సర్కారు బడుల్లో..’జియో’ అటెండెన్స్‌

ABN , First Publish Date - 2022-11-28T23:56:54+05:30 IST

టీచర్ల హాజరును పటిష్టంగా నమోదు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ బడుల్లో జియో అటెండెన్స్‌ను అమలు చేయాలని నిర్ణయించింది.

సర్కారు బడుల్లో..’జియో’ అటెండెన్స్‌

టీచర్లు, సిబ్బందికి తప్పనిసరి

ప్రత్యేక యాప్‌ ద్వారా హాజరు నమోదు

పైౖలట్‌ ప్రాజెక్టుగా రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల ఎంపిక

టీచర్ల హాజరును పటిష్టంగా నమోదు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ బడుల్లో జియో అటెండెన్స్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం పైలట్‌ ప్రాజెక్టుగా రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలను ఎంపిక చేసింది. మొబైల్‌ యాప్‌ ద్వారా జియో అటెండెన్స్‌ నమోదు చేయనున్నారు. రెండు మూడు రోజుల్లో ఈ జియో అటెండెన్స్‌ అమలు చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : సర్కారు బడుల్లో బోధన, బోధనేతర సిబ్బందికి మొబైల్‌ యాప్‌ ద్వారా జియో హాజరు అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అనాదిగా వస్తున్న రిజిస్టర్లలో హాజరును నమోదు విధానానికి స్వస్తి పలికేందుకు విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక పాఠశాలల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ఈ కొత్త తరహా కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఉపాధ్యాయ సిబ్బంది మొబైల్‌ యాప్‌ ద్వారా తమ హాజరును సమయానికి జియో అటెండెన్స్‌లో వేయాలి. ఈ ప్రక్రియను జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని నిర్ణయించారు. బోధన, బోధనేతర సిబ్బంది హాజరును తప్పనిసరిగా నమోదు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. టీచర్లు, సిబ్బంది విధులకు హాజరై సెల్ఫీ తీయగానే ఫొటోతో సరిపోల్చుకొని, అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా వారు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు. ఇందుకు కోసం ప్రత్యేకంగా జియో అటెండెన్స్‌ మొబైల్‌ యాప్‌ను తయారు చేశారు. ఇదివరకు ప్రభుత్వ బడుల్లో బయోమెట్రిక్‌ హాజరు అమలు చేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో 2020 మార్చి నుంచి దీనిని నిలిపివేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి బయోమెట్రిక్‌ హాజరును తప్పనిసరి చేస్తూ ఆగస్టులో ఆదేశిలిచ్చారు. అయితే ఇప్పుడు దీనిస్థానంలో జియో అటెండెన్స్‌ అమలు చేయనున్నారు. టీచర్లు స్కూలుకు హాజరైనప్పుడు, విధులు ముగించుకుని వెళుతున్న సయంలో ఫొటో తీసుకోవాలి. ఇంటర్నెట్‌ పని చేయకపోయినా ఆఫ్‌లైన్‌లో ఉన్నా.. వివరాలు నమోదవుతాయి. ఇంటర్నెట్‌ పునరుద్దరించిన తర్వాత యాప్‌ తీసుకుంటుంది.

’జియో’ అటెండెన్స్‌ త్వరలో ప్రారంభించనున్నాం :సుశీందర్‌రావు, జిల్లా విద్యాధికారి

జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ’జియో’ అటెండెన్స్‌ త్వరలో అమలు చేయనున్నాం. జియో అటెండెన్స్‌ విధానంతో పరిపాలన మరింత సులభతరం కానుంది. టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది సమయానికి పాఠశాలకు రావడం, సమయం ముగిసిన తర్వాత స్కూల్‌ నుంచి వెళ్లడం జరుగనుంది. ఏ ఉపాధ్యాయుడు పాఠశాలకు ఎంత సమయం ముందు వచ్చాడు. ఏ టీచర్‌ ఆలస్యంగా వచ్చారో ఈనూతన విధానం ద్వారా తెలిసిపోతుంది. ’జియో’ అటెండెన్స్‌ అమల్లోకి వస్తే.. ఉపాధ్యాయుల హాజరు శాతం పెరిగేందుకు అవకాశముంది.

Updated Date - 2022-11-28T23:56:55+05:30 IST