మరో ఛాన్స్‌

ABN , First Publish Date - 2022-12-07T22:55:50+05:30 IST

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో భాగంగా రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.6 వేలను మూడు విడతల్లో అందించేందుకు ఈ నెలాఖరులోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని కేంద్ర ప్రభుత ్వం నిర్ధేశించింది.

 మరో ఛాన్స్‌
ఈ కేవైసీపై చేయించుకుంటున్న రైతులు.(ఫైల్‌)

ఈనెల 31తో ముగియనున్న ఈ కేవైసీ గడువు

మేడ్చల్‌ జిల్లాలో 15,592 మంది రైతులు

సగం మంది ఈ కేవైసీ చేయించుకోని రైతులు

ఆధార్‌కు ఫోన్‌ నంబర్‌ లింక్‌ కాక అవస్థలు..

మేడ్చల్‌ డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో భాగంగా రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.6 వేలను మూడు విడతల్లో అందించేందుకు ఈ నెలాఖరులోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని కేంద్ర ప్రభుత ్వం నిర్ధేశించింది. గతంలో రెండు సార్లు గడువును పొడగించినా చాలా మంది రైతులు ఈ కేవైసీ చేయించుకోకపోవడంతో మరోమారు అవకాశం కల్పించింది. పలు రాష్ట్రాల్లో బోగస్‌ పేర్లను లబ్దిదారులుగా నమోదు చేసుకుని గత సీజన్‌లో నిధులు కాజేసిన వైనాన్ని కేంద్రం గుర్తించింది. ఈక్రమంలో అర్హులను గుర్తించేందుకు ఈ కేవైసీని తప్పనిసరి చేసింది. ఈ కేవైసీని పూర్తి చేసిన రైతులకు మాత్రమే రూ.2 వేల చొప్పున మూడు సార్లు చెల్లింపులు చేయాలని లేదా నమోదు కాకుంటే ఈ సీజన్‌ నుంచి నిధులు నిలిపివేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

15,592 మంది రైతులు

రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ. 5వేల చొప్పున ప్రతీ సీజన్‌కు రైతుల ఖాతాలో పెట్టుబడి సాయాన్ని జమ చేస్తున్నది. ఇదే పథకం లాగా కేంద్ర ప్రభుత్వం సైతం ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన పథకాన్ని నాలుగేళ్ల నుంచి అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఎంత వ్యవసాయ భూమి ఉన్నా ఎకరాకు ఏడాదికి రూ. 6 వేల చొప్పున విడతల వారీగా అందిస్తున్న విషయం విదితమే. ఈ పథకానికి జిల్లాలో 15,592 మంది రైతులు అర్హులుగా ఉన్నారు. వీరందరికి కేంద్ర ప్రభుత్వం నిధులను జమ చేస్తూ వస్తోంది. ఈ సీజన్‌ నుండి ఈ పథకం కింద ఉన్న రైతులు ఈ కేవైసీ చేయించుకున్న వారికే పెట్టుబడి సాయం అందుతుందని కేంద్రం ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఇప్పటికీ ఈ కేవైసీ చేయించుకోని రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయలేదు. ఇప్పటి వరకు కేవలం 7,967 మంది రైతులు మాత్రమే ఈ కేవైసీ చేయించుకున్నారు. 7,625 మంది రైతులు ఇంకా ఈ కేవైసీ చేయించుకోలేదు.

అనుసంధానం ఇలా..

రైతులు ముందుగా పీఎం కిసాన్‌ పథకం వివరాలు ఇచ్చినా తమ బ్యాంకు ఖాతాకు ఆధార్‌ కార్డును అనుసంధానం చేసుకోవాలి. తదుపరి ఆధార్‌ కార్డుకు ఫోన్‌ నంబర్‌ను అనుసంధానం చేయాలి. అనంతరం పీఎం కిసాన్‌ పోర్టల్‌లో ఆధార్‌ ఆధారితంగా ఈ కేవైసీ చేస్తున్నప్పుడు ఫోన్‌ నంబర్‌కు వచ్చే రెండు ఓటీపీలను నమోదు చేస్తేనే ఈ కేవైసీ పూర్తవుతుంది. సెల్‌ఫోన్‌లో పీఎం కిసాన్‌ యాప్‌ ద్వారా లేదంటే పోర్టల్‌ ద్వారా నేరుగా కామన్‌ సర్వీస్‌ సెంటర్‌లో కూడా ఈ కేవైసీని పూర్తి చేయాలి. ఆధార్‌ ద్వారా ఈ కేవైసీని పూర్తి చేసిన అర్హులైన రైతులు బ్యాంక్‌ ఖాతాకు నిధులు విడుదల చేస్తారు. బోగస్‌ రైతులను జాబితా నుండి తొలగిస్తారు.

అవగాహన కరువు

ఆధార్‌ అనుసంధానం, ఈ కేవైసీని చేసుకోవడం గురించి చాలా మంది రైతులకు తెలియదు. ఇవి చేసుకోలేక కొంత మంది రైతులు ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ పథకాలకు నోచుకోలేకపోతున్నారు. తాజాగా కేంద్రం ఈ కేవైసీ తప్పనిసరి చేసింది. కానీ క్షేత్రస్థాయిలో ఈ విషయమే చాలా మంది రైతులకు తెలియదు. వ్యవసాయాధికారులు ఆయా మండలాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ కేవైసీ చేసుకోవాలని వె ళ్తున్న వారికి మీ సేవ కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు, ఆధార్‌కు ఫోన్‌ నంబర్‌లు లింక్‌ లేకపోవడం లాంటి కారణాలతో తిరుగాల్సి వస్తోంది.

Updated Date - 2022-12-07T22:55:51+05:30 IST