అంత్యక్రియలకు ఏర్పాట్లు.. మృతదేహంలో కదలిక

ABN , First Publish Date - 2022-12-31T00:05:38+05:30 IST

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళను ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు పరీక్షించి ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు.

అంత్యక్రియలకు ఏర్పాట్లు.. మృతదేహంలో కదలిక
మాజీ ఎంపీపీ జయశ్రీ ఇంటి వద్ద బంధువులు, జయశ్రీ (ఫైల్‌)

కొత్తూర్‌ మండలం పెంజర్లలో ఘటన

కొత్తూర్‌, డిసెంబరు 30: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళను ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు పరీక్షించి ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా ఆమె పెదాలు కదిలించడంతో కుటుంబసభ్యులు అవాక్కయ్యారు. ఈ ఆశ్చర్యకరమైన ఘటన కొత్తూర్‌ మండలంలోని పెంజర్ల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెంజర్ల గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ మామిడి జయశ్రీ (45) కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. 5రోజుల క్రితం ఆమెకు ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా జయశ్రీ శుక్రవారం ఉదయం మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. జయశ్రీని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తీసుకువచ్చి కిందకు దింపుతుండగా ఆమె పెదవులు కదపడాన్ని కుటుంబసభ్యులు, గ్రామస్థులు గుర్తించారు. ఇంట్లోకి తీసుకెళ్లాళ్లి కొన్ని పాలు కూడా అందించారు. జయశ్రీ ప్రస్తుతం కొన ఊపిరితో ఉంది. ఇదిలా ఉండగా జయశ్రీ మృతిచెందిందని భావించిన కుటుంబసభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఇందుకు శ్మశానవాటికలో గోతిని సైతం తవ్వారు. ఇంటి ముందు టెంట్లు వేశారు. జయశ్రీ బతికి ఉందని తెలుసుకున్న కుటుంబసభ్యులు అంత్యక్రియలను రద్దు చేసుకున్నారు. టెంట్లు తీసివేయించారు. జయశ్రీ మృతి చెందిందన్న విషయం తెలియడంతో బంధువులు, స్నేహితులు, ఆయా పార్టీల నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు వారి ఇంటికి చేరుకున్నారు. ఆమె బతికే ఉందని తెలుసుకుని ఆశ్చర్యంతో వెనుదిరిగారు. జయశ్రీ భర్త మామిడి శ్యాంసుందర్‌రెడ్డి గతంలో కొత్తూర్‌ జడ్పీటీసీగా సేవలందించారు.

Updated Date - 2022-12-31T00:05:39+05:30 IST