‘అగ్నిమాపక’ డబుల్‌ ధమాకా

ABN , First Publish Date - 2022-11-18T23:15:34+05:30 IST

పారిశ్రామిక ప్రాంతమైన షాద్‌నగర్‌ నియోజకవర్గంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక అగ్ని ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. కానీ అందుబాటులో ఒకే ఒక ఫైరింజన్‌ వాహనం ఉంది. ప్రమాదం జరిగినప్పుడు అది రంగంలోకి దిగే సరికి పుణ్యకాలం గడిచిపోతుంది.

‘అగ్నిమాపక’ డబుల్‌ ధమాకా
షాద్‌నగర్‌ అగ్నిమాపక కేంద్రం

రెండో యూనిట్‌గా షాద్‌నగర్‌ అగ్నిమాపక కేంద్రం

వేగంగా ప్రమాదాల నివారణకు అవకాశం

భవన నిర్మాణం కోసం ఉద్యోగుల ఎదురు చూపులు

షాద్‌నగర్‌, నవంబరు 18 : పారిశ్రామిక ప్రాంతమైన షాద్‌నగర్‌ నియోజకవర్గంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక అగ్ని ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. కానీ అందుబాటులో ఒకే ఒక ఫైరింజన్‌ వాహనం ఉంది. ప్రమాదం జరిగినప్పుడు అది రంగంలోకి దిగే సరికి పుణ్యకాలం గడిచిపోతుంది. మరోవైపు సిబ్బందికి కూడా సరైన వసతి లేక పరిస్థితి ఆగమ్య గోచరం మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అగ్నిమాపక కేంద్రాన్ని కొనసాగింపుగా డబుల్‌ యూనిట్‌ను మంజూరు చేయడం ద్వారా ఉద్యోగులకు కొంత ఊరట కలిగిస్తుంది. ఆధునిక పరికరాల ద్వారా వేగంగా ప్రమాదాల నివారణకు నడుం బిగిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే..

షాద్‌నగర్‌ నియోజకవర్గ కేంద్రానికి 1975లో పారిశ్రామిక ప్రాంతంగా గుర్తింపు వచ్చింది. 1990వ సంవత్సరం వచ్చే సరికి వందల సంఖ్యలో పరిశ్రమలు విస్తరించాయి. ఈ క్రమంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగించింది. అగ్ని ప్రమాదాలను నివారించేందుకు షాద్‌నగర్‌ పట్టణంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని పరిశ్రమల యజమానులు, కార్మికులు పలుమార్లు అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. ఆనాటి షాద్‌నగర్‌ ఎమ్మెల్యే శంకర్‌రావు కూడా అగ్నిమాపక కేంద్రం ఎంత అవసరమో ప్రభుత్వంతో చర్చించి 2007లో పట్టణానికి అగ్నిమాపక కేంద్రాన్ని మంజూరు చేయించారు. కానీ ఒకే ఒక్క ఫైర్‌ ఇంజన్‌ను ఇవ్వడంతో భారీ అగ్ని ప్రమాదాలను నివారించడంలో వైఫల్యాలు తప్పలేదు. ఇప్పటికీ కూడా ఒక వాహనం మాత్రమే ఉంది. దీని కెపాసిటీ 4,500 లీటర్లు. కానీ ప్రతీ సంవత్సరం 70 నుంచి 80 అగ్నిప్రమాదాలు నియోజకవర్గ పరిధిలో పలుచోట్ల జరుగుతూనే ఉన్నాయి. కొత్తూరు, నందిగామ లాంటి పారిశ్రామికవాడల్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది. భారీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు షాద్‌నగర్‌ సమీపంలోని చేవేళ్ల, ఇబ్రహీంపట్నం నుంచి ఫైర్‌ ఇంజన్లను రప్పిస్తున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం పెద్ద ఎత్తున జరిగిపోతుంది. మరో వైపు సుమారు ఎకరం స్థలంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో రెండు గదులను మాత్రమే నిర్మించారు. అందులో ఒకటి కార్యాలయం నిర్వహణకు పోగా, మరో గదిని సిబ్బంది కోసం ఏర్పాటు చేశారు. కేవలం ఒక్క గదిలో ముగ్గురు, నలుగురు సిబ్బంది ఉండాలంటే ఇబ్బందికరంగా మారింది.

కొత్త వెలుగు

షాద్‌నగర్‌ అగ్నిమాపక కేంద్రాన్ని డబుల్‌ యూనిట్‌గా మార్చేందుకు రంగం సిద్ధం అయింది. దీనికి సంబంధించి గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ కేంద్రంలో 12 మంది సిబ్బంది అందుబాటులో ఉండగా, కొత్త నిబంధనల ప్రకారం ఆ సంఖ్య 17కు పెరగనుంది. భవన నిర్మాణం కూడా చేపట్టే అవకాశం ఉన్నందున సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. డబుల్‌ యూనిట్‌లో భాగంగా ఆధునిక పరికరాలతో కూడిన మరో వాహనం కూడా అందుబాటులోకి రానుంది. దీనివల్ల గతంలో కన్నా మెరుగైన సేవలను అగ్నిమాపక శాఖ అందించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

డబుల్‌ యూనిట్‌గా మార్చడం హర్షణీయం

షాద్‌నగర్‌ అగ్నిమాపక కేంద్రాన్ని డబుల్‌ యూనిట్‌గా మార్చడం హర్షణీయం. పట్టణ అగ్నిమాపక కేంద్రాన్ని డబుల్‌ యూనిట్‌గా మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. ప్రస్తుతం ఒకే ఒక ఫైర్‌ ఇంజన్‌ ఉండటం వల్ల పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలను వెంటనే నివారించడం కష్టతరమవుతుంది. డబుల్‌ యూనిట్‌ మంజూరు ద్వారా మరో ఫైర్‌ ఇంజన్‌ పట్టణానికి రానుంది. దీనివల్ల అగ్ని ప్రమాదాలను వెంటనే నివారించే అవకాశం ఉంది.

- పినాపాక ప్రభాకర్‌, కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్‌

కార్మికులకు ఊరట

డబుల్‌ యూనిట్‌ మంజూరు కావడం పట్ల కార్మికులకు ఎంతో కొంత ఊరట లభిస్తుంది. పరిశ్రమల్లో తరచూ ఎక్కడో ఒకచోట అగ్ని ప్రమాదాలు సంభవిస్తూనే ఉంటాయి. సిబ్బంది కొరత వల్ల వాటిని వెంటనే నివారించడంలో కొంత ఇబ్బందులు వస్తున్నాయి. డబుల్‌ యూనిట్‌ మంజూరు ద్వారా సిబ్బంది సంఖ్య పెరగడమే కాకుండా అదనంగా మరో ఫైర్‌ ఇంజన్‌ కూడా మంజూరు కానున్నట్లు తెలిసింది. దీంతో అగ్ని ప్రమాదాలను వెంటనే నివారించే అవకాశం కలిగింది.

- మహేందర్‌ గౌడ్‌, కార్మికుడు

Updated Date - 2022-11-18T23:15:34+05:30 IST

Read more