అందించే సదుపాయం లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. పట్టణంలోని రామయ్యగూడ, ఇంద్రానగర్, గంగారం, కొత్తగడితో పాటు పలు కాలనీల్లో ప్రజలు నీటి కోసం ఎదురు చూస్తున్నారు. మిషన్ భగీరథ నీరు ఎప్పుడు సరఫరా చేస్తారో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కౌన్సిలర్లు, లైన్‌మెన్లు కొంత వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా.. కేవలం నాలుగు ట్యాంకర్లతో 34 వార్డులకు నీరందించాల్సి రావడంతో వారు సైతం ఇబ్బందులు పడుతున్నారు. కాగా, వికారాబాద్ మునిసిపాలిటీకి శివసాగర్ ద్వారా నీటినందించాల్సి ఉన్నప్పటికీ సరైన పైపులైన్ వ్యవస్థ లేక సరఫరా చేయలేక పోతున్నారు. కొన్ని రోజులుగా భగీరథ నీరు రావడంలో ఇబ్బందులపై, ప్రత్యామ్నాయ చర్యలు ఏమిటనే కోణంలో మీడియాలో కథనాలు వచ్చినా మునిసిపల్ చైర్‌పర్సన్ కానీ, కమిషనర్ కానీ ఏమాత్రం చర్యలు తీ సుకోవడం లేదు. ఇప్పటికైనా మునిసిపల్ యంత్రాంగం భగీరథ నీటి కోసం ప్రత్యామ్నాయ చర్య లు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.