వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-10-08T05:12:51+05:30 IST

వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
బషీరాబాద్‌ : కాగ్నా నది వరద ఉధృతిని పరిశీలిస్తున్న అధికారులు

బషీరాబాద్‌/తాండూరు రూరల్‌/ఘట్‌కేసర్‌, అక్టోబరు 7 : వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు. గత మూడు రోజులుగా భారీ వర్షాలకు కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున పరిసరాల్లోకి ఎవరినీ వెళ్లనివ్వరాదని బషీరాబాద్‌ తహసీల్దార్‌ ఎన్‌.వెంకట్‌స్వామి, ఎంపీడీవో రమేష్‌ స్థానిక ప్రజా ప్రతినిధులకు సూచించారు. శుక్రవారం జీవన్గి కాగ్నా నది పరివాహక ప్రాంతాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన స్థానికులతో మాట్లాడుతూ నదిలో నీటి ఉధృతి అధికంగా ఉన్నందున ఎవరూ అటువైపుగా వెళ్లకూడదని సూచించారు. యువకులను, పిల్లలను నది వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు తెలిపారు.

అదేవిధంగా వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బషీరాబాద్‌ ఎస్‌ఐ అన్వేష్‌రెడ్డి సూచించారు. స్థానిక విలేకర్లతో ఆయన మాట్లాడుతూ మండలంలోని జీవన్గి, క్యాద్గీరా, ఇందర్‌చెడ్‌ నదీపరివాహక ప్రాంతంలోని ప్రజలు వర్షాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. శిథిలావస్థలో ఉన్న పురాతన కట్టడాలు, ఇళ్లలోని కుటుంబాలు ప్రభుత్వ అధికారుల సాయంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. జీవన్గి, నవాంద్గీ వద్ద కాగ్నానది ఉధృతి ఎక్కువగా ఉందని అటువైపు ఎవరూ వెళ్దొదన్నారు.

అదేవిధంగా పాత, శిథిలావస్థకు చేరిన ఇళ్లు, గుడిసెల్లో నివాసముంటున్న ప్రజలు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తాండూరు మండలం కరన్‌కోట్‌ ఎస్‌ఐ మధుసూదనరెడ్డి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు హెచ్చరించారు. మండల పరిధిలోని గ్రామాల్లో  శిథిలావస్థకు చేరిన ఇళ్లల్లో నివాసముండటం మంచిది కాదన్నారు. వర్షానికి నదులు, కుంటలు, చెరువుల్లో భారీగా నీరు చేరుతుండటంతో పెద్దలు తమ పిల్లలను అటువైపుగా వెళ్లనివ్వకుండా చూడాలని సూచించారు. పాత మిద్దెలు, గోడల పక్కన ఎవరూ నిల్చోకూడదని తెలిపారు. తడిసిన స్తంభాలను, విద్యుత్‌ మీటర్లను ముట్టుకోవద్దని, స్వీచ్‌ బోర్డులను తాకవద్దని తెలిపారు. పొడిగా ఉన్న చిన్న కర్ర లేదా ప్లాస్టిక్‌ వస్తువులతో స్విచ్ఛులు వేయాలని సూచించారు. చిన్న పిల్లలను కరెంటు సరఫరా అయ్యే వస్తువుల వద్దకు పోనివ్వకుండా చూసుకోవాలన్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం, సంఘటన జరిగితే వెంటనే డయల్‌-100కు కాల్‌ చేసి సమాచారం అందించాలని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

  • అలుగుపారిన ఘట్‌కేసర్‌ చిన్న చెరువు

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువుల్లో వరద నీరు చేరి అలుగులు పారుతున్నాయి. ఈక్రమంలో మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లోని చిన్న చెరువు అలుగు పారింది. దీంతో వరద నీరు ఇళ్ల మధ్యలోంచి పారుతుండడంతో జనాలు ఇబ్బందులు పడకుండా మునిసిపల్‌ సిబ్బంది  ఎక్స్‌కవేటర్‌ సాయంతో వరద నీటిని డ్రైనేజీలోకి మళ్లించారు.  పరిస్థితిని చైర్‌ పర్సన్‌ ముల్లి పావని,  కౌన్సిలర్‌ నాగజ్యోతితో కలిసి పరిశీలించారు.


Read more