ప్రమాదంలో గుర్తుతెలియని మహిళ మృతి

ABN , First Publish Date - 2022-12-31T23:54:51+05:30 IST

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతిచెందిన ఘటన షాద్‌నగర్‌లో శనివారం ఉదయం చోటుచేసుకుంది.

ప్రమాదంలో గుర్తుతెలియని మహిళ మృతి

షాద్‌నగర్‌, డిసెంబరు 31: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతిచెందిన ఘటన షాద్‌నగర్‌లో శనివారం ఉదయం చోటుచేసుకుంది. సోలీపూర్‌ చర్చి వద్ద మహిళ రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో ఆమె తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న సీఐ నవీన్‌కుమార్‌ ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందన్నారు. ప్రమాదంలో మృతదేహం నుజ్జునుజ్జు కావడంతో గుర్తుపట్టలేని విధంగా మారిందన్నారు. మృతురాలి సంబంధీకులు ఎవరైనా ఉంటే షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించాలని సీఐ సూచించారు. మృతదేహాన్ని పట్టణంలోని కమ్యూనిటీ ఆసుపత్రిలో ఉంచామని తెలిపారు.

నీటి కుంటలో పడి మరొకరు..

చౌదరిగూడ: ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మహిళ మృతిచెందిన ఘటన జిల్లేడ్‌ చౌదరిగూడ మండలంలోని జాకారం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంజల్‌పహాడ్‌ గ్రామానికి చెందిన బీస గౌరమ్మ(55) అనే మహిళ శనివారం జాకారం గ్రామ శివారులోని నీటి కుంటలో దుంపగడ్డలు ఏరేందుకు వెళ్లింది. ఈ క్రమంలో ఈత రాకపోవడంతో నీట మునిగి మృతిచెందింది. గమనించిన గ్రామస్థులు ఆమె మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు పోలీసులకు సమాచారం అందజేశారు. మృతురాలి కుమార్తె వరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై బాలస్వామి తెలిపారు.

Updated Date - 2022-12-31T23:54:51+05:30 IST

Read more